Chandra babu:వైకాపా మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వరు

వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎవరూ బతకలేరని.. బతకనివ్వరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కల్తీ సారా కారణంగా జంగారెడ్డిగూడెంలో ప్రజలు చనిపోతే ముఖ్యమంత్రే స్వయంగా సహజ మరణమంటున్నారని..

Updated : 17 Mar 2022 09:18 IST

కల్తీ సారా మరణాల్ని ముఖ్యమంత్రే  సహజ మరణాలంటున్నారు

అదే నిజమైతే పోలీసులు కేసులెందుకు పెట్టారు?

తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎవరూ బతకలేరని.. బతకనివ్వరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కల్తీ సారా కారణంగా జంగారెడ్డిగూడెంలో ప్రజలు చనిపోతే ముఖ్యమంత్రే స్వయంగా సహజ మరణమంటున్నారని.. ఇలాంటి పాలనను, సీఎంను ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. సహజ మరణాలైతే పోలీసులు కేసులు ఎందుకు పెట్టారు? వైద్యుల నివేదికలో మద్యం వల్లే మరణాలు సంభవించాయని ఎందుకు వచ్చింది? అని నిలదీశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నివాళులర్పించి, ఆర్యవైశ్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం పోలీసుల్ని, అధికారుల్ని పంపి వేధిస్తోందని ఆర్యవైశ్యులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ చర్యను విమర్శించినా కేసులు పెడుతున్నారని తెలిపారు. తమకు కూడా అట్రాసిటీ లాంటి ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పించాలని విన్నవించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పాలన పూర్తిగా రౌడీరాజ్యంగా మారింది. వైశ్యులంటే సీఎం జగన్‌కు చులకనగా ఉంది. నలుగురికి ఉపాధి కల్పించే, సేవ చేసే ఆర్యవైశ్య వర్గంపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం దారుణం. వ్యాపారులను ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోంది. వసూళ్లకు పాల్పడుతోంది. రాష్ట్రంలో జీఎస్టీతోపాటు జేఎస్టీ (జగన్‌ ట్యాక్స్‌) అదనంగా కట్టాల్సి వస్తోంది’ అని మండిపడ్డారు. దీనిపై పోరాటంలో బాధితులకు తెదేపా అండగా ఉంటుందన్నారు.

రోశయ్యకు నివాళులర్పించడానికి జగన్‌కు మనసు రాలేదు: పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని చంద్రబాబు కొనియాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఉన్నతస్థాయికి వెళ్లిన రాజకీయ ఉద్ధండుడు కొణిజేటి రోశయ్యను కూడా ప్రభుత్వం తగురీతిలో గౌరవించలేదు. రోశయ్యకు నివాళులర్పించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌కు మనసు రాలేదు. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్‌రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే తెదేపా హయాంలో ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టాం. ఇప్పుడు రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ఎందుకు పేరు పెట్టరు? మేం అధికారంలోకి వచ్చాక రోశయ్యను తగిన విధంగా గౌరవిస్తాం’ అని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని