అతని పాదం కింద తొమ్మిది శిఖరాలు

ఆరంకెల్లో జీతం.. ఏసీ గదిలో ఉద్యోగం... మాదాసు రోహిత్‌రావు జీవితం బిందాస్‌గా గడిచిపోతోంది... అయినా నాన్నలా కాస్తైనా మంచి పేరు సంపాదించాలని ఏదో కసి..

Published : 23 Mar 2024 00:26 IST

ఆరంకెల్లో జీతం.. ఏసీ గదిలో ఉద్యోగం... మాదాసు రోహిత్‌రావు జీవితం బిందాస్‌గా గడిచిపోతోంది... అయినా నాన్నలా కాస్తైనా మంచి పేరు సంపాదించాలని ఏదో కసి... అది తీర్చుకోవడానికి పర్వతారోహణ బాట పట్టాడు... ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికి తొమ్మిదింటిని అధిరోహించాడు... తాజాగా కిలిమంజారోని జయించాడు.
ఆ సాహస ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు.

రోహిత్‌ది పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి. నాన్న శ్రీనివాసరావు పారా అథ్లెట్‌. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూనే అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రోహిత్‌ చదువు పూర్తయ్యాక ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. మంచి వేతనమే. కానీ తండ్రికి తగ్గ తనయుడిగా ఏమీ చేయలేకపోతున్నాననే అసంతృప్తి వెంటాడేది. ఈ క్రమంలో ఓసారి పర్వతారోహణ వీడియో వీడియో ఒకటి చూశాడు. దానికి సంబంధించి అన్ని విషయాలూ తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. దాంతోపాటే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరం అధిరోహించాలనే కోర్కె మొదలైంది. అదే తన ఆశయాన్ని నిలబెట్టే ఓ దారిలా కనిపించింది.
లక్ష్యం ఎంత గొప్పదైతే దాన్ని చేరుకోవడం అంత కష్టం కదా! చిన్న కొండ ఎక్కాలంటేనే ఆపసోపాలు పడతాం. మరి ఎవరెస్ట్‌ని అధిరోహించాలంటే మాటలా? అందుకే శిక్షణ కోసం ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ అడ్వెంచర్‌ టూర్‌ సంస్థను సంప్రదించాడు. కొన్నాళ్లు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. అప్పటికే రోహిత్‌కి సైక్లింగ్‌లో ఆసక్తి, అనుభవం ఉన్నాయి. అది బాగా ఉపయోగపడింది. ఆపై 2018లో తన పర్వతారోహణ యాత్ర మొదలైంది. 3,810 మీటర్ల ఎత్తుండే కేదార్‌కాంత పర్వతంతో మొదలై.. ఈ ఆరేళ్లలో పంగర్‌చులా, స్టాక్‌ కాంగ్రీ బేస్‌ క్యాంప్‌, బ్రహ్మతాళ్‌, దయారా బుగ్యాల్‌, డుజో జోంగో, ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌, కాంగ్‌యాస్టేలు పూర్తి చేసి.. ఈమధ్యే 5,985 మీటర్ల ఎత్తైన కిలిమంజారోని సైతం విజయవంతంగా అధిరోహించాడు.

అడుగడుగునా సవాళ్లే...

ఈ తొమ్మిది శిఖరాలు ఎక్కడానికి సగటున ఒక్కోదానికి ఎనిమిది రోజుల సమయం తీసుకున్నాడు రోహిత్‌. ఈ క్రమంలో ప్రతిరోజూ ఓ సాహస యాత్రలాగే ఉండేదట. పైకి వెళ్తున్నకొద్దీ శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతూ కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తలతిరిగినట్టు ఉండటం.. శ్వాస ఆడకపోవడం.. వాంతులవడం.. ఇలాంటివి ఎన్నో అనుభవాలు. ఏటవాలు కొండలు, పక్కనే లోయల ప్రయాణంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. దీనికితోడు 12కేజీల బ్యాక్‌ప్యాక్‌ మోసుకుంటూ వెళ్లేవాడు. కిలిమంజారో ఎక్కుతున్నప్పుడు తాగడానికి తీసుకెళ్లిన నీరు సైతం గడ్డకట్టిందట. దాన్ని కొద్దికొద్దిగా కరిగించుకుంటూ ముందుకుసాగాడు. బేస్‌ క్యాంప్‌కి వెళ్లేసరికి పెద్ద మంచు తుపాను మొదలైంది. అక్కడే ఆగిపోతే శరీరం సైతం బిగుసుకుపోయి గడ్డ కట్టుకొనిపోయేదే. అయినా అన్నీ తట్టుకొని ముందుకే వెళ్లాడు. ఈ ప్రయాణాల్లో ప్రమాదాలబారిన పడి ఎందరో పర్వతా రోహకులు చనిపోవడం.. వాళ్ల మృతదేహాలు అక్కడే ఉండిపోవడం కళ్లారా చూశాడు. బ్రహ్మతాళ్‌, పంగర్‌చులా, కాంగ్‌యాస్టే యాత్రలప్పుడు తనూ వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక సమయంలో ‘ప్రాణానికే రిస్కు ఉండే ఈ సాహసం ఎంచుకోకుండా ఉండాల్సింది’ అనుకున్నాడు. అంతలోనే లక్ష్యం గుర్తొచ్చి తనకు తానే సర్దిచెప్పుకొని మళ్లీ సమాయత్తం అయ్యేవాడు. అందుకే ఈ పర్వతారోహణకు శారీరక దృఢత్వం ఎంత అవసరమో.. మానసిక స్థైర్యం అంతే ముఖ్యం అంటాడు రోహిత్‌. ఈ సవాళ్లకితోడు ఓ అడ్వెంచర్‌ టూర్‌ మధ్యలో ఉన్నప్పుడు తనెంతో ఇష్టపడే నాన్న క్యాన్సర్‌తో కన్నుమూశారనే వార్త విన్నాడు. అప్పుడు తీవ్ర కుంగుబాటుకి గురైనా, నాన్న ఆశయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో రెండు నెలల్లోనే మరో యాత్రకు సిద్ధమయ్యాడు. ఇక ప్రతీ ట్రెక్‌ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. క్రమంగా ఆర్థిక ఇబ్బందులూ మొదలయ్యాయి. మరోవైపు ఉద్యోగ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. అన్ని అవాంతరాలను దాటుకుంటూనే లక్ష్యంవైపు వడివడిగా అడుగులేస్తున్నాడు రోహిత్‌.


పర్వతారోహణ అంటే ప్రాణాలకు తెగించి చేసే  సాహసం. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉండదు. స్పాన్సర్లు దొరకరు. నా కిలిమంజారో యాత్రకు మాత్రం చినజీయర్‌ స్వామి అండగా నిలిచి, ఆర్థిక సాయం చేశారు. ఇందులో మిగతా క్రీడల్లా డబ్బులు, పేరు, ప్రభుత్వ గుర్తింపు ఏమీ లేకున్నా.. నాలాంటి ఎందరో ఔత్సాహికులు ముందుకొస్తూనే ఉన్నారు. శిఖరాన్ని చేరినప్పుడు.. మువ్వన్నెల జెండాను ఎగరేసినప్పుడు.. వచ్చే కిక్‌ ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉంటుంది. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అదే చోదకశక్తిలా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఈ ప్రయాణంలో మా కుటుంబ సభ్యులు ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. ఎన్ని కష్టాలున్నా.. ఎవరెస్ట్‌ని అధిరోహించడమే నా అంతిమ లక్ష్యం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని