AP PRC: సహకరించని ఉద్యోగులపై కఠిన వైఖరి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారమే కొత్త జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ శనివారం సాయంత్రం

Updated : 30 Jan 2022 03:38 IST

 జీతాల బిల్లుల చుట్టూ వివాదం

ఆదివారం కూడా పనిచేయాలని ఆదేశం

డీడీవోలు, ఎస్‌టీవోలపై క్రమశిక్షణ చర్యలకు ఉత్తర్వు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారమే కొత్త జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం జనవరి 29 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు జీతాల బిల్లులు సమర్పించని డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులు, వాటిని ప్రాసెస్‌ చేయని ఉప ఖజానా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘జీతాల బిల్లులు సమర్పించేందుకు, ప్రాసెస్‌ చేసేందుకు ఏయే రోజుల్లో ఏ ప్రక్రియ పూర్తి చేయాలో నిర్దేశిస్తూ స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా చాలా మంది డీడీవోలు, ఎస్‌టీవోలు ఆ మేరకు పనులు చేయలేదు. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రోజు వారీ వేతన పనివారు, కంటింజెన్సీ ఉద్యోగులు, ఆశావర్కర్లు, హోంగార్డులు, అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే ప్రక్రియను నిర్వర్తించని వారిపై చర్యలు తీసుకుంటాం. ఇందుకు బాధ్యులైన వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని జిల్లా కలెక్టర్లు, ఖజానా డైరెక్టర్‌, పే అకౌంట్సు, తదితర సంబంధిత అధికారులకు నిర్దేశించాలి...’ అని పేర్కొన్నారు.

బిల్లుల సమర్పణ మందగమనమే

జిల్లా కలెక్టర్లు రంగప్రవేశం చేసి డీడీవోలు బిల్లులు సమర్పించాల్సిందే అని ఉన్నతాధికారులను, డీడీవోలను నిర్దేశించినా ఉద్యమ కార్యాచరణలో ఉన్న సిబ్బంది ఆ ఆదేశాలను శనివారం ఖాతరు చేయలేదు. కొందరు డీడీవోలు నేరుగా జిల్లా కలెక్టర్లకే స్పష్టంగా తమ నిరసన తెలియజేశారు. పీఆర్‌సీకి వ్యతిరేకంగా తాము బిల్లులు సమర్పించకూడదని నిర్ణయించుకున్నామన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 1.10 లక్షల బిల్లులు సమర్పించగా శనివారం ఆ సంఖ్య మరో 7 వేలు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అందరు ఖజానా అధికారులు ఆదివారం కూడా పని చేసి జీతాల బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.


పాత జీతాలే ఇవ్వండి అందుకే బిల్లులు సమర్పించలేదు
కొత్తవలస తహసీల్దారు లేఖ

ఈనాడు, విజయనగరం: ఉద్యోగులంతా పాత జీతాలే ఇవ్వమని కోరుతుండటంతో జనవరి నెలకు బిల్లులు సమర్పించలేదని పేర్కొంటూ విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారికి కొత్తవలస తహసీల్దారు డీఎంజీఎన్‌ ప్రసాదరావు లేఖను పంపించారు. అలాగే జిల్లాలోని పలువురు తహసీల్దార్లు కూడా పంపించినట్లు సమాచారం. కార్యాలయంలోని ఉద్యోగులంతా గతంలో ఇచ్చిన పాత జీతాలే ఇవ్వాలని, కొత్త ఉత్తర్వుల ప్రకారం ఇస్తే పీఆర్సీ పెంచాలని వినతిపత్రం అందించారని పేర్కొన్నారు. ప్రస్తుత పీఆర్సీ ప్రకారమైతే తక్కువ జీతం వస్తుందని పునరాలోచన చేయాలని కోరారు. దీనిపై కలెక్టరు సూర్యకుమారి స్పందిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీ ఉత్తర్వు ప్రకారమే జీతాలు చెల్లిస్తామని, డ్రాయింగ్‌ బిల్లుల అధికారి శనివారం సాయంత్రంలోగా  జీతభత్యాల బిల్లులు సమర్పించాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని