జోరువానలోనూ కర్షక హోరు

కాసేపు ఎండ.. మరి కాసేపు జోరు వాన.. స్వల్ప వ్యవధిలోనే వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా రాజధాని రైతుల దృఢసంకల్పంలో ఎలాంటి మార్పు లేదు.

Updated : 07 Oct 2022 05:39 IST

రైతుల మహాపాదయాత్రకు ఊరూరా సంఘీభావాల వెల్లువ
హోరెత్తిన జై అమరావతి నినాదాలు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే-ఉండి, ఆకివీడు, గణపవరం, ఉంగుటూరు: కాసేపు ఎండ.. మరి కాసేపు జోరు వాన.. స్వల్ప వ్యవధిలోనే వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా రాజధాని రైతుల దృఢసంకల్పంలో ఎలాంటి మార్పు లేదు. గోతులు, బురదమయమైన రహదారులపై అడుగులో అడుగేస్తూ.. జై అమరావతి అంటూ నినదిస్తూ వారు ముందుకు సాగారు. రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్ర బుధ, గురువారాల్లో ఏలూరు జిల్లా గణపవరం, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు, ఉండి, కాళ్ల మండలాల్లో సాగింది. బుధవారం పెంటపాడు మండలంలో మొదలైన యాత్ర జల్లికొమ్మెర నుంచి గణపవరం మండలంలో ప్రవేశించింది. ఆ రోజు సరిపల్లి వరకూ సాగి ముగిసింది. 25వ రోజు గురువారం సరిపల్లి నుంచి పెదఅమిరం వరకు రైతులకు గ్రామగ్రామాన జనం నీరాజనాలు పలికారు. జోరువానలోనూ మద్దతుగా సాగారు.

అమరావతి సాధించినప్పుడే నిజమైన పండగ

బుధవారం విజయదశమి అయినా రైతులు పాదయాత్రకు విరామం ఇవ్వలేదు. అమరావతి సాధించినప్పుడే తమకు నిజమైన పండగంటూ నినదించారు. కె.పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయంలో 101 దేవతలకు ప్రతీకగా 101 కలశాలతో పూజలు చేశారు. తామంతా నిజమైన రైతులమని ప్రమాణం చేశారు. తమను ఫేక్‌ రైతులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులంటూ అభాండాలు వేస్తున్న మంత్రులకు ఇదే మా సమాధానమంటూ నినదించారు. దసరా అయినా పెంటపాడులో యాత్రకు జనం భారీగా తరలివచ్చి బాణసంచా కాలుస్తూ స్వాగతించారు. కె.పెంటపాడు గ్రామస్థులు రహదారికి ఇరువైపులా మామిడి తోరణాలు,    కొబ్బరాకులు కట్టి ఆవుదూడతో స్వాగతం పలికారు.

పెంటపాడు మండలంలో యాత్ర మొదలై పెదఅమిరంలో ముగిసేవరకూ దశలవారీగా వర్షం పడుతూనే ఉంది. రహదారుల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆరేడు గ్రామంలో గుంతల్లో రైతులు వరి దుబ్బులు నాటారు. యాత్ర ఉండి మండలంలోకి ప్రవేశించాక దాదాపు వంద ట్రాక్టర్లతో చుట్టుపక్కల రైతులు ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఉండి మండలం కోలమూరు గ్రామస్థులు ట్యాంకర్‌తో పాలు తెచ్చి రైతులు వచ్చే మార్గంలో పోసి ఆహ్వానించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో వైకాపా కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.

సంఘీభావాల వెల్లువ

బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆనందసూర్య ఆధ్వర్యంలో 30 మంది కమిటీ సభ్యులు విజయవాడ నుంచివచ్చి ఉండి వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరయ్యారు. బహుజన సంఘం, భారతీయ కిసాన్‌సంఘ్‌, తెలుగు రైతు, రాష్ట్ర రైతు సంఘం సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తెదేపా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు రామరాజు, రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, వేటుకూరి వెంకట శివరామరాజు, తెదేపా నేత బడేటి చంటి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తదితరులు యాత్రలో పాల్గొన్నారు.


25వ రోజు యాత్ర ఇలా..

ప్రారంభం: ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి
ముగింపు: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం
నడిచిన దూరం: 15 కి.మీ.


అడుగడుగునా అగచాట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభమైనప్పటి  నుంచి ఒక రోజు మండేఎండ కాస్తే, మరో రోజు జోరువానతో రైతులు తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటికే కాళ్లకు బొబ్బలెక్కాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా దారి పొడవునా అధ్వాన రహదారులు భయపెట్టిస్తున్నాయి. రాష్ట్రమంతటా బుధవారం దసరా పండగ చేసుకుంటే.. రైతులు మాత్రం కుటుంబాలకు దూరంగా యాత్రలో పాల్గొన్నారు. వర్షాలు కురుస్తుండడంతో భోజన సౌకర్యాలకూ అవస్థలు పడుతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని