Andhra News: వైకాపాకు ఓటేసి తప్పు చేశాం.. చెప్పులతో కొట్టుకుంటూ నిరసన

‘సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటేసి పెద్ద తప్పు చేశాం’ అంటూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని గిరిజనులు చెప్పులతో కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని

Updated : 06 Jul 2022 07:38 IST

దేేవరాపల్లి, న్యూస్‌టుడే: ‘సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటేసి పెద్ద తప్పు చేశాం’ అంటూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని గిరిజనులు చెప్పులతో కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని వాలాబు పంచాయతీకి చెందిన రామన్నపాలెం, కోడాపల్లి, పూలగరువు, కె.టి.పాలం తదితర గిరిజన గ్రామాల ప్రజలు మంగళవారం దేవరాపల్లి మండల పరిషత్తు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత మండలంలోని గ్రామాలకూ రోడ్లు లేకపోవడం సిగ్గు సిగ్గంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాలాబు ప్రజలు మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓట్లేశాం. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ మద్దతుదారులను ఎన్నుకోలేదు. దీంతో అప్పటి నుంచి గ్రామంపై కక్ష పెంచుకున్న ఉపముఖ్యమంత్రి, వైకాపా నేతలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలంటూ మండల పరిషత్తు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి బి.టి.దొర తెలిపారు. పోడు భూములను సాగు చేస్తున్న వారిలో చాలా మందికి పట్టాలివ్వకుండా పాలకపక్షమే అడ్డుపడుతోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని