AP PRC: ఎంత చేయగలమో అంత చేశాం

మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. మీ సమస్యలను అనామలీస్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు.

Updated : 07 Feb 2022 05:18 IST

మీరు లేకపోతే నేను లేను

మీ సమస్యలేవైనా ప్రభుత్వం దృష్టికి తేవొచ్చు : ముఖ్యమంత్రి జగన్‌

ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి జగన్‌

మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. మీ సమస్యలను అనామలీస్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు.

- ఉద్యోగ నేతలతో సీఎం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు బాగా పడిపోయాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 2018-19లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 15 శాతం పెరిగి 2019-20 నాటికి రూ.72 వేల కోట్లు రావాల్సి ఉండగా... రూ.60 వేల కోట్లకు పడిపోయిందని చెప్పారు. 2020-21లో రూ.84 వేల కోట్లు రావాల్సి ఉన్నా రూ.60 వేల కోట్లతోనే ఆగిపోయింది తప్ప పెరగలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించి, మీరు ఆశించినంత ఇవ్వలేకపోయినా మనసా, వాచా, కర్మణా ఎంత మేర మేలు చేయగలమో అంత చేశామని పేర్కొన్నారు. శనివారం రాత్రి మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలమైన నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నాయకులు పలువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతోనే మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నా. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. మీ సమస్యలను అనామలీస్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. వారికీ చెప్పొచ్చు. పరిస్థితులు ఇలా ఉండకపోయుంటే మిమ్మల్ని మరింత సంతోషపెట్టేవాణ్ని. మీరంతా నా దగ్గరకు సంతోషంగా వచ్చేవారు. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదు’ అని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఏటా రూ.11,577 కోట్ల భారం

ఉద్యోగ సంఘాలతో శనివారం జరిగిన చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతోనూ సంప్రదింపుల్లో ఉంది. నా ఆమోదంతోనే నిర్ణయాల్ని మంత్రుల కమిటీ మీకు చెప్పింది. అవి మీకు సంతృప్తినిచ్చినందుకు సంతోషం. 30 నెలల పాటు ఐఆర్‌ ఇచ్చాం. అందులో 9 నెలల ఐఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయించడం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్ల అదనపు భారం పడుతోంది. హెచ్‌ఆర్‌ఏను జనవరి నుంచి వర్తింపజేయటం వల్ల మరో రూ.325 కోట్లు భరించాలి. మొత్తంగా రూ.5,725 కోట్లు అవుతుంది. హెచ్‌ఆర్‌ఏ, అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌, సీసీఏల మార్పు వల్ల ఏటా రికరింగ్‌ వ్యయం రూపేణా రూ.1,330 కోట్ల మేర ప్రభుత్వం భరించాలి. వీటన్నింటి వల్ల రూ.11,577 కోట్ల మేర ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాది రికరింగ్‌ భారం పడుతుంది. ముందు ప్రకటించిన పీఆర్సీ ప్రకారం ఇది రూ.10,247 కోట్లే. ఆర్థిక పరిస్థితులు మీకు తెలియాలనే ఇవన్నీ వివరిస్తున్నా. ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేలు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్‌ వర్కర్లు అందరికీ వేతనాలు పెంచాం. వీటివల్ల 2018-19 నాటికి రూ.52 వేల కోట్లుగా ఉన్న వేతనాల బిల్లు ఈ సంవత్సరం రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజాగా దీనికి మరో రూ.11 వేల కోట్లు అదనం కానుంది.

సీపీఎస్‌పై అధ్యయనం చేస్తున్నాం

సీపీఎస్‌పై గట్టిగా పనిచేస్తున్నాం. వివరాలన్నీ ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను. మిమ్మల్నందర్నీ అందులో మమేకం చేస్తాను. కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పింఛను మంచిగా పెరిగేలా చూస్తాను. గతంలో ఎవరూ చేయని విధంగా ఉద్యోగికి జగన్‌ మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. పదవీ విరమణ తర్వాత కూడా మంచి జరగాలని ఆలోచిస్తున్నా. సీపీఎస్‌లో ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నాం. ఒప్పంద ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నాం. ఈ జూన్‌ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తాం. సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. మున్ముందు ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయి. అందరం కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం.


నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు

నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. ఎక్కడైనా తక్కువ చేస్తున్నామని అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. 24 నెలలు జీతం రూపేణా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని గుర్తుంచుకోండి. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు, మీరు చెప్పేవి వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారం కానప్పుడు మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని