రాజ్యాంగంపై అవగాహన పెరగాలి

ఆధునిక భారత న్యాయవ్యవస్థ తన తీర్పుల ద్వారా ప్రజా విశ్వాసాన్ని గెలుచుకుందని, అది కలకాలం నిలవాలంటే న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Updated : 16 Aug 2022 06:41 IST

అప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకుంటారు
అప్రమత్తత ఉన్న సమాజంతో హక్కులు సురక్షితం
స్థానిక భాషల్లో న్యాయశాస్త్ర పుస్తకాలు రావాలి
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, దిల్లీ: ఆధునిక భారత న్యాయవ్యవస్థ తన తీర్పుల ద్వారా ప్రజా విశ్వాసాన్ని గెలుచుకుందని, అది కలకాలం నిలవాలంటే న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ వ్యవస్థల పనితీరు గురించి ప్రజల్లో అవగాహన పెరిగితేనే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందన్నారు. ప్రజలు జాగరూకులైతే ప్రజాస్వామ్యాన్ని వారే కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు. సమాజం అప్రమత్తంగా ఉంటేనే హక్కులు సురక్షితంగా ఉంటాయని, రాజ్యాంగ సంస్కృతి వేళ్లూనుకుంటే ఆ జాగరూకత, అప్రమత్తత శాశ్వతంగా నిలుస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) ఆధ్వర్యంలో సోమవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘భారత న్యాయస్థానాలు... నాటి నుంచి నేటి వరకు’ అనే తెలుగు పుస్తకాన్ని.. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి సంబంధించిన నాణ్యమైన పుస్తకాలు ఆంగ్లభాషకే పరిమితమయ్యాయన్నారు. ఇవి అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి వస్తే తప్ప న్యాయవ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన పరిజ్ఞానం అందరికీ లభించదన్నారు.

వ్యవస్థల స్వతంత్రతను కాపాడుతున్న సుప్రీంకోర్టు

‘‘న్యాయం అందించడం కేవలం కోర్టుల బాధ్యత అనుకోవడం తప్పని ఆర్టికల్‌ 38 స్పష్టంచేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే బాధ్యతను అది ప్రభుత్వాలకు అప్పగించింది. రాజ్యాంగంపై నమ్మకం కలిగించే సమాన బాధ్యత కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలపై ఉంది. రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చేందుకు భారతీయ న్యాయవ్యవస్థ శ్రమిస్తోంది. చట్టాలకు సరైన నిర్వచనం చెప్పడం ద్వారా చట్టసభల అసలైన ఉద్దేశాలను న్యాయవ్యవస్థలు ఆచరణలో పెడుతున్నాయి. ఎక్కడైనా తప్పు జరిగితే న్యాయవ్యవస్థ అండగా నిలుస్తుందన్న నమ్మకం ప్రజలకు ఉంది.  భారత న్యాయస్థానాల ప్రస్థానంపై పుస్తకాన్ని తెలుగు సహా ఇప్పటివరకు 7 భాషల్లో విడుదల చేసినట్లయింది. త్వరలో అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతుందని ఆశిస్తున్నా.

కొవిడ్‌పై నిర్లక్ష్యం తగదు

కొవిడ్‌పై నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. నేను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ మహమ్మారి మనల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రమాణ స్వీకారోత్సవానికి కనీసం కుటుంబ సభ్యులూ హాజరుకాలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ల కారణంగా ఒక ఏడాది కేసులు పెండింగ్‌లో పడిపోయాయి. సమీప భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాను’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ మాట్లాడుతూ- దేశంలో 43% మంది శాసనకర్తలకు నేరచరిత్ర ఉందనీ, ఇలాంటివారు ఎన్నిక కాకుండా ఒక చట్టాన్ని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సీనియారిటీ కంటే కేవలం కేసుల పరిష్కారం ప్రాతిపదికగా దిగువ న్యాయస్థానాల నుంచి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫార్సు చేయాలని కోరారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పాల్గొన్నారు.


విజయానికి అడ్డదారుల్లేవు

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

విజయానికి అడ్డదారులు లేవన్నది యువతరం గ్రహించాలి. ఎవ్వరూ ఆశలు వదులుకోకూడదు. ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామ్య పాత్ర పోషించాలి. రాజ్యాంగ సూత్రాలను నిజమైన స్ఫూర్తితో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. మువ్వన్నెల పతాకాన్ని చూసి తెలుగునేలపై పుట్టిన పింగళి వెంకయ్యను గుర్తు చేసుకోకుండా ఉండలేం. ఆయన రూపొందించిన జాతీయ జెండా స్వతంత్ర భారతదేశానికి గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని