New Army Chief: నూతన సైన్యాధిపతి మనోజ్‌ పాండే

భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ప్రధాన

Updated : 19 Apr 2022 06:32 IST

తొలిసారి ఇంజినీర్‌కు ఆర్మీ బాధ్యతలు

దిల్లీ: భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మనోజ్‌ పాండే.. వచ్చే నెల 1న సైన్యాధిపతిగా బాధ్యతలు చేపడతారు. సైన్యంలోని ‘కోర్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌’ విభాగం నుంచి వచ్చిన ఒక అధికారి.. అత్యున్నత స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ పదాతి దళం, శతఘ్ని, ఆర్మర్డ్‌ రెజిమెంట్ల అధికారులకు మాత్రమే సైన్యాధిపతి పదవి లభించేది. మనోజ్‌ పాండే ప్రస్తుతం ఉప సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆయన ఆర్మీలోని తూర్పు విభాగానికి నాయకత్వం వహించారు. ఆ హోదాలో సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ రక్షణ బాధ్యతలను పర్యవేక్షించారు. ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఆయన 1982లో సైన్యంలోని కోర్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ద బాంబే శాపర్స్‌)లో చేరారు. నాలుగు దశాబ్దాల సర్వీసులో ఆయన సైన్యంలోని పలు కీలక పదవులను నిర్వహించారు. జమ్మూ-కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఇంజినీర్‌ రెజిమెంట్‌కు, పశ్చిమ విభాగంలో ఇంజినీర్‌ బ్రిగేడ్‌కు, లద్దాఖ్‌లో పర్వత విభాగానికి నేతృత్వం వహించారు. ఇథియోపియా, ఎరిట్రియాల్లో ఐరాస తరఫున చీఫ్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించారు. త్రివిధ దళాలతో కూడిన అండమాన్‌, నికోబార్‌ కమాండ్‌కు సారథ్యం వహించారు. మనోజ్‌ పాండేకు పరమ్‌ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం వంటి పురస్కారాలు లభించాయి. ఆర్మీ చీఫ్‌ పదవి కోసం పాండేతోపాటు జై సింగ్‌ నయన్‌, అమర్‌దీప్‌ సింగ్‌ భిందర్‌, యోగేంద్ర దిమ్రీ పేర్లను కేంద్రం పరిశీలించింది కేంద్రం.

సీడీఎస్‌ రేసులో నరవణె?

ఉమ్మడి విభాగాల (థియేటర్‌ కమాండ్‌లు) ఏర్పాటు ద్వారా త్రివిధ దళాలను ఏకీకృతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మనోజ్‌ పాండే నియామకం జరిగింది. కొత్త సీడీఎస్‌ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఆ పదవికి పోటీపడుతున్న వారిలో నరవణె ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని