అరెస్టుల్లో అరాచకం!

రాష్ట్రంలో పోలీసు, సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణిని ఎండగడుతూ సాక్షాత్తూ హైకోర్టు పలు సందర్భాల్లో హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. సీఐడీ విభాగమైతే అధికారపక్షమైన వైకాపా ప్రయోజనాలను పరిరక్షించటం, ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటమే తమ ప్రధాన విధి, బాధ్యతన్నట్లుగా

Updated : 26 Sep 2022 11:51 IST

అధికార పార్టీ సేవలో సీఐడీ

ప్రతిపక్షాలకు వేధింపులు

ముఖ్యమంత్రిని పల్లెత్తు మాటన్నా వెంటనే చర్యలు

అర్ధరాత్రి గోడలు దూకి వచ్చి మరీ నిర్బంధం

న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నా మారని తీరు

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో పోలీసు, సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణిని ఎండగడుతూ సాక్షాత్తూ హైకోర్టు పలు సందర్భాల్లో హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. సీఐడీ విభాగమైతే అధికారపక్షమైన వైకాపా ప్రయోజనాలను పరిరక్షించటం, ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటమే తమ ప్రధాన విధి, బాధ్యతన్నట్లుగా పని చేస్తోంది. ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తోంది. విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపుతూ సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేస్తే అరెస్టులు చేస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులను విమర్శిస్తే చాలు.. అక్రమంగా నిర్బంధిస్తోంది. కొన్నిసార్లు థర్డ్‌ డిగ్రీ చిత్రహింసలకూ గురి చేస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడుతూ.. వారి చిత్రాలు మార్ఫింగ్‌ చేస్తూ.. వారి కుటుంబంలోని మహిళలను దూషిస్తూ, అసభ్య పదజాలంతో వైకాపా సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు పోస్టులు పెట్టినా వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టే స్వయంగా ఆదేశించినా సరే.. ఉదాసీనత ప్రదర్శిస్తోంది. ‘వైకాపా నాయకులు ఆదేశిస్తారు.. అదే సీఐడీ పాటిస్తుంది’ అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. న్యాయస్థానాలు పదే పదే ఆక్షేపిస్తున్నా సీఐడీ తీరు మారట్లేదు. తాజాగా సీఎంవోలోని ఓ అధికారికి వ్యతిరేకంగా వాట్సప్‌లో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేశారన్న ఆరోపణపై 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్టు చేసింది. నేరపూరిత కుట్ర అభియోగం మోపింది. సీఐడీ వేధింపులకు ఇలాంటి ఘటనలు కొన్ని తార్కాణాలు మాత్రమే. ఐటీడీపీ కార్యకర్తలు, యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకులపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది.

ఏకపక్ష, పక్షపాత ధోరణి..

పోలీసు అంటే చట్టబద్ధంగా వ్యవహరించాలి. తటస్థంగా ఉండాలి. నేరానికి పాల్పడిన వ్యక్తులు అధికార పార్టీ వారైనా.. ప్రతిపక్షం వారైనా ఒకేలా వ్యవహరించాలి. కానీ సీఐడీ తీరు పూర్తి భిన్నం. ‘అధికార వైకాపా నాయకులు ఎలాంటి నేరం చేసినా ఒప్పే... ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా మహా నేరమే’ అన్నట్లు సీఐడీ వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైకాపా నాయకులు, ఆ పార్టీ సానుభూతిపరులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు ఇచ్చేంతవరకూ సీఐడీ కేసు నమోదు చేయలేదు. తప్పనిసరై కేసు కట్టినా నిందితులపై చర్యలే తీసుకోలేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేదు. నిందితులంతా వైకాపా సానుభూతిపరులు, ఆ పార్టీతో అనుబంధం కలిగిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు కావటమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. సీఐడీ పరువు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడిందే తప్ప.. అధికార పార్టీ వారిపై చర్యలు తీసుకోలేదు. చివరికి హైకోర్టే జోక్యం చేసుకుని ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే నిందితులు అరెస్టు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, అధికార పక్షానికి కొమ్ము కాస్తోందని చెప్పటానికి ఇంతకంటే రుజువులేమిటి?

* రాజధాని మహిళా రైతులపై వైకాపా నాయకులు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసి రెండేళ్లు దాటినా ఇప్పటివరకూ కేసూ లేదు.. చర్యలూ లేవు.

* రాజమహేంద్రవరం అర్బన్‌ తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.. అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా చర్యలు లేవు.

* చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ   పత్రికా ప్రకటన విడుదల చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదిస్తే.. దానిపై చర్యలు తీసుకోలేదు.

* ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు అనేకమందిపై కేసులు పెట్టారు.

భయభ్రాంతులకు గురిచేయడమే..

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపట్ల ఉగ్రవాదులతో వ్యవహరించినట్లే సీఐడీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసులిస్తే సరిపోతుంది. కానీ సీఐడీ అధికారులు ఆ నిబంధనలను పాటించకుండా.. అరెస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు పదేపదే సీఐడీ తీరును తప్పుపడుతూ నిందితులకు రిమాండు ఇవ్వడానికి నిరాకరిస్తున్నప్పటికీ సీఐడీ ధోరణి మారట్లేదు. న్యాయస్థానాలు రిమాండు విధించవని తెలిసీ సీఐడీ ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగా అరెస్టులు చేస్తోందని న్యాయవాదులు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించేందుకు, బెదిరించేందుకు సీఐడీ ఇలా చేస్తోందని చెబుతున్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లోగా న్యాయస్థానంలో హాజరుపరచొచ్చన్న నిబంధనను తమకు అనుకూలంగా మలచుకుంటోందని పేర్కొంటున్నారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత అరెస్టు చేయటం.. రాత్రంతా వారిని సీఐడీ కార్యాలయంలో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేయటం మరుసటి రోజు సాయంత్రం వరకూ తమ కస్టడీలోనే ఉంచుకుని 24 గంటల సమయం అయిపోతుందనగా చివరి క్షణంలో న్యాయస్థానంలో హాజరుపరచటం అనే విధానాన్ని సీఐడీ అనుసరిస్తోంది. న్యాయస్థానం రిమాండు తిరస్కరించినా సరే.. అప్పటికే వారిని చిత్రహింసలకు గురిచేసి ఉండటంతో తాము అనుకున్న పనైపోయిందని భావిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘటనలే ఇందుకు తార్కాణం.

పోస్టు పెడితే కుట్రకు పాల్పడినట్లేనా? 

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెడితే చాలు.. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు, నేరపూరిత కుట్ర చేసినట్లు, రాజ ద్రోహానికి పాల్పడినట్లు సీఐడీ వారిపై కేసులు పెడుతోంది. వాటిని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతోంది. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, తటస్థులు, పాత్రికేయులు.. వారూ.. వీరూ అనే తేడా లేదు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే చాలు.. వారిపై కేసులు పెట్టి అణచేస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు.

* విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ ప్రమాదంపై ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు షేర్‌ చేసినందుకు పి.రంగనాయకి అనే 60 ఏళ్ల వృద్ధురాలిపై సీఐడీ కేసు నమోదు చేసింది. విచారణ పేరిట వేధింపులకు గురిచేసింది.

* ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపుతూ విమర్శలు చేసే వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపైనా, వాటిని ప్రసారం చేశారంటూ మీడియా ఛానళ్లపైనా రాజద్రోహం కేసులు పెట్టారు. సీఐడీ పోలీసులు తనను కస్టడీలోకి తీసుకుని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురిచేశారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

* ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ మంత్రిగా కొనసాగి, ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టు ఫార్వర్డ్‌ చేశారంటూ విశాఖపట్నానికి నలంద కిశోర్‌, కృష్ణా జిల్లా నందిగామ మండలం చెరువు కొమ్ముపాలేనికి చెందిన చిరుమామిళ్ల కృష్ణారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. నలంద కిషోర్‌ను విశాఖపట్నం నుంచి కర్నూలుకు తరలించింది. తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణించారు.

* ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను మార్ఫింగ్‌ చేసి ప్రదర్శించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సీఐడీ కేసు పెట్టింది. విచారణ పేరిట వేధించింది.

* ఓ నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌ చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషకు రాత్రి 10.30 గంటల సమయంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. వారు రాసుకొచ్చిన వాంగ్మూలంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు.


5 కిలోమీటర్ల దూరం వరకూ కొడుతూనే ఉన్నారు...

‘అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి సీఐడీ పోలీసులు వాహనం ఎక్కించారు. నాకు అటూఇటూ ఇద్దరు పోలీసులు కూర్చొన్నారు. ఒకరు మోచేత్తో బలంగా నా ముఖంపై కొట్టారు. పెదవి పగిలి రక్తం కారుతుండటంతో ఆ బాధతో నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ముందుకు వంగాను. అప్పుడు మెడపై గట్టిగా కొట్టారు. 5 కిలోమీటర్ల దూరం వరకూ కొడుతూనే ఉన్నారు. నన్ను అదుపులోకి తీసుకున్నప్పుడు తలుపులు విరగ్గొట్టి, లైట్లు ఆర్పేసి మా ఇంట్లోకి ప్రవేశించారు.

- యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేశ్వరరావు


దుస్తులు విప్పదీసి మరీ కొట్టారు

‘సీఐడీ అధికారులు నా దుస్తులు విప్పి మరీ కొట్టారు. రెండు చేతులూ పైకి కట్టేసి.. వాటి మధ్యలో కర్రపెట్టి అరికాళ్లపై కొట్టారు. బల్లపై పడుకోబెట్టి... నా నడుంపై కూర్చొని కాళ్లు పైకి ఎత్తిపట్టి కొట్టారు. వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి నన్ను భయపెట్టారు. కొట్టిన విషయం మెజిస్ట్రేట్‌ ఎదుట చెబితే  నా రెండేళ్ల కుమారుణ్ని చంపేస్తానన్నారు. నా కుటుంబం మిగలదని బెదిరించారు.

- యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు బి.వెంగళరావు


కోర్టుకు వెళ్లే వీల్లేకుండా ఎత్తుగడ

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన తర్వాత 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఏపీ సీఐడీ ఆ నిబంధనలేవీ పాటించట్లేదు. ఈ విభాగం నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ రహస్యంగానే ఉంచుతోంది. ఆయా ఎఫ్‌ఐఆర్‌లలో నిందితులుగా పేర్కొన్న వారి ఇళ్లపై ఆకస్మికంగా సోదాలు జరిపి అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటించి వారిని బలవంతంగా తీసుకెళ్లిపోతోంది. చాలా సందర్భాల్లో నిందితులకు, వారి తరఫు న్యాయవాదులకు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ లభించని పరిస్థితి ఉంటోంది. ముందస్తు బెయిలు పొందకుండా ఉండేందుకు, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీల్లేకుండా చేసేందుకే సీఐడీ ఇలా వ్యవహరిస్తోందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని వారు చెబుతున్నారు.


న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?

అధికార పార్టీ నేతలపై, రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా పోస్టులు పెడితే సత్వరమే స్పందిస్తున్న సీఐడీ.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? 19 మందిపై పేర్లతో సహా ఫిర్యాదు ఇస్తే.. ముఖ్య నేతల్ని వదిలేసి 9 మందిపైనే ఎందుకు కేసులు నమోదు చేశారు? న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకరమైన దాడి జరుగుతుంటే హైకోర్టుకు మద్దతుగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు?

గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి

రాష్ట్ర పోలీసులకు చట్టబద్ధ పాలన అంటే గౌరవం లేదు. హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు. 

- హైకోర్టు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని