నినాదాల మోత... బిల్లు ప్రతుల కాల్చివేత!

అమరావతి ఒక్కటే రాజధాని... అనే నినాదాల్ని హోరెత్తిస్తూ... సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లు ప్రతులను కాల్చివేస్తూ... రైతులు అడుగులు ముందుకు వేశారు. అమరావతి నుంచి అరసవల్లి దాకా చేపట్టిన మహా పాదయాత్ర కృష్ణాజిల్లాలోని

Published : 23 Sep 2022 04:29 IST

సీఆర్‌డీఏ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన రాజధాని రైతులు

హోరెత్తిన నిరసన

కృష్ణాజిల్లాలో కొనసాగిన మహాపాదయాత్ర

స్థానికుల పూలాభిషేకం... నాయకుల సంఘీభావం

ఈనాడు, అమరావతి: అమరావతి ఒక్కటే రాజధాని... అనే నినాదాల్ని హోరెత్తిస్తూ... సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లు ప్రతులను కాల్చివేస్తూ... రైతులు అడుగులు ముందుకు వేశారు. అమరావతి నుంచి అరసవల్లి దాకా చేపట్టిన మహా పాదయాత్ర కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో దిగ్విజయంగా కొనసాగింది. 11వ రోజైన గురువారం చిన్నాపురంలో ఉదయం 9 గంటలకు కోలాహలంగా పాదయాత్ర ప్రారంభమైంది. రైతు, రైతు కూలీ సంఘాల నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చిన్నాపురం, గుండుపాలెం మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నంలోకి ప్రవేశించిన రైతులు... హుసేన్‌పాలెం దాకా నడిచారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మచిలీపట్నం వాసులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. రహదారికి ఇరువైపులా నిల్చొని పూలవర్షం కురిపించారు. 

శాసనసభలో ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లు పెట్టడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలోని ఎక్కడి వారికైనా రాజధానిలో భూములిచ్చేలా సవరణలు చేయడాన్ని తప్పుబట్టారు. చిన్నాపురంలో పాదయాత్ర ప్రారంభానికి ముందు సవరణ బిల్లు ప్రతులను దహనం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లులేని పేదలు 14 వేల మంది ఉన్నారంటూ సీఆర్‌డీఏ గతంలో లెక్కలు కట్టిందన్నారు. తొలుత వారికి ఇళ్లు కేటాయించాకే మిగిలిన వారికి ఇవ్వాలని కోరారు.

హోరెత్తిన మచిలీపట్నం

ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని, జై అమరావతి... నినాదాలతో మచిలీపట్నం మారుమోగింది. నగర శివారు ప్రాంతమైన శారదానగర్‌ దగ్గర మహిళలు హారతులు ఇచ్చి మహా పాదయాత్రను స్వాగతించారు. గుమ్మడికాయలతో దిష్టితీశారు. అమరావతి ఐకాస నాయకుడు కొలికలపూడి శ్రీనివాసరావుతో పాటు పలువురిని స్థానికులు భుజాలపై ఎక్కించుకుని జై అమరావతి నినాదాలు చేస్తూ కొంతదూరం మోసుకెళ్లారు. అనంతరం శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌, బాబూజగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ప్రజా రాజధాని కావాలని కోరుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం తమ పాలిట ఉరితాడుగా మారిందంటూ కోనేరు సెంటర్‌లో మహిళలు, రైతులు నినదించారు. ఆకుపచ్చని కండువాలను ఉరితాళ్లుగా మెడకు బిగించుకుని నిరసన తెలిపారు.

తిరుగుబాటు యాత్రగా మారనివ్వొద్దు...

శాంతియుతంగా చేస్తున్న రైతుల పాదయాత్ర... తిరుగుబాటు యాత్రగా మారక ముందే ప్రభుత్వం స్పందించాలని కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాయానికి ఎన్టీఆర్‌ పేరు మారుస్తున్నట్లు ప్రకటించి అందరి దృష్టీ మరల్చి సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు 3 రాజధానులను సీఎం తెరపైకి తీసుకొచ్చారని కొనకళ్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ పేరును తొలగించడమూ ఇందులో భాగమేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని