Updated : 25 Jan 2022 15:17 IST

AP PRC: మునిగినా.. తేలినా సరే అనుకునే సమ్మెలోకి..: వెంకట్రామిరెడ్డి

విజయవాడ: ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన  పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సాధన సమితి ముఖ్య నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణలతో కలిసి వెంకట్రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. 

‘‘ఉమ్మడి నిరసన కార్యక్రమాల్లో ఇప్పటి వరకు నేను పాల్గొనలేదు. పీఆర్సీతో మొదటి సారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలా ఒత్తిడి తీసుకురావాలని ఆందోళన చేస్తున్నాం. మునిగినా తేలినా సరే అని అనుకుని సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగుల కడుపు మండేలా అధికారులు పీఆర్సీ జీవోలు తయారు చేశారు. ఉద్యోగ సంఘాలను పూచికపుల్లలా భావించి అధికారులు జీవోలు తయారు చేశారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలోకి వచ్చి పోరాటం చేస్తున్నాం’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు. 

మాది ధర్మ పోరాటమని ప్రజలకు తెలుసు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘ఉద్యోగ సంఘాలన్నింటినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఉద్యోగుల ఉద్యమాన్ని తిప్పికొట్టాలని వైకాపా నేతలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. సర్కారు చేప్పేదానికి చేసేదానికి సంబంధం లేకపోవడం వల్లే ఉద్యమంలోకి వచ్చాం. అభిప్రాయబేధాలు పక్కనపెట్టి నాలుగు సంఘాలు ఒకటై ఉద్యమం చేస్తున్నాం. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామని.. మమ్మల్ని శత్రువుల్లాగా చూస్తున్నారు. మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులం. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా మేమే చేయాలి.

పీఆర్సీపై అశుతోష్ కమిటీ నివేదికను బయటపెట్టాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. చీకటి జీవోలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం. హెచ్ఆర్‌ఏలు, సీసీఏలు, అలవెన్సులు రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందా?మాది ధర్మ పోరాటమని ప్రజలందరికీ తెలుసు. మేము ప్రజల్లో భాగమే. మాపై ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా దుష్ర్పచారం చేస్తోంది. డీఏలతో గ్రాస్ వేతనం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తే చర్చలకు వెళతాం. మా ధర్మ పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలి. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్యోగులను బెదిరించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఉద్యమానికి పోలీసులు సహకరించాలని కోరుతున్నా’’ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి: బండి శ్రీనివాసరావు

అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు విజయవంతమయ్యాయని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులు ఎక్కడికక్కడ కదంతొక్కుతూ నిరసన తెలిపారని చెప్పారు. ప్రభుత్వాన్ని తాము మణులు, మాణిక్యాలు అడగటం లేదని.. మెరుగైనా పీఆర్సీ అడుగుతున్నామన్నారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘కొత్తగా ఏమీ లేదు.. ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించే అడుగుతున్నాం. ప్రభుత్వ కుటిలనీతిని మేం తెలుసుకున్నాం. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఉండాలని అన్ని సంఘాల నేతలం చెప్పాం. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఉద్యోగులు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనాలి. ఉద్యమాల ద్వారానే డిమాండ్లు సాధిద్ధాం. మా ధ్యాస.. శ్వాస అంతా ఉద్యోగుల డిమాండ్ల సాధనపైనే. ఈ పీఆర్సీతో ఉద్యోగులు కడుపుమండే మాట్లాడుతున్నారు. రూ.40కోసం 53 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉద్యోగులకు ఉంది. గుర్రాలతో తొక్కించినా వెరవని చరిత్ర మా పోరాటానికి ఉంది. ఉద్యోగులు శాంతియుతంగా ఉద్యమం చేయాలి. డిమాండ్లు సాధించుకునే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదు’’ అని శ్రీనివాసరావు చెప్పారు.

ప్రామాణికత లేని పీఆర్సీని పరిగణించలేం: సూర్యనారాయణ

ఉద్యమాలు మర్చిపోయిన ఉద్యోగులకు మళ్లీ దాన్ని గుర్తు తెచ్చారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగులు చెప్పినట్లుగా సంఘాల నేతలు నడుచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పారు. ఉద్యమం అంటే నాయకత్వానికి ప్రసవ వేదనలాంటిదని.. ఉద్యమం విజయవంతమైనపుడే నాయకులకు సార్థకత వస్తుందన్నారు. నాలుగు సంఘాల నేతలమంతా మనసావాచా ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏ ప్రమాణికతతో పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచారో స్పష్టత ఇవ్వాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ప్రామాణికత లేని పీఆర్సీని పరిగణించలేమన్నారు. ఇప్పటివరకు ఆడిన నాలుగు స్తంభాలాటను ఇక ప్రభుత్వానికి ఆడే అవకాశం ఇవ్వబోమన్నారు. ఉద్యోగులు వాట్సప్‌ సందేశాలతో కాకుండా బయటకు వచ్చి పోరాడాలని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. 

Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని