పురపాలికల్లో ఆగిన ప్రగతి

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పూర్తిచేసిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తిచేసి 8 నుంచి 10 నెలలైనా చెల్లింపులు చేయని కారణంగా గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు.

Published : 02 Dec 2021 04:40 IST

పూర్తయిన పనులకు రూ.350 కోట్ల బిల్లుల పెండింగ్‌
కొత్త పనులు చేసేందుకు ముందుకురాని గుత్తేదారులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పూర్తిచేసిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తిచేసి 8 నుంచి 10 నెలలైనా చెల్లింపులు చేయని కారణంగా గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మొత్తం 65 పనులకు ఇప్పటికే చేసిన 35 పనులకు బిల్లులు రాలేదు. దాంతో మిగిలిన 30 పనులకు గుత్తేదారులు ముందుకు రావట్లేదు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అయితే మున్సిపల్‌ కార్యాలయం వద్ద బిల్లులు ఇప్పించాలంటూ ఫ్లెక్సీలు కట్టారు.

నియంత్రణ సరే... చెల్లింపులు ఏవీ?
పురపాలక సంఘాలకు పన్నులు, పన్నేతర పద్దుల కింద వచ్చే ఆదాయానికి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఆర్థిక సంఘం నిధుల పీడీ ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానించాక ఇంజినీరింగ్‌ పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయిన పనుల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిని ఆర్థికశాఖ ఆమోదించాక గుత్తేదారుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. పురపాలక పీడీ ఖాతాల్లో నిధులున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గుత్తేదారుల్లో చాలామంది అప్పులు తెచ్చి పనులు చేస్తారు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానానికి ముందు పనులు పూర్తయిన ఒకటి, రెండు నెలల్లో బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. దీంతో అప్పులకు వడ్డీలు భారీగా పెరిగాయని గుంటూరు జిల్లాకు చెందిన గుత్తేదారు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకే పనికి రెండు, మూడుసార్లు టెండర్లు
సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారులు ముందుకు రానందున కొన్ని పురపాలక సంఘాల్లో ఒకే పనికి రెండు, మూడుసార్లు టెండర్లు పిలుస్తున్నారు. శ్రీకాకుళం, ఉభయగోదావరి, ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో గుత్తేదారులను టెండర్లు వేయాలని ఇంజినీర్లు బతిమాలుతున్నారు. పాత పనులకు బిల్లులు చెల్లించకపోతే కొత్త పనులు చేసేందుకు పెట్టుబడులెలా వస్తాయని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌కు పీడీ ఖాతాలు అనుసంధానించాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామని పురపాలక సంఘ కమిషనర్‌ ఒకరు అన్నారు. గుత్తేదారులకు పాత బిల్లులిప్పిస్తామని హామీ ఇస్తున్నా... తమకు నమ్మకం లేదంటూ టెండర్లు వేయడం లేదని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని