ఎంపీలాడ్స్‌ పథకం పునఃప్రారంభం

పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను (ఎంపీల్యాడ్స్‌ను) కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిధులను రెండేళ్ల పాటు కరోనా నియంత్రణ

Updated : 11 Nov 2021 05:07 IST

ఈ సంవత్సరం రూ.2 కోట్లు.. వచ్చే ఏడాది నుంచి రూ.5 కోట్లు

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

నిర్ణయాలను వెల్లడిస్తున్న అనురాగ్‌ ఠాకూర్‌

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను (ఎంపీల్యాడ్స్‌ను) కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిధులను రెండేళ్ల పాటు కరోనా నియంత్రణ చర్యలకు వినియోగించాలని యోచించి, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొంది. తక్షణమే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రధాని మోదీ ఆధ్వర్యాన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఎంపీ రూ.2 కోట్లను తన నియోజకవర్గ పరిధిలో జరిగే విభిన్న పనులకు కేటాయించేందుకు అనుమతిచ్చింది. 2022-23 నుంచి 2025-26 వరకూ ఏటా మునుపటి మాదిరే రూ.5 కోట్లు వాడుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ విలేకరులకు వెల్లడించారు. దీనివల్ల 2021-22లో ఎంపీల్యాడ్స్‌ పథకం కింద రూ.1,584 కోట్లు; 2022-23 నుంచి 2025-26 వరకూ మరో రూ.15,833 కోట్లు ఖర్చుచేసే వీలుంటుందన్నారు. నాలుగేళ్లలో మొత్తం రూ.17,417 కోట్లు ఈ పథకానికి సమకూరుతాయన్నారు. కరోనా నియంత్రణలోకి రావడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, పన్నుల రాబడి ఆశాజనకంగా ఉండటంతో ఎంపీలకు ఈ నిధులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఠాకుర్‌ తెలిపారు.

సీసీఐకి రూ.17,408.85 కోట్లు

పత్తిని కనీస మద్దతుధరకు కొనుగోలు చేయడానికి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)కు రూ.17,408.85 కోట్లు ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. దీనిద్వారా 11 రాష్ట్రాల్లోని 60 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని అనురాగ్‌ ఠాకుర్‌ చెప్పారు.

* ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది నవంబరు 30 వరకూ వర్తించేలా ఇథనాల్‌ ధరలను నిర్ణయించారు. ఇదివరకు ఇథనాల్‌ మిశ్రమ పథకం కింద 2025 నాటికి పెట్రో ఉత్పత్తుల్లో 10% ఇథనాల్‌ కలపాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు మిశ్రమశాతాన్ని 20కి పెంచింది. చక్కెర మిల్లుల్లో ఉత్పత్తి అయ్యే సీ-హెవీ మొలాసిస్‌ ధరను లీటరుకు రూ.45.69 నుంచి రూ.46.66కి, బి-హెవీ మొలాసిస్‌ ధరను రూ.57.61 నుంచి రూ.59.08కి, చెరకు రసం నుంచి తయారుచేసే మొలాసిస్‌ ధరను రూ.62.65 నుంచి రూ.63.45కి పెంచాలని నిర్ణయించింది.

ఏటా నవంబరు 15న గిరిజన గౌరవ దినోత్సవం

స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని (నవంబరు 15) ఇక నుంచి ఏటా గిరిజన గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. గిరిజన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తిస్తూ... నవంబరు 15 నుంచి 22 వరకూ ‘గిరిజన ఉత్సవాలు’ నిర్వహించనున్నట్టు ఠాకుర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని