Andhra News: వైకాపా పాలనలో ఊరికో కాలకేయుడు

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వైకాపా నాయకులంతా సిగ్గుతో తలదించుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత,...

Updated : 27 Apr 2022 05:16 IST

నిందితుల్లో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులే ఎక్కువ
మూడేళ్లలో వెయ్యికిపైగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు
తెదేపా నేతలు వంగలపూడి అనిత, బొండా ఉమా ధ్వజం
‘జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది’ పేరుతో పుస్తకం విడుదల

ఈనాడు, అమరావతి: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వైకాపా నాయకులంతా సిగ్గుతో తలదించుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో అధికార పార్టీ వాళ్లే ఎక్కువగా ఉన్నారని, చివరకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ‘జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది’ పేరుతో తెదేపా రూపొందించిన 50 పేజీలకు పైగా పుస్తకాన్ని వారు మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. బొండా ఉమా మాట్లాడుతూ... ‘‘జగన్‌రెడ్డి పాలనలో ఊరికొక ఉన్మాది, కాలకేయుడు ఉన్నారు. రాష్ట్రంలో మహిళల్ని వేధింపులకు గురి చేసిన వారి జాబితాలో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నారని ఇటీవల విడుదలైన ఒక జాతీయ స్థాయి సర్వే నివేదిక బయట పెట్టింది...’’ అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఆడబిడ్డల మాన, ప్రాణాలకు ధర కడుతున్నారు. ఇంకెంతకాలం డబ్బులిచ్చి అత్యాచార బాధితుల నోళ్లు మూయించాలని చూస్తారు? బాధితురాలు బీసీ మహిళ అయితే రూ.10 లక్షలు, ఎస్సీ మహిళ అయితే రూ.5 లక్షలు ఇస్తూ... మాన ప్రాణాలకు కూడా విభజించి విలువ కడుతున్న పైశాచిక పాలన చూస్తున్నాం....’’ అని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ‘‘ఎవడైనా ఒక ఆడబిడ్డను పొడిచి చంపేస్తే... నిందితుడిని అరెస్ట్‌ చేశారా? లేదా అని చూడటం లేదు. వెంటనే హోం మంత్రి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వచ్చేసి బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు చెక్‌ ఇచ్చేస్తున్నారు. దళిత ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే రూ.5 లక్షలు తీసుకో... అని అంటున్నారు. అంటే వాళ్లు డబ్బులిస్తే వీళ్లు నోరు మూసేయాలా..’ అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో మహిళలపై ఇన్ని అత్యాచారాలు, హత్యాకాండలు జరిగితే... ఒక్క కేసులోనైనా దోషులకు శిక్ష విధించామని చెప్పే ధైర్యం సీఎంకి, హోం మంత్రికి ఉన్నాయా అని పేర్కొన్నారు.

కాలకేయులు వీళ్లే...!

‘‘మూడేళ్ల వైకాపా పాలనలో వెయ్యి మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగాయంటేనే మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమెంతో అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో మూడో వంతు ఏపీలోనే వెలుగు చూస్తున్నాయి...’’ అని ఆ పుస్తకంలో తెదేపా ధ్వజమెత్తింది.  జాతీయ స్థాయిలో వివిధ నేరాలకు సంబంధించి రాష్ట్రం ఏ స్థానంలో ఉందో... నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలో వెల్లడించిన వివరాలను ప్రచురించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, అసభ్య ప్రవర్తన, వేధింపులకు సంబంధించిన 717 సంఘటనలు, బాధితుల జాబితాను పొందుపరిచారు.

మహిళల్ని వేధించిన కేసుల్లో పలువురు వైకాపా నేతలంటూ... వివిధ సెక్షన్‌ల కింద కేసులు ఎదుర్కొంటున్న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాలు కూడా పుస్తకంలో ఇచ్చారు.

మహిళా ఉద్యోగినులకు వైకాపా నేతల వేధింపులు

2022 మార్చి 19: కడప ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ పద్మజపై అప్పటి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాటలతో దాడి చేశారు. అప్పటి కడప ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌ విజయరామరాజు సమక్షంలోనే ఆ మహిళా అధికారిణిని కంటతడిపెట్టేలా చేశారు.

2021 డిసెంబరు 6: మేం చెప్పిన మాట వినకపోతే చీరేస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎంపీడీఓ కె.ఆర్‌.విజయపై వైకాపా నేత వాసంశెట్టి తాతాజీ దాడి.

2020 జూన్‌ 8: అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ డాక్టర్‌ అనితారాణికి స్థానిక వైకాపా నేతల వేధింపులు.

2019 అక్టోబరు 5: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి. చెప్పిన సమయానికి ఆయన బంధువు కృష్ణారెడ్డి లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వలేదని బూతుల దండకం. ఇంటి విద్యుత్‌ వైర్లు కట్‌ చేశారు. వాటర్‌ పైప్‌లైన్లు ధ్వంసం చేశారు. స్వయంగా స్టేషన్‌కి వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించలేదు.

తీవ్రమైన నేరాలు ఇవీ..!

మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కొన్ని తీవ్రమైన నేరాల వివరాలను పుస్తకంలో వివరంగా పొందుపరిచారు. వాటిలో కొన్ని ఇవీ..!

2022 ఏప్రిల్‌ 20: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం ఘటన.  రాష్ట్రంలో శాంతిభద్రతల ఘోర వైఫల్యానికి నిదర్శనం. నిందితుల్ని పట్టుకున్నామని హడావుడి చేసిన హోం మంత్రి వనిత దిశ చట్టం కింద శిక్ష విధించే అంశంపై నోరు మెదపలేదు.

2022 డిసెంబరు 9:  పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. నిందితుల్ని శిక్షించకపోగా బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా నేతలు బీటెక్‌ రవి, వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసు నమోదు చేశారు. బీటెక్‌ రవిని 14 రోజులు జైల్లో పెట్టారు.

2021 జూన్‌ 21: తాడేపల్లిలోని సీఎం ఇంటికి కూత వేటు దూరంలో కృష్ణానది ఒడ్డున సీతానగరం ఘాట్‌లోకి కాబోయే భర్తతో సరదాగా మాట్లాడేందుకు వెళ్లిన ఎస్సీ యువతిపై అత్యాచారం. వారిలో ప్రధాన నిందితుడైన వెంకటరెడ్డిని ఇంతవరకు పట్టుకోలేదు.

2021 ఫిబ్రవరి 24: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష అనే యువతిని వైకాపా కార్యకర్త విష్ణువర్థన్‌రెడ్డి గొంతు నులిమి చంపేశాడు. తనను ప్రేమించనందుకు ఆ యువతిని బలి తీసుకున్నాడు.

2021 ఆగస్టు 3: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురంలో ఇంటి అవసరాల కోసం తన దగ్గర అప్పు తీసుకున్న రమావత్‌ మంత్రుబాయి అనే మహిళను వైకాపా నేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు.

2020 డిసెంబరు 23: అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే ఎస్సీ యువతిని రాజేశ్‌ అనే కిరాతకుడు అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. తన కుమార్తెను రాజేశ్‌ వేధిస్తున్నాడని అంతకుముందే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.

2021 అక్టోబరు 1: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న దంపతులపై దుండగులు దాడి చేశారు. భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్వయంగా బాధితురాలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కన్నీరు పెట్టుకున్నా పోలీసులు స్పందించలేదు.

2020 డిసెంబరు 19: ఒంగోలులో వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న ఉమ్మినేని భువనేశ్వరి అనే దివ్యాంగురాలిని తన త్రిచక్ర వాహనంలోనే దుండగులు సజీవ దహనం చేశారు.

2020 జులై 18: రాజమండ్రిలో 16 ఏళ్ల ఎస్సీ బాలికపై నాలుగు రోజుల పాటు ఏడుగురు యువకుల అత్యాచారం.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మనేరంపల్లిలో ఒక బీసీ యువతిపై అమ్మిరెడ్డి నాగేంద్రబాబురెడ్డి అనే వ్యక్తి అత్యాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని