నీళ్లింకిన నీ కళ్లలోకి చూడలేకపోతున్నా!

కొన్ని బంధాలు చిత్రంగా మొదలవుతాయి.. మనసుతో పెనవేసుకుపోతాయి. ఆ బంధం లేకుంటే, బతుకే లేదన్నంతగా దగ్గరవుతాయి. తనతో నా అనుబంధం అలాంటిదే.

Updated : 26 Aug 2023 07:08 IST

కొన్ని బంధాలు చిత్రంగా మొదలవుతాయి.. మనసుతో పెనవేసుకుపోతాయి. ఆ బంధం లేకుంటే, బతుకే లేదన్నంతగా దగ్గరవుతాయి. తనతో నా అనుబంధం అలాంటిదే.

తనిప్పుడు నా పక్కన లేడు. కలల్ని వెతుక్కుంటూ.. కల్లోలమైన జీవితాన్ని నిలబెట్టుకోవాలంటూ... నన్నొంటరిని చేసి వేల మైళ్ల దూరం వెళ్లిపోయాడు. తను ప్రతి క్షణం గుర్తొస్తాడు. ‘ఎలా ఉన్నావ్‌?’ ‘ఏం చేస్తున్నావ్‌?’ ‘సరిగా తింటున్నావా?’ అని అడగాలనిపిస్తుంది. కానీ అతడ్ని చూడగానే నోట్లోంచి మాట పెగలదు. ఎలా ఉన్నావు? అని అడగను. అడగలేను కూడా. ఒకవేళ తను ‘నువ్వు లేకుండా నేను బాగుంటానా..’ అంటే తట్టుకోగలనా? తను కనబడగానే అతడి రూపాన్ని నా కళ్లలోకి ఇముడ్చుకుంటాను. అతడి మనసుని నా హృదయంతో హత్తుకుంటాను. ఆఖర్లో రెండు కన్నీటి చుక్కలు నా చెక్కిలిపై రాలతాయి. అంతే. మా వీడియో కాల్‌ ముగుస్తుంది.
నా జీవితంలోకి అతడు అనుకోని అథితిలా వచ్చాడు. అన్నీ తనే అనేంతగా దగ్గరయ్యాడు. మా పరిచయం ఎలా మొదలైందో.. ఇంత దృఢంగా ఎలా మారిందో ఇప్పటికీ అర్థం కాదు. తన నవ్వు, నడవడిక, మాట, పద్ధతి.. అన్నీ నచ్చేవి. మా పరిచయం పరిణయంగా మారాలని ఎన్నెన్నో కలలు కన్నా. అమ్మాయినైనా బిడియాన్ని వదిలి తనతో మూడు ముళ్ల కోసం ఉవ్విళ్లూరా. నా ప్రేమ తననీ కదిలించిదేమో. నాతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ ఐదేళ్ల ప్రయాణంలో మామధ్య ఎన్నో అలకలు, బుజ్జగింపులు, గిల్లికజ్జాలు. అన్నీ కనురెప్పలు మూసి తెరిచినంతలోపే సర్దుకునేవి. మధ్యలో ఎన్నో కష్టాలు మమ్మల్ని నిర్దయగా కాటేశాయి. ఆ సమయంలో తను నాకు వెన్నెముక అయ్యాడు. అనారోగ్యం పాలైనప్పుడు అమ్మలా సాకాడు. ఆర్థికంగా చితికిపోయినప్పుడు భరోసానిచ్చాడు. తనూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతనైంది చేశాను. అంతా సాఫీగా సాగిపోతోంది.. ఇక ఏడడుగులే మిగిలాయి అనుకునేలోపే అమెరికా ప్రయాణం గురించి చెప్పాడు. ‘నాన్న మాట కోసం.. మన మంచి భవిష్యత్తు కోసం వెళ్లక తప్పదు’ అన్నప్పుడు నా కాళ్ల కింద భూమి కంపించింది. నన్నొదిలి అంతదూరం వెళ్తాడని తెలిస్తే.. అంత దగ్గరయ్యేదాన్ని కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ నా మనసే తనదయ్యాక.. తనే నేను. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే.. చిన్నప్పుడు స్కూలు నుంచి రాగానే ఇంట్లో అమ్మ కనిపించకపోతే ఎంతలా దిగులు పడిపోయేదాన్నో.. అలా. కానీ నిన్ను ఉన్నత స్థానంలో చూడాలనే ఆశతోనే ప్రతి కష్టాన్నీ పంటి బిగువున భరిస్తున్నాను బంగారం! ‘ఏదీ తేలికగా దొరకదు.. అలా దొరికిందేదీ నిలవదు’ అని నువ్వు చెప్పిన మాటే గుర్తొస్తుందిప్పుడు. మరి బంగారంలాంటి మనసున్న నువ్వు నా సొంతం కావడానికి ఈ మాత్రమైనా కష్టాలు పడాల్సిందేగా! అన్నట్టు, నా బెంగ నేను పడుతున్న బాధల గురించి కాదు.. నువ్వు పడుతున్న వెతల గురించే. రోజుకి 17 గంటలు పనిచేస్తూ.. నీళ్లింకిన నీ కళ్లలోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నా. కష్టమొస్తే చెప్పుకునేందుకు నీకు మనిషే కరవయ్యాడక్కడ. అవి తలచుకొని నా కళ్లకు నిద్రే కరవవుతోంది ఇక్కడ. అయినా తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. ధైర్యంగా ముందుకెళ్లు. గెలుపు నీ సొంతమవుతుంది. నడిచే దారిలో రాళ్లున్నాయని వెనుదిరగొద్దు. ప్రతి అడుగులో నీకు తోడవుతాను. లక్ష్యాన్ని సాధించి తిరిగొచ్చెయ్‌.. నేనే ఎర్రతివాచీలా మారి స్వాగతం పలుకుతాను.

ఇట్లు నీ సుందరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని