Chemotherapy: ఆసుపత్రిలో చేరకుండానే కీమోథెరపీ.. నిమ్స్‌లో అందుబాటులోకి..

క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి పంజాగుట్ట నిమ్స్‌లో కీమో థెరపీ డే కేర్‌ కేంద్రం ఏర్పాటైంది. ఆసుపత్రిలో చేరకుండానే వైద్యం చేసేందుకు ఈ కేంద్రాన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

Updated : 20 Oct 2022 08:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి పంజాగుట్ట నిమ్స్‌లో కీమో థెరపీ డే కేర్‌ కేంద్రం ఏర్పాటైంది. ఆసుపత్రిలో చేరకుండానే వైద్యం చేసేందుకు ఈ కేంద్రాన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ, జర్నలిస్టు ఆరోగ్య కార్డుదారులకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం కల్పించారు. గురువారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆసుపత్రి మెడికల్‌ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సదాశివుడు వెల్లడించారు. ఇప్పటివరకు క్యాన్సర్‌ రోగులకు ఒక్క రోజు కీమోథెరపీ చేయాల్సి వచ్చినా.. తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయి రోగి డిశ్చార్జి అయ్యే వరకు నాలుగైదు రోజులు కేటాయించాల్సి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సమయం వృథా అయ్యేది. ఈ కేంద్రం వల్ల త్వరగా సేవలందించేందుకు అవకాశం ఉంది. పేదలకు వేగంగా, ఉచితంగా కీమోథెరపీ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా 30 పడకలు ఏర్పాటుచేశామని సదాశివుడు పేర్కొన్నారు. దీంతో రోజుకు వంద మందికి ఇక్కడ చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని