Corona: ముంచుకొస్తోంది!

రాష్ట్రంలో కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వీటిల్లో అత్యధికం ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందినవేనని తెలుస్తోంది. ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి

Updated : 12 Jan 2022 03:32 IST

5శాతాన్ని మించిన పాజిటివిటీ రేటు

పండగల వేళ మరింత ఉద్ధృతంగా కరోనా?

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వీటిల్లో అత్యధికం ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందినవేనని తెలుస్తోంది. ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కొవిడ్‌ బాధితులతో పాటు ర్యాండమ్‌గా స్థానికుల నుంచి సేకరించి పంపిన సుమారు వంద నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పరీక్షించగా 80% వరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందినవిగా తేలింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒమిక్రాన్‌ బారిన పడినవారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ చివరగా జనవరి 5న ప్రకటించింది. అప్పటికి 28 ఒమిక్రాన్‌ కేసులు రాగా, ఆ తర్వాత వివరాలను విడిగా ప్రకటించడం లేదు. కొత్తగా సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 36,452 నమూనాలు పరీక్షించగా 1,831 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467 మందికి వ్యాధి సోకగా, విశాఖలో 295, గుంటూరులో 164, కృష్ణాలో 190 చొప్పున కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,195 క్రియాశీలక కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గతేడాది డిసెంబర్‌ 27 నుంచి జనవరి 9వ తేదీ వరకు 864 మంది కొవిడ్‌ బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. జనవరి 3న 48, 4-45, 5-75, 6-73, 7-110, 8-115, 9-130, మంగళవారం 92 మంది చొప్పున ఇన్‌పేషెంట్లుగా చేరారు. విజయవాడ జీజీహెచ్‌లోని ‘కరోనా ఓపీ’లో సోమవారం అనుమానిత లక్షణాలు కలిగిన వారితో పాటు పాజిటివ్‌ బాధితులతో సన్నిహితంగా మెలిగినవారి నుంచి 150 నమూనాలు సేకరించారు. జనవరి ఒకటికి ముందు ఈ సంఖ్య 15-25 మధ్యే ఉండేది. రాష్ట్రంలో జనవరి ఒకటిన పాజిటివిటీ రేట్‌ 0.57% కాగా, మంగళవారం 5.01%గా నమోదైంది. పది రోజుల్లో ఇంతగా పెరగడాన్ని బట్టి సంక్రాంతి పండగ తర్వాత వ్యాధి ఉద్ధృతమవుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

రెండు, మూడో దశల్లో అంతరమిది!: కరోనా వేరియంట్లలో డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌ ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావం తక్కువగా ఉన్నా.. తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండో దశలో గతేడాది వేసవిలో విజృంభించిన డెల్టా వేరియంట్‌ వైరస్‌ బాధితుల ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయింది. శ్వాసకోశ సంబంధ సమస్యలు తీవ్రమై కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించాల్సి వచ్చింది. దగ్గు, జలుబు, విరేచనాలు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలామందికి రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌, ఇతర స్టిరాయిడ్లు వినియోగించారు. 14 రోజుల వరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. అదే ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో గొంతు, ముక్కులో ఇన్‌ఫెక్షన్‌, తలనొప్పి, ఇతర సమస్యలు కనిపిస్తున్నాయి. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు తక్కువగా ఉన్నాయి. కొందరికి వైరస్‌ సోకిన విషయమే తెలియడంలేదు. పారాసిటమాల్‌, సెట్రిజన్‌, ఇతర మాత్రలను వాడుతున్నారు. ఆయాసం, ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడం వంటి సమస్యలు దాదాపుగా లేవని విజయవాడ జీజీహెచ్‌ జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. డెల్టాతో పోల్చితే ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గిందన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం 15 మంది ఇన్‌పేషెంట్లుగా చేరగా, ముగ్గురు ఆక్సిజన్‌పై ఉన్నారు. అమెరికా నుంచి కోస్తాకు వచ్చిన 55 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడింది. విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొంది, కోలుకున్నారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘జలుబు, దగ్గుతో రెండు రోజులు ఇబ్బంది పడ్డాను. జ్వరం వచ్చినట్లు అనిపించినా, పరీక్షిస్తే లేదని తేలింది. షుగర్‌ దృష్ట్యా ఇన్సులిన్‌ తీసుకుంటూనే చికిత్స పొందాను.బాగా కోలుకున్నా’నని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని