17న తిరుపతిలో బహిరంగ సభ

‘రాళ్లు పడతాయని బెదిరించిన వారు... పూలవర్షం కురిపిస్తున్న ప్రజా స్పందనను చూడాలి. పెయిడ్‌ ఆర్టిస్టులని ఎగతాళి చేసిన వారు... రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును తిలకించాలి.

Published : 01 Dec 2021 04:12 IST

అమరావతి ఆకాంక్షను తెలిపేలా నిర్వహిస్తామన్న ఐకాస

30వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగిన మహాపాదయాత్ర

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: నెల్లూరు గ్రామీణం, పొదలకూరు, న్యూస్‌టుడే: ‘రాళ్లు పడతాయని బెదిరించిన వారు... పూలవర్షం కురిపిస్తున్న ప్రజా స్పందనను చూడాలి. పెయిడ్‌ ఆర్టిస్టులని ఎగతాళి చేసిన వారు... రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును తిలకించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన డిసెంబరు 15కు తిరుపతి చేరుకుని, 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం. అమరావతి ఆకాంక్షను రాష్ట్రవ్యాప్తంగా చాటుతాం’ అని అమరావతి ఐక్య కార్యాచరణ వేదిక సభ్యులు స్పష్టంచేశారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 30వ రోజు నెల్లూరులో సాగింది. భారీ వర్షాలతో రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

అడ్డంకులు... ఆంక్షలు

ఈ సందర్భంగా అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ... ‘మహా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసు ఆంక్షల పేరిట వేధిస్తున్నారు. రాత్రిపూట బస చేసేందుకు స్థలాలనూ దొరక్కుండా చేస్తున్నారు. పొదలకూరు మండలం మరుపూరు అమ్మవారి ఆలయంలో బసకు ఏర్పాట్లు చేసినప్పటికీ... స్థానిక నాయకుల ఒత్తిడితో ఆలయ నిర్వాహకులు అంగీకరించలేదు. దాంతో పాలిచర్లపాడు వద్ద ఖాళీ స్థలంలో టెంట్లు వేసుకున్నాం. అక్కడ మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు’ అని తెలిపారు. మరోవైపు పాదయాత్రలో భాగంగా వస్తున్న క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను మంగళవారం పోలీసులు నిలిపేశారు. హైకోర్టు అనుమతిచ్చిన వాహనాలు మాత్రమే యాత్రలో   సాగాలని స్పష్టంచేశారు. దాంతో పాదయాత్రికులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పట్టు వీడకపోవడంతో రథాలు లేకుండానే యాత్ర ముందుకుసాగింది.

అక్రమ కేసులపై బీసీ కమిషన్‌ స్పందన

తమను పాదయాత్రలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారంటూ నాయీబ్రహ్మణ సంఘం చేసిన ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్‌ స్పందించింది. కావలిలో దేవుడి ప్రచార రథాల ముందు సన్నాయి మేళం వాయిస్తుంటే డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తమను అడ్డుకుని, కులవృత్తిని అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని కోరారు. స్పందించిన బీసీ కమిషన్‌... 15 రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని నెల్లూరు ఎస్పీ విజయరావుకు లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని