Manasulo Maata: నేను.. ఆమె ప్రేమకి బానిస!

నా వయసు పాతికైనా.. పసిపిల్లలాగే అల్లరి చేస్తానంటారు నాతో పరిచయం ఉన్నవారు. నా తీరే అంత. సందడి, నేను కవలలమన్నమాట. డిగ్రీ పట్టా అందుకోగానే ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగమొచ్చింది

Updated : 29 Jul 2023 08:19 IST

నా వయసు పాతికైనా.. పసిపిల్లలాగే అల్లరి చేస్తానంటారు నాతో పరిచయం ఉన్నవారు. నా తీరే అంత. సందడి, నేను కవలలమన్నమాట. డిగ్రీ పట్టా అందుకోగానే ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. మంచి ప్యాకేజీతోపాటు పని ఒత్తిడీ ఎక్కువే ఉండేది. అదీగాక నా గోలని భరిస్తూ, కంటికి రెప్పలా కాపాడే అమ్మకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటి బాధలో ఉన్న ఓ సమయంలో ఒకడు ఫోన్‌ చేసి చిరాకు తెప్పించాడు. క్యాబిన్‌లో తిడితే బాగోదని బయటికొచ్చి అరుస్తున్నా. అప్పుడే.. ఆ పక్క నుంచి ఒకావిడ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె నిండైన రూపం చూడగానే నాలో ఎక్కడా లేని ప్రశాంతత. తెలుపూనలుపుల చెస్‌బోర్డులాంటి గళ్ల చీర.. వీపు, మెడకు అందాన్ని తెస్తూ నడుము వరకూ వేలాడుతున్న జడ. కలువల్లాంటి కళ్లు.. వాటి మధ్య కాంతులు చిందే కుంకుమతో ఉందామె. చేతిలో ఇంద్రధనస్సు రంగుల పౌచ్‌ వేసిన ఫోన్‌ పట్టుకున్నారు. ఫోన్‌ వాల్‌పేపర్‌గా చిరునవ్వుతో ఉన్న ఓ అమ్మాయి ఫొటో. వాళ్ల కూతురనుకుంటా. ఆమెను చూడగానే అమ్మే గుర్తొచ్చింది.

రెండు నెలలు ప్రయత్నిస్తే.. ఆవిడ మా ఆఫీసులోనే ఓ ప్రాజెక్ట్‌ లీడర్‌, చాలా సీనియర్‌ అని తెలిసింది. వెంటనే నాకు మరో టాస్క్‌ మొదలైంది. ఆవిడతో పరిచయమెలా పెంచుకోవాలి? స్నేహమెలా చేయాలి? వెళ్లి పలకరించగానే మాట్లాడుతుందా..? ఈ ఆలోచనలతోనే నాలుగు నెలలు గడిచాయి. కానీ ఓరోజు అనుకోకుండానే ఆ శుభ సమయం వచ్చేసింది. ఆరోజు దసరా. వాళ్ల టీంలో ఎవరూ రాలేదు. ఒక్కరే పని చేసు కుంటున్నారు. ధైర్యం చేసి లోపలికెళ్లాను. ‘హాయ్‌ మేడం.. మీరంటే నాకు చాలా ఇష్టం.. నాకో సెల్ఫీ ఇస్తారా? అనడిగా. పెద్దగా నవ్వారు. ముత్యాల వరుసలో నుంచి వెన్నెల కాంతి విరబూసినట్లు ఉందా నవ్వు. ‘ఎవరమ్మా నువ్వు.. నేనేమైనా సెలబ్రెటీనా? మన సీఈవో భార్యతో దిగు’ అంటూ నవ్వుతూనే పలకరించారు. నా వివరాలడిగారు. ఐదు నిమిషాలు అనుకుంటే అరగంట మాట్లాడారు.

అలా మొదలైంది మా పరిచయం. అప్పట్నుంచి నాకు ఎప్పుడు ఆపద వచ్చినా.. చిరాకు వేసినా.. నా చెంతకొచ్చి నా మోములో నవ్వులు పూయించి వెళ్లేవారు. ఒక్క మెసేజ్‌ పెట్టినా క్షణాల్లో నా ముందు వాలిపోయేవారు. మా స్నేహానికి ఆఫీసులో అంతా ఆశ్చర్యపోయేవాళ్లు. ఓసారి ఒక సీనియర్‌ ‘ఎవరీ అమ్మాయి?’ అని అడిగింది. ‘ఇంట్లో నా కూతురెంతో.. ఆఫీసులో ఈ అమ్మాయీ అంతే’ అని పరిచయం చేసింది. అప్పుడు మరోసారి ఫిదా అయిపోయాను. ఆమె ప్రేమకు బానిసయ్యాను. అన్నట్టు ఆమెని ప్రేమగా ‘మారాణి’ అని పిలుస్తాను. మారాణి సాహచర్యంలో పని ఒత్తిడిని ప్రశాంతంగా జయిస్తున్నాను. అమ్మకి దూరంగా ఉంటున్నానే బాధని మర్చిపోతున్నాను. కొన్ని స్నేహాలు, అనుబంధాలకు వయసు, ప్రాంతం.. ఇలాంటివేం అడ్డు రావు. ఆ పరిచయం ఎలా మొదలవుతుందో తెలియదు.. జీవితంలో గొప్ప మార్పు తెచ్చి హృదయంతో బంధాన్ని ఏర్పరుస్తుంది. మా ఈ పరిచయమై ఏడాది అవుతోంది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అంత వేగంగా గడిచిపోయింది కాలం. ఈ స్నేహం, ప్రేమ నాకు కలకాలం ఉండాలని కోరుకుంటూ.
అమ్ములు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని