ఏడున్నర దశాబ్దాల్లో ఎగుడుదిగుళ్లు

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించి.. పదిలపరచుకోవటానికి, భాష, వాక్‌, విశ్వాస, మత, ఆరాధనా స్వాతంత్య్రాలకు, అందరికీ సమానావకాశాలు అందించడానికి మనం రాజ్యాంగం రాసుకున్నాం. దేశాన్ని ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామికమ’ని ప్రకటించుకున్నాం.

Published : 15 Aug 2022 04:45 IST

సవాళ్ల నడుమ మన ప్రజాస్వామ్యం

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించి.. పదిలపరచుకోవటానికి, భాష, వాక్‌, విశ్వాస, మత, ఆరాధనా స్వాతంత్య్రాలకు, అందరికీ సమానావకాశాలు అందించడానికి మనం రాజ్యాంగం రాసుకున్నాం. దేశాన్ని ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామికమ’ని ప్రకటించుకున్నాం. అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని నిర్దేశించుకున్నాం. 75 ఏళ్లుగా స్వాతంత్య్ర ఫలాలను ఆరగిస్తున్నాం. ఇందులో ఎన్ని పళ్లు తియ్యగా ఉన్నాయో ఎన్ని చేదుగా ఉన్నాయో, ఎన్ని అసలు ఫలించలేదో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రజాస్వామ్యమంటేనే ప్రజల పాలన. వారి పక్షాన ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములవ్వాలి. వీరిలో అత్యధికులు 30-40% ప్రజల ఆమోదం మాత్రమే పొందినవారు. వీళ్లు ప్రజలకు ప్రతినిధులుగా కాక, తమ రాజకీయపార్టీల ప్రతినిధులుగా.. వాటి అధినేతల ఆదేశాలకు లోబడి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత? వారి స్వామ్యం ఎంత? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఎన్నికలు జరిగే విధానం, పాలనలో నాణ్యత, భిన్నాభిప్రాయాలకు విలువ, విద్యలో స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి ముఖ్య సూత్రాలు. భారతదేశంలో ఇవన్నీ ఒక్కక్కటిగా బలహీనపడుతుండడం ఆందోళనకరం. ఈ సహస్రాబ్ది మొదలైన 22 ఏళ్లలో అవి మరింతగా దిగజారాయి. వ్యక్తులు, సంస్థలు, పార్టీలు, మేధావులు, పాత్రికేయులపై అణచివేత చర్యలు ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.

ఆర్థిక.. స్వేచ్ఛాస్వామ్యాలు అవసరం

ప్రజలు నాణ్యంగా జీవించాలంటే వారి ఆర్థికావసరాలు నెరవేరాలి. గ్రామీణ వృత్తులను ప్రోత్సహిస్తే నేతన్నలు, హస్తకళల నిపుణులు చక్కగా జీవించే పరిస్థితి ఉండేది. వలస కూలీలుగా మారే దుస్థితి తప్పేది. సాగు రంగానికి ప్రభుత్వపరంగా సంపూర్ణ తోడ్పాటు లేని కారణంగా గ్రామీణ వ్యవస్థలు చెల్లాచెదురయ్యాయి. 2011లో ప్రపంచ బ్యాంకు భారతదేశంలో పేదరికం 42% ఉందని ప్రకటించింది. 182 ప్రపంచ దేశాల్లో అభివృద్ధి విషయంలో మనëది 134వ ర్యాంకు. సంక్షేమ పథకాల ముసుగులో అభివృద్ధి మందగించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలను విస్మరించడం సరికాదు.

ఏకస్వామ్య పోకడలతో చేటు

అవినీతి, కులమత వర్గ తత్వాలు, ముఠా కుమ్ములాటలు, ప్రభుత్వ వ్యవస్థల్లో పక్షపాత ధోరణి వంటి అవాంతరాల మధ్య.. ముళ్ల కంచె మీద వస్త్రంలా మన ప్రజాస్వామ్యం నిలిచి ఉంది. దీన్ని లోపరహితం చేయాలంటే న్యాయ, రాజకీయ, సామాజికంగా మార్పులు అవసరం. ప్రశ్నించే వారిని వేధిస్తూ, అసంతృప్తిని అణచిపెట్టడం ప్రజాస్వామ్యం కాదు. 21వ శతాబ్దంలో అధికారానికొచ్చిన పార్టీల్లో ఈ ధోరణులు మితిమీరుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నూరు శాతం ఏకాభిప్రాయం అసాధ్యం. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి అమలు చేయడమే సరైంది.

సామాన్యులకు దూరంగా అధికారం

ఎక్కువ మంది ఓటు వేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనిపించుకోదు. ప్రతిపక్షం లేని భారతదేశాన్ని నిర్మిస్తామని అనటం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ‘అందరూ ఒకే పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని శాసించేది ప్రజాస్వామ్యం కాదు’ అంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఎన్నికల్లో ధనవ్యయం పెరగటం ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు. రెండు దశాబ్దాలుగా డబ్బున్న వారినే ఎన్నికల్లో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. నోట్లతో ఓట్లు కొనే ధోరణి ఫలితంగా మధ్యతరగతి వారు చట్టసభల్లోకి వెళ్లలరు. పార్లమెంటులో 1/5 వంతు మంది తీవ్రమైన నేరచరిత్ర కలవారన్నది చేదు నిజం.


ప్రజల ఐక్యతే మన బలం

న్యాయవ్యవస్థ స్వతంత్రత, పదునైన అవినీతి నిరోధక చట్టాలు, నిజాయతీపరులైన అధికారులు.. ఇవన్నీ పటిష్ఠ రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే సాధ్యం. పార్లమెంటులో మెజారిటీని అడ్దం పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను అడ్డుకోగల సమర్థత, అధికారం, అవకాశం ఒక్క న్యాయవ్యవసకే ఉన్నాయి. భిన్నభాషలు, జాతులు, సంస్కృతుల సమ్మేళనంగా రూపొందిన భరతజాతిలో వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు సహజం. అయినా జాతీయ సమైక్యతకు యావద్భారతమూ ఒక్కటిగా నిలబడి  సహకరించుకోవటం మన బలం. ప్రజలు వ్యక్తిగతంగా బలహీనులే కావచ్చు. తమ ఆత్మగౌరవానికి, రక్షణకు, ఐక్యతకు, స్వేచ్ఛకు తామే రక్షకులమని గ్రహించాలి.


మహిళలకు మంచిరోజులొచ్చేనా?

మహిళలకు రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఇచ్చిన 161 దేశాల్లో మనం 141వ స్థానంలో ఉన్నాం. మనకంటే మెరుగైన రీతిలో నేపాల్‌ 48, బంగ్లాదేశ్‌ 91వ స్థానాల్లో ఉన్నాయి. రువాండాలో మహిళా పార్లమెంటేరియన్లు 56.3%, క్యూబాలో 48.9% ఉన్నారు. 12% కన్నా మించని మహిళా ప్రతినిధులున్న మనం పునర్మూల్యాంకనం చేసుకోవాలి. నేటికీ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయం. ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి లాంటి కొద్దిమంది మహిళలకు అందివచ్చిన సానుకూలతలు అందరికీ దక్కే వాతావరణాన్ని కల్పించటం అవసరం.

స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా.. ఈ లోపాలను సమీక్షించుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి.

- మండలి బుద్ధప్రసాద్‌,  పూర్వ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ


మానవనిర్మిత శాసనాలనైనా, దైవశాసనాలనైనా మనఃపూర్వకంగా శిరసావహించే.. చట్టానికి కట్టుబడి ఉండే పౌరులెవరికైనా ప్రజాస్వామ్యం అనేది సహజంగా నచ్చుతుంది. వ్యక్తి స్వేచ్ఛకు నేను విలువ ఇస్తాను. మానవుడు సంఘజీవి అనే విషయం మరిచిపోకూడదు. తమ వ్యక్తిగత అభిమతాల్ని సామాజికాభివృద్ధి అవసరాలతో సరిపెట్టుకోగలగటం వల్లే మానవుడు ఇప్పటి ఈ దశకు ఎదిగాడు. సంఘశ్రేయస్సు కోసం సామాజిక నిబంధనలను ఐచ్ఛికంగా శిరసావహించటం వ్యక్తికీ, సమాజానికి ఉభయతారకం’’

- మహాత్మాగాంధీ


మీ బానిసత్వాన్ని, మీ పేదరికాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీదో.. మహానుభావుల మీదో ఆధారపడవద్దు

- డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని