యువ ఎమ్మెల్యేలం.. వినిపిస్తాం మా గళం!

సరదాల వయసులో సమస్యలపై సమరశంఖం పూరిస్తామంటున్నారు...కెరియర్‌ వెతుక్కునే సమయంలో జనం కోసం ఎంతో కొంత సేవ చేస్తామంటున్నారు...చిన్న వయసులోనే ఎన్నికై.. అసెంబ్లీలో అడుగు పెట్టిన ఈ యువ ఎమ్మెల్యేలు తాము రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం.. తమ ఆశలు.. ఆశయాలు.. ఆకాంక్షలు.. ఆసక్తులు ‘ఈతరం’తో ఇలా పంచుకున్నారు.

Updated : 13 Jan 2024 03:59 IST

సరదాల వయసులో సమస్యలపై సమరశంఖం పూరిస్తామంటున్నారు...కెరియర్‌ వెతుక్కునే సమయంలో జనం కోసం ఎంతో కొంత సేవ చేస్తామంటున్నారు...చిన్న వయసులోనే ఎన్నికై.. అసెంబ్లీలో అడుగు పెట్టిన ఈ యువ ఎమ్మెల్యేలు తాము రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం.. తమ ఆశలు.. ఆశయాలు.. ఆకాంక్షలు.. ఆసక్తులు ‘ఈతరం’తో ఇలా పంచుకున్నారు.


పేపర్‌బాయ్‌ నుంచి..

పేపర్‌బాయ్‌గా పని చేసిన స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రయత్నిస్తే పేదలూ రాజకీయంగా ఎదగగలరు అంటున్నారు వెడ్మ బొజ్జు.
వయసు: 37
నియోజకవర్గం: ఖానాపూర్‌

నేను ఐటీడీఏలో పెసా చట్టం సమన్వయకర్తగా ఉద్యోగం చేస్తున్నప్పుడు రకరకాల సమస్యలతో జనం వచ్చేవారు. వాటిని అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోకపోవడం బాధేసేది. అప్పుడే ప్రజల సమస్యలు తీర్చేలా రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఒక లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు ప్రశంసలతోపాటు విమర్శలూ ఎదురవుతాయని తెలుసు. నేను తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నప్పుడు లక్ష్యానికి దగ్గరవుతున్నాని చెప్పలేనంత సంతోషం కలిగింది. మా నియోజకవర్గంలోని సదర్‌మాట్‌ కాలువ, కడెం ప్రాజెక్టు అధునికీకరణ, ఆదివాసీ గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇప్పించడం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందడం.. ఇవే నా ముందున్న లక్ష్యాలు. గతంలో పేపర్‌బాయ్‌గా, విలేకరిగానూ పని చేశాను. ఎమ్మెల్యే అయ్యాక ఆనాటి మిత్రులూ వచ్చి పలకరిస్తుంటే అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఆదిలాబాద్‌లో ఏపీఆర్‌జేసీ కాలేజీలో చదివాను. మంచి విద్యార్థిలా ఉంటూ లెక్చరర్లను చాలా గౌరవించేవాణ్ని. సాధారణంగా విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం వైపు మళ్లుతుంటారు. ఇకనుంచైనా వాళ్లు పెద్దఎత్తున రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే బాధ్యత అని గుర్తించాలి. మార్పు కోసం, పేదల కష్టాలు తీర్చడం కోసం, అవినీతి నిర్మూలించడం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.
- మహ్మద్‌ రహీముద్దీన్‌, ఉట్నూరు


అనుకోకుండా ఇటువైపు..

మెట్టినింటి వారిది అమెరికాలో వ్యాపారం. అక్కడే స్థిరపడాలనుకున్నా.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఇదే కెరియర్‌ అంటున్నారు యశస్విని రెడ్డి.

వయసు: 26
నియోజకవర్గం: పాలకుర్తి

నా రాజకీయ ప్రవేశం అనూహ్యమే. మా అత్తామామలు మా ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మొదట్లో అత్తమ్మే పోటీ చేయాలనుకున్నా.. పౌరసత్వం విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో నేను దిగాల్సి వచ్చింది. రాగానే నాపై ఎన్నో విమర్శలు. మొదట్లో కొంచెం బాధ అనిపించినా తర్వాత ఇవన్నీ సహజమే అనుకున్నా. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచాక.. నియోజకవర్గమంతా తిరుగుతున్నా. కుటుంబం కోసం కేటాయించే సమయం తగ్గింది. తప్పదు.. పదవిలో ఉండి సేవ చేయాలనుకునేవారు వ్యక్తిగత ఇష్టాలు, పనుల్ని పక్కన పెట్టాల్సిందే. ఇక్కడి సమస్యలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నా. విద్య, వైద్య రంగానికి నా మొదటి ప్రాధాన్యం. రైతుల సమస్యలు తీర్చాలి. యువతకు ఉపాధి కోసం సొంత నిధులతో నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించాం. వాళ్లలో శక్తి, ఉత్సాహం ఎక్కువ. వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ధైర్యంగా, తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. సాంకేతికతపై అవగాహన ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు యువతకు ఈ రంగంలో అవకాశాలు పెద్దగా రావడం లేదు. రాజకీయేతర విషయాల్లోకి వస్తే.. టీవీ చూడటం.. స్నేహితులతో కలిసి షాపింగ్‌ నాకిష్టమైన వ్యాపకాలు. అన్నిరకాల వంటలూ చేస్తా. పానీపూరీ, పన్నీర్‌ని బాగా ఆస్వాదిస్తా.
- జి.పాండురంగశర్మ, వరంగల్‌


రాజకీయ వారసత్వంతో


వయసు: 31
నియోజకవర్గం: నారాయణపేట

ఒకవైపు రాజకీయ వారసత్వం.. మరోవైపు వైద్యవిద్య.. చివరికి రాజకీయాలనే ఎంచుకున్నారు చిట్టెం పర్ణికా రెడ్డి. ఇకపై రాజీ లేకుండా ప్రజల తరఫున పని చేస్తానంటున్నారు.  
ఒకరకంగా చెప్పాలంటే నేను అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చాను. గతంతో పోలిస్తే రాజకీయాల్లో విలువలు దిగజారుతున్న మాట వాస్తవం. వాటిని నిలబెట్టాల్సిన బాధ్యతా మనదే. గతంలో మా తాత చిట్టెం నర్సిరెడ్డి ప్యానెల్‌ స్పీకర్‌గా ఉండేవారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన కూర్చున్న కుర్చీని చూస్తూ ఉద్వేగానికి గురయ్యా. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి జీవో నెంబరు 69 అమలు చేయించడం.. ఇక్కడ అత్యధికంగా ఉన్న చేనేత కుటుంబాలకు చేయూతనివ్వడం.. యువతకు ఉపాధి కల్పించడం.. ఇవీ నా ముందున్న సవాళ్లు. మా మెడికల్‌ కాలేజీ చాలా స్ట్రిక్ట్‌. అయినా ఏదో రకంగా క్లాసులకు డుమ్మా కొట్టి స్నేహితులతో బయటికెళ్లిన సందర్భాలున్నాయి. ఆటలంటే చాలా ఇష్టం. స్కేటింగ్‌లో జాతీయస్థాయి వరకు వెళ్లాను. బాస్కెట్‌బాల్‌్ రాష్ట్ర జట్టుకు ఆడాను. ఇప్పుడు నాకో బాబు. ఏమాత్రం ఖాళీగా ఉన్నా పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తా. ఎంత ఎదిగినా నేను నేల మీదే ఉంటాను. పాలిటిక్స్‌ ఇలా ఉంటే బాగుండు.. అలా ఉంటే బాగుండు అని అనుకోవడం కాదు.. యువత చొరవ తీసుకొని రావాలి.
- నర్సింగోజ్‌ మనోజ్‌ కుమార్‌, మహబూబ్‌నగర్‌


నాన్న స్ఫూర్తితో..

వయసు: 36
నియోజకవర్గం: సికింద్రాబాద్‌

నాన్న వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. సమస్యల్ని తీర్చేందుకు అసెంబ్లీలో గళం వినిపిస్తానంటున్నారు లాస్యనందిత.
నేను రాజకీయాల్లోకి రావడానికి నాన్న సాయన్నే కారణం. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆయన నిత్యం ప్రజల్లో ఉండేవారు. అదే నాలో స్ఫూర్తి నింపింది. ఇంత చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, ‘అధ్యక్షా’ అనడం నాకో గౌరవం. ప్రజల తరఫున గళం వినిపించడం నా బాధ్యతగా భావిస్తున్నా. సికింద్రాబాద్‌లోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తా.  కాలేజీ రోజుల విషయానికొస్తే.. నేను చదువులో మెరిట్‌. స్కూల్‌, కాలేజీల్లో జరిగే వివిధ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. పన్నెండేళ్లు సంగీతంలో శిక్షణ పొంది, సికింద్రాబాద్‌ శ్రీ గణేశ దేవాలయంలో తొలి సంగీత కచేరి చేశా. కాలేజీలో అల్లరిలోనూ ముందే. ప్లాస్టిక్‌ బల్లితో ఫ్రెండ్స్‌ని భయపెట్టేదాన్ని. యువత ఆలోచనలు కొత్తగా ఉంటాయి. టెక్నాలజీని తేలిగ్గా ఉపయోగిస్తారు. ఈ ప్రతిభతో సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా వారికి ఉంటుంది.
- బీకే శ్రీకాంత్‌రాజ్‌, కంటోన్మెంట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని