Ukraine Crisis: వాయువేగంతో తరలింపు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన విమానాలను రంగంలో

Updated : 02 Mar 2022 05:42 IST

రంగంలోకి దిగనున్న భారత వాయుసేన విమానాలు

ఆ దిశగా ప్రధాని ఆదేశాలు

ఉక్రెయిన్‌ అంశంపై మరోసారి ఉన్నతస్థాయి భేటీ

దిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన విమానాలను రంగంలో దింపనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఐఏఎఫ్‌కు ఆదేశాలిచ్చినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. భారతీయుల తరలింపునకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఐఏఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వాయుదళానికి చెందిన సీ-17 విమానాలను ఉక్రెయిన్‌ పొరుగు దేశాలకు పంపనున్నట్లు సమాచారం. ఐఏఎఫ్‌కు చెందిన అతిపెద్ద రవాణా విమానాలైన ఇవి ఒక్కొక్కటి సుమారు 300 మందిని తరలించగలవు. ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యల కోసం అవసరమైన సామగ్రిని తరలించడానికీ ప్రభుత్వం ఈ విమానాలనే వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభ పరిస్థితులను, భారతీయుల తరలింపునకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయనకు వివరించారు.  మరోవైపు భారతీయుల తరలింపు అంశంపై చర్చించడానికి మోదీ మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ అంశంపై గత మూడు రోజుల్లో ప్రధాని నిర్వహించిన నాలుగో సమావేశం ఇది. ఉక్రెయిన్‌ పరిణామాలపై ప్రధాని మోదీ మంగళవారం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్ర్‌జెజ్‌డూడాతో చర్చించారు.

ఎంపీలకు జైశంకర్‌ లేఖ

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యులు తమకు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పలువురు ఎంపీలు చెప్పడంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు. ఈ విషయంపై సమాచారాన్ని అందించడానికి ఎంపీలు తన కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. అలాంటి సమస్యలను పరిష్కరించడానికి తమ శాఖ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎంపీలకు లేఖ రాశారు. అందులో తన కార్యాలయ ఈ-మెయిల్‌ ఐడీ, వాట్సప్‌ నంబర్లను పంచుకున్నారు.

తక్షణం కీవ్‌ను వీడండి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో చిక్కుకుపోయిన భారతీయులంతా తక్షణం ఆ నగరాన్ని వీడివెళ్లాలని అక్కడి భారత రాయబార కార్యాలయం మంగళవారం అడ్వైజరీ జారీ చేసింది. అయితే ఇప్పటికే భారతీయులంతా కీవ్‌ను వీడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు.


స్వదేశానికి మరో 616 మంది

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి వెళ్లిన మూడు విమానాలు మంగళవారం స్వదేశానికి చేరుకున్నాయి. వీటి ద్వారా మొత్తం 616 మంది మాతృదేశంలో అడుగుపెట్టారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి వచ్చిన రెండు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల్లో ఒకటి ముంబయిలో, మరోటి దిల్లీలో దిగాయి. హంగరి రాజధాని బుడాపెస్ట్‌ నుంచి ఇండిగో విమానం దిల్లీలో ల్యాండ్‌ అయింది. ఇప్పటివరకూ మొత్తం 9 విమానాల్లో 2,012 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇండిగో మరో నాలుగు విమానాలను, స్పైస్‌జెట్‌ ఓ విమానాన్ని పంపాయి. ఇదిలా ఉండగా తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్‌ సింగ్‌ పురి, కిరణ్‌ రిజిజు మంగళవారం ఉక్రెయిన్‌ పొరుగు దేశాలకు బయల్దేరారు. సింధియా రొమేనియాకు, పురి హంగరికి, రిజిజు స్లొవేకియాకు వెళ్లారు. మరో మంత్రి వీకే సింగ్‌ సోమవారం రాత్రే పోలండ్‌కు వెళ్లారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని