TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం తితిదే శ్రీకారం చుట్టింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. మంగళవారం ధ్వజారోహణంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

Published : 27 Sep 2022 06:30 IST

నేడు పెద్దశేషవాహన సేవ

తిరుమల, న్యూస్‌టుడే: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం తితిదే శ్రీకారం చుట్టింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. మంగళవారం ధ్వజారోహణంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 5 వరకు ఉదయం, రాత్రి వేళల్లో వాహనసేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా వేదపండితులు, అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా భూమిపూజ, పుట్టమట్టి సేకరించి ఆ మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అంకురింపజేశారు. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహనసేవ జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి పెద్దశేషవాహనసేవలో పాల్గొంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలను అందంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల వ్యాప్తంగా పదిటన్నుల సంప్రదాయ పుష్పాలు, ఒక లక్ష కట్‌ఫ్లవర్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీ పెద్దజీయ్యంగారు, శ్రీ చిన్నజీయ్యంగారు, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, తితిదే ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు తదితరులు పాల్గొన్నారు.

గంటలో శ్రీవారి దర్శనం: తిరుమలలో సోమవారం ఉదయం నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులకు గంటలోనే దర్శనం లభించింది. అమావాస్య నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.


నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం 

ఈనాడు, అమరావతి: తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లనున్న ఆయన సాయంత్రం తిరుపతిలో గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. తర్వాత అలిపిరి వద్దకు చేరుకొని తిరుమలకు నడిచే విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న సీఎం బుధవారం ఉదయం 6:05గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తితిదే కోసం నిర్మించిన లక్ష్మీ వీపీఆర్‌ విశ్రాంతి భవనాన్ని ఆరంభిస్తారు. తర్వాత రేణిగుంటకు చేరుకొని అక్కడ నుంచి నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10:55గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని కొలిమిగుండ్లకు వెళ్లనున్నారు. అక్కడ రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని మధ్యాహ్నం 1:05గంటలకు విజయవాడకు బయల్దేరి వెళతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని