కాలుష్య కోరల్లో ‘కోరింగ’

కోరింగ అభయారణ్యాన్ని కాలుష్యం ముప్పు వెంటాడుతోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విభిన్న జీవరాశులకు ఆవాసమైన ఈ ప్రాంతంతోపాటు మడ

Updated : 30 Sep 2022 06:25 IST

డ్రెయిన్లలోకి శుద్ధి చేయని ఆక్వా వ్యర్థాలు

వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అతిక్రమణ

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, తాళ్లరేవు: కోరింగ అభయారణ్యాన్ని కాలుష్యం ముప్పు వెంటాడుతోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విభిన్న జీవరాశులకు ఆవాసమైన ఈ ప్రాంతంతోపాటు మడ అడవులకూ రక్షణ కరవవుతోంది. రొయ్యల శుద్ధి కేంద్రాల వ్యర్థాలను నేరుగా డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారు. మరోవైపు కొందరు నాటుసారా తయారీ స్థావరాలను నిర్వహిస్తూ పచ్చదనాన్ని ధ్వంసం చేస్తున్నారు.

వ్యర్థ జలాలతో ముప్పు
ఈ ప్రాంతంలో 19 రొయ్యల శుద్ధి యూనిట్లుంటే... వాటిలో పదింటికి అనుమతులే లేవు. రొయ్యల తలలు- వ్యర్థాలు కలిసిన ఈ నీరు పైపుల ద్వారా నేరుగా గోదావరి పాయలోకి వదలడంతో నీరంతా కలుషితం అవుతోంది. పైపులైన్లదీ అనధికార వ్యవహారమే. మరికొందరు రేకుల షెడ్లు, నివాసాల్లో రొయ్యలను శుద్ధిచేసి ఆ వ్యర్థాలు డ్రెయిన్లలోనే వదిలేస్తున్నారు. వీటి కారణంగా ఇక్కడి జీవ వైవిధ్యానికి భంగం కలుగుతోంది.

* తాళ్లరేవు మండలంలో అనుమతులున్న రొయ్యల, చేపల చెరువులు 3,358.46 ఎకరాల్లో ఉంటే.. అనుమతులు లేకుండా 2,514 ఎకరాల్లో తవ్వేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీటిపైనా చర్యలు తీసుకోవడంలేదు. చెన్నైలోని కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ నుంచి 657 మంది అనుమతి పొందారని మత్స్య అధికారులు చెబుతున్నారు. ఈ చెరువులు 1,483 హెక్టార్లలో అభయారణ్యానికి ఆనుకుని, దాని చుట్టూ ఉన్నాయి. అనుమతులున్న కొన్ని యూనిట్లలోనూ అతిక్రమణలు సమస్యగా మారాయి.

* కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆక్వా వ్యర్థాలతో కలుషితం అవుతోందని పార్లమెంటుకు కాగ్‌ తాజాగా నివేదించింది. 11 ఆక్వా యూనిట్లు శుద్ధి చేయని వ్యర్థాలను డ్రెయిన్లు, నదిలోకి వదులుతున్నట్లు పేర్కొంది. అయినా... కీలక శాఖలు అతిక్రమణలపై కనీసం స్పందించలేదు. మడ అడవుల్లోకి 272 రకాల పక్షి జాతులు దేశ విదేశాల నుంచి వస్తుంటాయి. ఇక్కడ 610 రకాల మత్స్యజాతులు ఉన్నాయి. గోదావరి- సముద్రం కలిసే ముఖద్వారం వద్ద 300 రకాల చేపలున్నాయి. ఈ తీరానికి సముద్ర తాబేళ్లు ఏటా సంతానోత్పత్తికి డిసెంబరు-ఏప్రిల్‌లో వస్తాయి. ఇలాంటి కీలక మడ అడవుల్లోని పాయల్లోకి వేట కోసం వచ్చే మత్స్యకారులకు మినహా ఎవ్వరికీ అనుమతిలేదు. అయితే... నాటుసారా తయారీ కేంద్రాలు, తీరంలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై ఉక్కుపాదం మోపింది లేదు. ఏటా ఆయా పరిశ్రమల నుంచి రూ.7.3 లక్షలను పన్నుల రూపంలో వసూలు చేస్తున్న పంచాయతీకి కాలుష్య కట్టడిపై శ్రద్ధే లేదు.

అధికారులు ఏమంటున్నారంటే...
అనుమతులు లేని ఆక్వా చెరువులను గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. కాలుష్యపై దృష్టిసారించాలని పీసీబీకి లేఖ రాశామని అటవీ శాఖ వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో సెల్వం తెలిపారు. సమస్య తమ దృష్టికి రాలేదనీ.. పరిశీలిస్తామని పీసీబీ ఈఈ అశోక్‌ చెప్పడం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts