పాదయాత్రకు పోటెత్తిన కృష్ణా

కష్టనష్టాలను పంటిబిగువన భరిస్తూ అమరావతి రైతులు ఒకటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ నాయకుల కవ్వింపులకు తోడు పోలీసుల ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా అడుగు ముందుకే వేస్తున్నారు. ఎండ వేడిని లెక్కచేయకుండా

Published : 26 Sep 2022 03:06 IST

అడుగడుగునా అమరావతి రైతులకు బ్రహ్మరథం

గుడివాడ నియోజకవర్గంలో భారీగా జనం

ఏలూరులోకి ప్రవేశించిన అన్నదాతలు

ఈనాడు, అమరావతి: కష్టనష్టాలను పంటిబిగువన భరిస్తూ అమరావతి రైతులు ఒకటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ నాయకుల కవ్వింపులకు తోడు పోలీసుల ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా అడుగు ముందుకే వేస్తున్నారు. ఎండ వేడిని లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఆదివారం పాదయాత్రలో ఉత్సాహంగా నడిచారు. కొండంత విశ్వాసంతో రాజధాని లక్ష్యం దిశగా అలుపెరగకుండా సాగారు. నందివాడ మండలం రామాపురం గ్రామస్థులు రైతులు, మహిళలపై పూలవర్షం కురిపించారు. గుడివాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు కర్షకులపై ఆదరాభిమానాలు చూపారు. వారికి మద్దతుగా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నుంచి వచ్చిన రైతులు భారీ జాతీయ పతాకాన్ని వెంట తెచ్చారు. దాన్ని రైతులు, మహిళలు అన్ని వైపులా పట్టుకుని పాదయాత్రలో నినదిస్తూ రామాపురం వరకు నడిచారు. వైకాపా ప్రభుత్వం తమపై, రాజధాని అమరావతిపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రైతులు తమ వాదనలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలను కరపత్రంలో ఉటంకించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన బాధిత రైతాంగ పోరాట వేదిక కన్వీనర్‌ తన్నీరు వెంకటేశ్వర్లు.. పాదయాత్రలో ప్రదర్శించిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది. పాదయాత్రను ఆత్మగౌరవ యాత్రగా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. నందివాడ మండలం జనార్దనపురం, జొన్నపాడు, నందివాడ మీదుగా తుమ్మలపల్లి వరకు యాత్ర సాగింది. అక్కడ మధ్యాహ్న విరామానికి ఆగింది. అనంతరం ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. యాత్రలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, తంగిరాల సౌమ్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్‌ ట్రస్టు డైరెక్టర్‌ మన్నవ మోహనకృష్ణ, నేతలు రావి వెంకటేశ్వరరావు, ఆప్కాబ్‌ మాజీ ఛైర్మన్‌ పిన్నమనేని, ఆళ్ల గోపాలకృష్ణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరావతి కేవలం 29 గ్రామాలకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అన్నదాతలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

సరిహద్దులో హార్ధిక స్వాగతం

పాదయాత్ర కృష్ణా జిల్లా దాటి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొనికిలోకి ప్రవేశించగానే తెదేపా నేతలు, గ్రామస్థులు రైతులకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా అమరావతి నినాదాలతో హోరెత్తింది. కృష్ణా జిల్లా పరిధిలో యాత్ర ముగియడంతో తమకు మద్దతుగా వెంట నడిచిన జిల్లా వాసులకు కృతజ్ఞతగా, మోకాళ్లపై నిల్చొని రైతులు నేలను నమస్కరించారు. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల జీవనాడి అని ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు. ‘దీన్ని నాశనం చేసేందుకు సీఎం జగన్‌ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మాకు రాజధాని కావాలని ఉత్తరాంధ్ర వాళ్లు అడగలేదు. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా డిమాండ్‌. ఒక్క రాజధానిని కట్టలేక ఈ పల్లవిని ఎత్తుకున్నారు. నిర్మాణమై బాగా అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని ఎందుకు? ఎక్కడ శాసనసభ, హైకోర్టు ఉందో అక్కడే రాజధాని ఉండాలి. దేశంలో ఎక్కడా లేని విధానం మనకెందుకు?’ అని ఆయన ప్రశ్నించారు.


14వ రోజు పాదయాత్ర ఇలా..

ప్రారంభం: గుడివాడ పట్టణ శివారు నాగవరప్పాడు నుంచి

ముగింపు: ఏలూరు జిల్లా కొనికి

ప్రయాణించిన దూరం: 15 కి.మీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని