AP News:విదేశీ సాయానికి కేంద్రం మెలిక

‘రుణదాత ఇచ్చే నిధులతోపాటు మా వాటా ప్రకారం ముందుగా నిధులివ్వాల్సి ఉన్నా అలా ఇవ్వలేం. ముందు రుణ మొత్తం రుణదాత నుంచి ఇప్పించండి. ఆ సొమ్ముతో పనులు చేస్తాం. ఆనక మా వాటా

Updated : 24 Jan 2022 06:12 IST

మొత్తం రుణం ముందే ఇవ్వడం కుదరదు

అన్ని ప్రాజెక్టుల్లో మీవాటా నిధులివ్వండి

లేకుంటే గ్రామీణ రహదారులకూ అడ్వాన్సులు ఇవ్వలేమంటూ రాష్ట్రానికి లేఖ

రూ.11,290 కోట్ల ప్రాజెక్టులపై నీలినీడలు

ఈనాడు - అమరావతి

‘రుణదాత ఇచ్చే నిధులతోపాటు మా వాటా ప్రకారం ముందుగా నిధులివ్వాల్సి ఉన్నా అలా ఇవ్వలేం. ముందు రుణ మొత్తం రుణదాత నుంచి ఇప్పించండి. ఆ సొమ్ముతో పనులు చేస్తాం. ఆనక మా వాటా నిధులు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చిస్తాం’ అని ఆంధ్రప్రదేశ్‌ కోరగా.. కేంద్ర ఆర్థిక శాఖ అలా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఒప్పందం ప్రకారం మీ వాటా నిధులిచ్చి ఆ మొత్తంతో పనులు చేస్తేనే రుణమైనా, అడ్వాన్సు అయినా ఇవ్వగలమని కుండబద్దలు కొట్టింది. అంతే కాదు.. ప్రపంచబ్యాంకు సాయంతో చేపట్టిన 24×7 ప్రాజెక్టుతోపాటు విదేశీ ఆర్థికసాయంతో చేపడుతున్న అన్ని ఇతర ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటా నిధులు తక్షణమే ఏజెన్సీలకు బదిలీ చేయాలని షరతు పెట్టింది. అలా చేయకపోతే గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులో రాష్ట్రం కోరుతున్న రూ.540 కోట్ల అడ్వాన్సు కూడా ఇవ్వబోమని తేల్చేసింది. మరో 3 రహదారుల ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి పనుల పురోగతి తెలియజేయకపోతే అడ్వాన్సులివ్వడంపైనా పునరాలోచిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌కు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో రూ.11,290 కోట్ల రహదారి ప్రాజెక్టుల భవితవ్యం చర్చనీయాంశమైంది.

* ఆసియా మౌలిక సౌకర్యాల కల్పన బ్యాంకు రుణసాయంతో రూ.4,290 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,285 కోట్లు. తొలి దశలో 1,400 కి.మీ.రోడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టారు.

కొంతమేర పనులు జరిగాయి. 2019లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టు 2024లో పూర్తి కావాల్సి ఉంది. ఇంతవరకు చెప్పదగ్గ పురోగతి లేదు.

* న్యూడెవలప్‌మెంటు బ్యాంకు సాయంతో రాష్ట్రంలో మండల కేంద్రాల మధ్య, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల అనుసంధాన ప్రాజెక్టు, వంతెనల పునర్నిర్మాణం లేదా మరమ్మతును 2 ప్రాజెక్టులుగా రాష్ట్రం చేపట్టింది. రూ.6,400 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం. ఇందులో రూ.2,130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలి. తొలి దశలో రూ.2,970 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.1,860 కోట్ల సివిల్‌ పనులకు గతేడాది మార్చిలో గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంతవరకు పది శాతం పనులు కాలేదు.

ఇప్పుడెలా?

రూ.6,400 కోట్ల ప్రాజెక్టులో అప్పు మొత్తం ముందే ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇలా రుణదాతలు ఇవ్వబోరని, కేంద్రం అంగీకరించదని ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నా సరే లేఖ రాయాలని ఒత్తిళ్లు ఉన్నాయంటే ఆ ప్రాజెక్టులో రాష్ట్రం తన వాటా ఇచ్చేందుకు ఏ స్థాయిలో సిద్ధంగా ఉందో ఇట్టే అవగతమవుతుందని ఆర్థిక శాఖలోని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

* పైగా గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుకు రూ.540 కోట్ల అడ్వాన్సు ఇవ్వాలంటే విదేశీ సాయంతో చేపట్టే మిగిలిన అన్ని ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా తక్షణం చెల్లించాలని కేంద్రం షరతు పెట్టింది. తమ వాటా తర్వాత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఉంటే, ఈ ఒక్కటే కాదు అన్ని ప్రాజెక్టుల్లోనూ మీ వాటా తక్షణం ఇవ్వాలని కేంద్రం షరతు పెట్టింది. ఈ పరిస్థితుల్లో రూ.11,290 కోట్ల రోడ్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ఎలా ముందడుగు వేయిస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.


3 ప్రాజెక్టుల్లో ఇవీ షరతులు

ఎన్‌డీబీ, ఏఐఐబీ సాయంతో చేపడుతున్న రోడ్ల అనుసంధానం, వంతెనల పునరుద్ధరణ, గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి విదేశీ రుణసాయం అందించేందుకు కేంద్రం షరతులు విధించింది.

* రుణదాత రుణ మొత్తం ఇచ్చిన వెంటనే ఆ నిధులను ప్రాజెక్టు డైరెక్టర్‌ ఖాతాలోకి 7 పనిదినాలలోపు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి. తన వాటానూ నిర్దిష్ట గడువులోగా జమ చేయాలి.

* ఈ 3ప్రాజెక్టుల్లో పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు పరిస్థితి తదితర అంశాలను ప్రతి నెలా కేంద్రానికి, రుణమిస్తున్న ఏజెన్సీలకు తెలపాలి. వీటిని పరిశీలించి ప్రస్తుతం నిర్ణయించిన అడ్వాన్సు విధానం కొనసాగించాలా? లేదా? అన్నది డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ నిర్ణయిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని