పేపర్ల కొనుగోలుకూ డబ్బుల్లేవ్‌!

విధుల నిర్వహణలో మానసికంగానే కాకుండా, ఆర్థికంగానూ తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖవే కాకుండా ఇతర శాఖల పనులూ చేస్తున్నా

Published : 04 Jul 2022 04:40 IST

సమస్యలను ఏకరవు పెట్టిన వీఆర్వోలు

ఇకపై ‘ఏపీ జేఏసీ అమరావతి’తో కలిసి పని చేయనున్నట్లు వెల్లడి

ఈనాడు, అమరావతి: విధుల నిర్వహణలో మానసికంగానే కాకుండా, ఆర్థికంగానూ తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖవే కాకుండా ఇతర శాఖల పనులూ చేస్తున్నా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని వాపోతున్నారు. శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రేడ్‌-2 వీఆర్వోల సంఘం, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్వో సంఘాల ప్రతినిధులు ఆదివారం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్వోలు సమస్యలను ఏకరవు పెట్టారు. ధ్రువపత్రాల మంజూరుకు అవసరమైన పేపర్ల కొనుగోలుకూ ప్రత్యేకంగా నిధుల్లేవన్నారు. విధి నిర్వహణలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అనంతరం 3 సంఘాల అధ్యక్షులు కోన ఆంజనేయులు, సుధాకర్‌ చౌదరి, ప్రసన్న కుమార్‌తో కలిసి ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న ఈ సంఘాలు ఇకపై ‘ఏపీ జేఏసీ అమరావతి’తో కలిసి పని చేస్తాయని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు పార్టీలకు అనుబంధమని ప్రకటిస్తున్న పరిస్థితుల్లో వీఆర్వోలకు పారదర్శక సమాచారం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని