పట్టుపట్టి సాధించారు

కుటుంబ ప్రోత్సాహమే తనను టాపర్‌గా నిలిపిందని రాణి సుస్మిత చెప్పారు. కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు కావడం, భర్త సహా అందరి ప్రోత్సాహం లభించడం తన

Published : 06 Jul 2022 05:44 IST

గ్రూపు-1 ర్యాంకర్ల మనోగతం కుటుంబ ప్రోత్సాహమే గెలిపించింది

గ్రూపు-1 టాపర్‌ రాణి సుస్మిత

పిఠాపురం, న్యూస్‌టుడే: కుటుంబ ప్రోత్సాహమే తనను టాపర్‌గా నిలిపిందని రాణి సుస్మిత చెప్పారు. కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు కావడం, భర్త సహా అందరి ప్రోత్సాహం లభించడం తన విజయానికి కారణమని పేర్కొన్నారు. తొలి 5 ర్యాంకుల్లో నిలుస్తానని భావించానని, మొదటి ర్యాంకు రావడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. పదో తరగతి వరకూ పిఠాపురంలో చదువుకున్నట్లు వివరించారు. ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా... గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలతో గ్రూప్స్‌కు సాధన చేసినట్లు చెప్పారు. ‘సివిల్స్‌ సన్నద్ధత గ్రూపు-1లో విజయం సాధించేందుకు ఉపయోగపడింది. గ్రూపు-1 మౌఖిక పరీక్ష దరఖాస్తులో నమోదుచేసిన వివరాల ఆధారంగా బోర్డు సభ్యులు ప్రశ్నలు వేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీల మధ్య ఉన్న వ్యత్యాసం, సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాధాన్యం, పీహెచ్‌డీ చేసి, ఇటువైపు ఎందుకొచ్చారు? అన్న ప్రశ్నలు నాకు ఎదురయ్యాయి. ‘డూయింగ్‌ గ్రేటర్‌ గుడ్‌’ అనే సిద్ధాంతం నమ్మి... అధ్యాపకురాలిగా కంటే.. గ్రూపు-1 ఆఫీసర్‌ అయితే ఎక్కువ మందికి సేవలు అందించొచ్చని ఇటువైపు వచ్చినట్లు చెప్పాను’ అని సుస్మిత వివరించారు.


డిప్యూటీ కలెక్టర్‌గా రైతు బిడ్డ

గ్రూపు-1 రెండోర్యాంకరు శ్రీనివాసులురాజు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి మండలం పందిళ్లపల్లె పంచాయతీ కోతులగుట్టపల్లెలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కొండూరు శ్రీనివాసులు రాజు గ్రూప్‌-1 ఫలితాల్లో రెండోర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో... 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు రాయచోటిలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో చదివారు. కడపలో డిగ్రీ, తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదివారు. తర్వాత దిల్లీలో కోచింగ్‌ తీసుకుని మూడు మార్లు సివిల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని శ్రీనివాసులురాజు తెలిపారు.


రచనా నైపుణ్యం ఉండాలి
సంజనా సింహా, హైదరాబాద్‌, గ్రూపు-1 మూడో ర్యాంకు

సివిల్స్‌ కంటే గ్రూపు-1 సిలబస్సే ఎక్కువ. ముఖ్యంగా ఏపీ ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ చాప్టర్లను అదనంగా చదవాల్సి వచ్చింది. గ్రూపు-1 కానీ... సివిల్‌్్సలో కానీ మెయిన్స్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు చూసి, జవాబులు ఎలా రాయాలో ముందుగానే సన్నద్ధం అయ్యాను. రైటింగ్‌ స్కిల్‌ బాగుంటేనే మార్కులు ఎక్కువగా వస్తాయి. గ్రూపు-1 ఇంటర్వ్యూలో ఇన్‌కంటాక్స్‌, సోషియాలజీకి సంబంధించిన ప్రశ్నలూ వచ్చాయి. నేను రామకృష్ణమఠంలో వాలంటీరుగా పనిచేసినందున స్వామి వివేకానంద గురించి ఏమి తెలుసు, బ్యూరోక్రసీలోకి వస్తే మీరు ప్రజలకు ఎలా సేవ చేస్తారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. మాది హైదరాబాద్‌. నా విజయంలో భర్త సహకారమెంతో ఉంది. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్‌-2021లో 37వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్‌. వచ్చే అవకాశం ఉంది. 2020 సివిల్స్‌లో 207వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ ట్రైనింగ్‌ కోసం నాగ్‌పుర్‌లో ఉన్నా. గ్రూపు-1 తొలిసారి రాశా. డిజిటల్‌ మూల్యాంకనం ద్వారా వెల్లడైన జాబితాలో నా పేరు లేదు. సంప్రదాయ విధానంలో జరిగిన మూల్యాంకనం ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని