రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకు లేని భారం మనకేనా?

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల  సీపీఎస్‌ రద్దుపై రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హామీలేమీ ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఓపీఎస్‌ను అమలు చేస్తున్నాయి. ఝార్ఖండ్‌ సీపీఎస్‌ రద్దుకు కమిటీ వేయగా హిమచల్‌ప్రదేశ్‌ సైతం

Updated : 18 Aug 2022 06:31 IST

ఓట్ల కోసమే సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ హామీ

ప్రస్తుతం ఆర్థిక భారం పేరిట మోసం చేస్తున్నారంటున్న ఉద్యోగులు

 


జగన్‌ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాట ఇస్తున్నా. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.

- ప్రతిపక్ష నేతగా వివిధ సభలో జగన్‌


సీఎంగా సీపీఎస్‌ను రద్దుచేయాలంటే నిమిషం పని. మరి ఎందుకింత ఆలోచిస్తున్నాం? ఓపీఎస్‌ అమలైతే మోయలేని భారం పడుతుంది. పింఛన్ల భారం ఉద్యోగుల జీతాలనూ దాటేసి, మోయలేని స్థాయికి చేరుతుంది. సీపీఎస్‌ ద్వారా వస్తున్న దానికన్నా 70% ఎక్కువగా వచ్చేలా గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) తీసుకురావాలని మన ప్రభుత్వం సంకల్పించింది.

   - ఏప్రిల్‌ 29న సీఎం జగన్‌


ఈనాడు, అమరావతి: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల  సీపీఎస్‌ రద్దుపై రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హామీలేమీ ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఓపీఎస్‌ను అమలు చేస్తున్నాయి. ఝార్ఖండ్‌ సీపీఎస్‌ రద్దుకు కమిటీ వేయగా హిమచల్‌ప్రదేశ్‌ సైతం పరిశీలిస్తోంది. మన రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దుచేస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక... భవిష్యత్తులో ప్రభుత్వం పింఛన్ల భారం మోయలేదంటూ జీపీఎస్‌ను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో ఏమి చేశారు? మన ప్రభుత్వ ప్రయత్నాలపై ఉద్యోగుల స్పందనపై ప్రత్యేక కథనం...

ఆంధ్రప్రదేశ్‌లో 1.99 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి ప్రొబేషన్‌ ఖరారు చేశారు. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ, అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటుచేశారు. తర్వాత పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. చివరికి జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2,93,653 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పాత పింఛన్‌ అమలుపై గెజిట్‌ విడుదల చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి ఛత్తీస్‌గఢ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ని తీసుకొచ్చారు. ఉద్యోగి బేసిక్‌లో 12% సీజీపీఎఫ్‌లో మదుపుచేయాలి. దీనిపై వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీవిరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తోంది. పింఛన్లు భారం కాకూడదనే.. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పింఛన్ల మొత్తంలో 4% భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పెడుతోంది. సీపీఎస్‌ ఉద్యోగులు, ప్రభుత్వం జమచేసిన మొత్తం నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌)లో రూ.18వేల కోట్లు ఉన్నాయి. ఈ నిధులు వచ్చాక ఉద్యోగుల భాగాన్ని వారి పీఎఫ్‌ ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రూ.9 వేల కోట్లను పింఛన్ల కోసం ప్రత్యేకంగా ఉంచుతామంది.

రాజస్థాన్‌లో ఏం చేస్తున్నారంటే...

రాజస్థాన్‌లో 5.32 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచి ఓపీఎస్‌ అమలు చేస్తోంది. ఉద్యోగులు, ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం ఎన్‌ఎస్‌డీఎల్‌లో రూ.39 వేల కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం వచ్చాక ఉద్యోగుల వాటాను వారి పీఎఫ్‌ ఖాతాలకు మళ్లిస్తుంది. ఉద్యోగి బేసిక్‌లో పీఎఫ్‌కు 12% జమ చేయాలి. ఈ మొత్తానికి వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీ విరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తుంది.


ప్రత్యామ్నాయాన్ని అంగీకరించం

సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పు. మేం జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోం. సీపీఎస్‌ ఉద్యోగులకు 35 నెలల డీఏ బకాయిలే ఇవ్వలేదు. సెప్టెంబరు ఒకటిలోపు ఓపీఎస్‌ అమలుచేయకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం.

- సీఎం దాస్‌, అధ్యక్షుడు, సీపీఎస్‌ ఉద్యోగులసంఘం


మోసపూరిత ప్రకటనలను నమ్మబోం

ప్రభుత్వం చేస్తున్న జీపీఎస్‌లాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మే పరిస్థితి లేదు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జీపీఎస్‌ పేరుతో మభ్యపెడుతున్నారు. ఓపీఎస్‌ ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదు.

- అప్పలరాజు, అధ్యక్షుడు, సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌


సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ అమలుచేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పడదు. ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ సీపీఎస్‌లో ప్రభుత్వవాటా పెరుగుతుంది. ఓపీఎస్‌ అమలుచేస్తే ఉద్యోగులు 6% జీపీఎఫ్‌, పీఎఫ్‌ కింద జమచేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు. ఉద్యోగ విరమణ చేసే వరకు ప్రభుత్వం వాటా చెల్లించాల్సిన అవసరం లేనందున భారంఉండదు.

- సీపీఎస్‌ ఉద్యోగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని