Published : 02/12/2021 04:37 IST

ఉద్యోగులారా..ఉద్యమిద్దాం

 ఇవి విజయవంతమైతేనే హామీలు అమలవుతాయి
ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతల పిలుపు
సీఎస్‌ను కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేత

ఈనాడు- అమరావతి : ‘చట్టబద్ధంగా రావాల్సిన కూలీ ఇవ్వాలని, మేం దాచుకున్న రూ.1,600 కోట్లు జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నాం. ఏ ఒక్కటీ అదనపు డిమాండ్‌ లేదు. వీటికోసం కొన్ని నెలలుగా ప్రభుత్వ పెద్దలు, అధికారులు చుట్టూ తిరిగాం. ఉద్యోగులారా మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయాం. అవి విఫలమయ్యాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నెల 7 నుంచి నిర్వహించతలపెట్టిన ఉద్యమ కార్యాచరణను తూచ తప్పకుండా అమలు చేయండి. ఇవి విజయవంతమయ్యే దాన్ని బట్టే మన హామీలు అమలయ్యే వీలుంటుంది’ అని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను కలిసి ఐక్య వేదికగా ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. అనంతరం వీరు విలేకర్లతో మాట్లాడారు. ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘11వ పీఆర్సీ అమలు చేయండి, ఒకటో తేదీన జీతాలివ్వండి, మేం దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బులు, మెచ్యూరిటీ అయిన ఏపీజీఎల్‌ఐ డబ్బులు ఇవ్వండి, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగుసేవల సిబ్బంది జీతాలు పెంచాలని కోరుతున్నాం. నెలాఖరుకు పీఆర్సీ అమలు అని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు కన్నీటి మూటలయ్యాయి. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. న్యాయం జరిగేలా కృషి చేస్తానని సీఎస్‌ చెప్పారు. ఏడో తేదీలోపు సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

 

సీఎస్‌ సమీర్‌శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘాల నేతలు

ఇంతకాలం సహకరించలేదా?
ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 27 శాతం ఐఆర్‌ ఇవ్వడంతో.. హామీల అమలుకు అయిదారు నెలలు గడువివ్వాలని భావించాం. తర్వాత కరోనా వల్ల ప్రభుత్వానికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో చాలాకాలం వేచిచూశాం. పీఆర్సీ నివేదిక ఇచ్చి మూడేళ్లయినా, డీఏలు విడతల వారీగా ఇస్తామని సీఎం చెప్పినా, కొవిడ్‌ వల్ల జీతాలను 50 శాతం ఆపినా, చిరుద్యోగుల జీతాలు 10 శాతం పక్కనపెట్టినా సహకరించలేదా? కరోనా సమయంలో నాలుగైదు వేల మంది వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోతే ఒక్కరికైనా కారుణ్య నియామకాలు చేపట్టారా? రెండుసార్లు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగినా పీఆర్సీ నివేదిక కాపీలు ఇవ్వలేదు. మాకు చూపకూడదని విషయాలు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఉద్యోగులను కించపరిచేలా ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నారు. సీఎం స్వయంగా స్పందిస్తే తప్ప, ఈ సమస్యలు పరిష్కారమయ్యే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణ బాటలోకి వెళ్లకుండా సీఎం చూస్తారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలకు ఖర్చు దుబారా కాదా?
ఎమ్మెల్యేలకు జీతాలు, వివిధ అలవెన్సుల రూపంలో లక్షలు ఇస్తున్నారని, వారి గన్‌మెన్లు, కార్యదర్శులు, కార్లకు అయ్యే ఖర్చు ఎంత? అవి దుబారా కాదా? అని ఏపీ జేఏసీ ఉప ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ప్రశ్నించారు. ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు మాట్లాడుతూ నవంబరు 30లోపు కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలిచ్చానా అమలుకు దిక్కులేదన్నారు. ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్‌ ఛైర్మన్‌ ఫణి పీర్రాజు మాట్లాడుతూ.. మేం దాచుకున్న డబ్బులను ప్రభుత్వం వేరొక రకంగా తీసుకుంటే, ఉద్యోగుల కడుపు మండుతుందని, అందుకే ఈ ఉద్యమ కార్యాచరణ అని తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని