Published : 05 Jul 2022 04:39 IST

కూల్చేందుకు మీకెంత ధైర్యం?

రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు అధికారులపై వైకాపా నేత శివారెడ్డి వీరంగం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ‘మీకు ఎంత ధైర్యం ఉంటే నేను కట్టించిన నిర్మాణాన్నే కూల్చేందుకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా వస్తారు..? అక్రమ నిర్మాణాలు పట్టణంలో చాలా ఉన్నాయి. అవి కూల్చాకనే ఇటు వైపు రండి.. లేదంటే బాగోదు. నోటీసు ఇస్తే... దానిపై నేను ఇచ్చే సమాధానంపై సంతృప్తి చెందని పక్షంలో మీ పని కానీయండి...’ అని రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు అధికారులపై స్థానిక వైకాపా నేత శివారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కదిరి పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన అడపాల వీధిలో సర్వే నెం.206లో 86 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. 2006లో ఇందులో సంపన్నులైన పలువురు ఇంటి పట్టాలు పొందారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడం, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఆ పట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. లబ్ధిదారుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఇక్కడ పట్టా పొందిన వైకాపా నేత శివారెడ్డి గత నెలలో భవన నిర్మాణ పనులు చేపట్టారు. భాజపా నాయకులు ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో శనివారం కదిరి తహసీల్దారు గోపాలకృష్ణ బదిలీ అయ్యారు. ఈ బదిలీ విషయం తెలుసుకొని తాజాగా ఆదివారం రాత్రి శివారెడ్డి మళ్లీ పనులు ప్రారంభించి గోడలు కట్టేశారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దారు గోపాలకృష్ణ (రిలీవ్‌ కాలేదు), ఉప తహసీల్దారు ముకుంద, రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో పాటు అర్బన్‌ సీఐ మధు, సిబ్బంది అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు అక్కడకు చేరుకున్నారు. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, మిగతా ప్రాంతాల్లోని నిర్మాణాలు కూల్చేశాక రావాలని శివారెడ్డి అడ్డుకున్నారు. బలవంతంగా తొలగిస్తే రెవెన్యూ అధికారుల అవినీతిని ఆధారాలతో బయటపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నిస్తానంటూ బెదిరించారు. పార్టీలోని ఇతర నాయకులకు ఆయన ఫోన్‌ చేశారు. దాంతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, కుమ్మరవాండ్లపల్లి సర్పంచి కుమారుడు మణికంఠ నాయక్‌తో పాటు మరికొందరు నేతలు అక్కడికి చేరుకున్నారు. శివారెడ్డికి మద్దతుగా వారు అధికారులతో పరుష పదాలతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చేందుకు మీకు ఎంత ధైర్యం అని ప్రశ్నిస్తూ... ఆవేశంతో ఊగిపోయారు. ఆధారాలతో కార్యాలయానికి రావాలంటూ వారికి చెప్పి తహసీల్దారు ఇతర సిబ్బంది, పోలీసులతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై తహసీల్దారు గోపాలకృష్ణ మాట్లాడుతూ... ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts