Manalo Manam: ఆ విషయం చెప్పి తప్పు చేశానా?

కొన్నాళ్ల కిందటే నాకు పెళ్లైంది. మేమిద్దరమూ ఐటీ ఉద్యోగులమే. తను మొదట్లో బాగానే ఉండేవాడు. ఓసారి ‘గతంలో ఎవరినైనా ప్రేమించావా?’ అనడిగాడు.

Updated : 08 Jul 2023 09:55 IST

* కొన్నాళ్ల కిందటే నాకు పెళ్లైంది. మేమిద్దరమూ ఐటీ ఉద్యోగులమే. తను మొదట్లో బాగానే ఉండేవాడు. ఓసారి ‘గతంలో ఎవరినైనా ప్రేమించావా?’ అనడిగాడు. దాచడం ఇష్టం లేక అంతకుముందు ఒకబ్బాయితో ప్రేమలో ఉన్న సంగతి చెప్పా. తప్పనిసరి పరిస్థితుల్లో మేం విడిపోయాం. ఆ విషయం చెప్పినప్పట్నుంచి మా ఆయనలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. ‘నాకన్నా నీ బాయ్‌ఫ్రెండ్‌ అందంగా ఉంటాడా?’, ‘మీరెన్నిసార్లు లాంగ్‌టూర్లకు వెళ్లారు?’, ‘మీ ఇంట్లోవాళ్లకీ మీ ప్రేమ సంగతి తెలిసే ఉంటుంది కదూ..’ అంటూ ఇలా వంకరగా మాట్లాడుతూ టార్చర్‌ పెడుతున్నాడు. గతం చెప్పి తప్పు చేశానిపిస్తోంది. తను మారాలంటే ఏం చేయాలి?
ఎస్‌.ఎస్‌.ఎం., ఈమెయిల్‌

మీ భర్త ఏమి చెప్పినా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో గతం ఆయన ముందు ఉంచినట్టు తెలుస్తోంది. కానీ ఆయన మనసులో ఉన్న అసలు విషయం పసిగట్టలేకపోయారు. జీవిత భాగస్వామికి ఇలాంటి గత ప్రేమ విషయాలు చెప్పే ముందు వారి ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకు ఇలా అకస్మాత్తుగా అడిగారు? అని ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు సైతం మావాళ్లు మాకే సొంతం కావాలనే పొసెసివ్‌నెస్‌తో ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తుంటారు.\

సరే.. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీ భర్త పాత విషయాల్ని జీర్ణించు కోలేకపోతున్నారని తెలుస్తోంది. పదేపదే ఆ విషయాలు అడగడం, తనతో పోల్చడం చూస్తుంటే.. మీమధ్య ఏదో జరిగి ఉంటుంది, మీ అనుబంధం గాఢంగా ఉండేది అని అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే మీరు తెలివిగా ప్రవర్తించాలి. గతంలో మీ ప్రేమికుడితో అనుబంధం ఎలా ఉన్నా? అది కేవలం ప్రేమ వరకు మాత్రమే తప్ప అంతకుమించి ఏమీ లేదని స్పష్టంగా చెప్పండి. మీ లవర్‌ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మీ భర్తనే బెస్ట్‌ అనేలా సమాధానం ఇవ్వండి. ఆయన మీకు దొరకడం అదృష్టం అనేలా ప్రవర్తించండి. మీ బంధానికి బీటలు వారకుండా ఉండేందుకు ఇలా చేయడం తప్పేమీ కాదు. ఇవన్నీ మీ ఆయన ప్రతికూల ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తాయి. దీంతోపాటు ఇంకొంచెం ఎక్కువ సమయం ఆయన కోసం కేటాయిస్తూ ప్రేమగా ఉంటే తప్పకుండా మారతారు. మీకు ప్రస్తుతం మీ సంసారమే ముఖ్యం. కాబట్టి వెంటనే ప్రయత్నం మొదలు పెట్టండి. అప్పటికీ తనలో మార్పు రాకపోతే ఒక ఫ్యామిలీ కౌన్సెలర్‌ని కలిసి సలహా తీసుకోండి. ఆల్‌ ది బెస్ట్‌.

-డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని