CRDA: రాజధాని రైతులకు రూ.184 కోట్ల కౌలు చెల్లింపు

రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్‌డీఏ మంజూరు చేసింది. సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో రెండు

Updated : 29 Jun 2022 08:53 IST

వారి ఖాతాల్లో రెండు విడతల్లో జమ

ఈనాడు, అమరావతి: రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్‌డీఏ మంజూరు చేసింది. సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో రెండు విడతల్లో ఆ నిధులను జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కౌలు చెల్లింపు కోసం రూ.208 కోట్లకు బడ్జెట్‌ను విడుదల చేసింది. దీని నుంచి సుమారు 23వేల మందికి పైగా రైతులకు రూ.184 కోట్లను వారి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ నెల 27న రూ.112 కోట్లు, మంగళవారం  మిగిలిన రూ.72 కోట్లను వేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.195 కోట్లకు బడ్జెట్‌ విడుదల చేయగా... రూ.188 కోట్లను కౌలు కింద చెల్లించారు. ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో ఉన్న భూములను మినహాయించారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం విదితమే. అలాగే పట్టా భూములకు సంబంధించిన వివాదాలు కోర్టుల్లో ఉన్నందున వీటికి కూడా ప్రతిపాదనలు తయారు చేయలేదు. ఇవి కొలిక్కి వచ్చిన తర్వాత కౌలు ఇస్తామని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ విభాగాలకు సంబంధించి సుమారు రూ.15 కోట్ల వరకు కౌలు ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తాన్ని నిలుపుదల చేశారు. ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన కౌలును మూడేళ్ల నుంచి ఆలస్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము భూములిచ్చి సీఆర్‌డీఏ కార్యాలయం, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు రానుండడంతోనే కౌలు మొత్తాన్ని అధికారులు చెల్లించారని రైతులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని