ఇప్పుడు ఎలా చేస్తారో?

రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో ఐఏఎస్‌ల నియామకాలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, మౌలిక వసతులు, నిధుల కేటాయింపు కల్పన ఎలా ఉంటుందోనని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలో కలెక్టర్‌, ఇతర

Published : 27 Jan 2022 02:41 IST

ఆర్డీఓ కార్యాలయాల్లో కలెక్టర్లు!
ఉన్న వారితోనే సర్దుబాటు.. కొత్త పోస్టులకు ఆర్థికశాఖ నో

ఈనాడు, అమరావతి: రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో ఐఏఎస్‌ల నియామకాలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, మౌలిక వసతులు, నిధుల కేటాయింపు కల్పన ఎలా ఉంటుందోనని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలో కలెక్టర్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కనీసం రూ.వంద కోట్ల చొప్పున అవసరమని అంచనా వేశారు. అంటే, మొత్తం రూ.1500 కోట్ల వరకు అవసరం అవుతుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అదనంగా ఖర్చు లేకుండా చేయగలిగినంతే చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల మేరకు అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వ శాఖలను కుదించడం ద్వారా భవనాల అవసరాలు తగ్గించేలా ప్రయత్నాలు జరగబోతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 125 వరకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖల్లో వేర్వేరు కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉంటాయి. కొత్త జిల్లాల రాకతో వీటిని ఒకే చోటకు తెచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. ఆర్డీఓ కార్యాలయాలను కొన్నిచోట్ల కలెక్టరేట్లుగా మార్చే విషయాన్ని పరిశీలించనున్నారు. అక్కడే ఆర్డీవో కూడా ఉండేలా సర్దుబాటు చేసే యోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన చేసినప్పుడే ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీలు ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? వాటిల్లో ఏ ప్రభుత్వశాఖలు నడుస్తున్నాయి? జాతీయ రహదారికి ఎంత దూరంలో ఉన్నాయన్న వివరాలను సేకరించాయి. ఎస్పీ, ఇతర పోలీసు కార్యాలయాలపై పోలీసు శాఖ కసరత్తు చేసింది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో కార్యాలయాలను నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

జిల్లాకు ఇద్దరు ఐఏఎస్‌లు

ప్రస్తుతం జిల్లాల్లో జేసీ హోదాలో ఉన్న ఐఏఎస్‌లు రైతుభరోసా, గృహనిర్మాణ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, ఇతర శాఖల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇకపై పూర్వ విధానంలో మాదిరిగానే కలెక్టర్‌ కాకుండా జేసీగా మరో ఐఏఎస్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలపలేమని ఆర్థికశాఖ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. దీనివల్ల కొత్త పోస్టులు అవసరమయ్యే చోట ఇప్పటికే ఉన్నవాటిని ఉన్నతీకరించి, సర్దుబాటు చేస్తారని తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం జిల్లాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గుతోంది. ఇలా ఒత్తిడి తక్కువగా ఉన్న ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించి, మార్గదర్శకాలు వెలువరిస్తారని తెలిసింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఉద్యోగుల కేటాయింపులో అనుసరించిన విధివిధానాలు, అక్కడ ఇప్పటికీ ఉన్న సమస్యలనూ పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించనున్నారు.

ఇకపై వరుస సమావేశాలు

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వశాఖలు పూర్తిగా ఇటువైపేదృష్టి కేంద్రీకరించనున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నాయి. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేలోపే ముఖ్యమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని