సంక్షిప్త వార్తలు (13)

మల్కాన్‌గిరి-భద్రాచలం రైల్వే ప్రాథమిక సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Updated : 26 Nov 2022 06:09 IST

మల్కాన్‌గిరి- భద్రాచలం రైల్వే సర్వే ముమ్మరం

అశ్వాపురం, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి-భద్రాచలం రైల్వే ప్రాథమిక సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతిపాదిత భద్రాచలం రైల్వే స్టేషన్‌, ప్రస్తుతం ఉన్న పాండురంగాపురం రైల్వే స్టేషన్‌ మధ్యలోని కృష్ణసాగరం వద్ద మణుగూరు ప్రధాన రహదారి పక్కన భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి, భద్రాచలాన్ని ఈ మార్గం అనుసంధానిస్తుంది.


ఉచిత పంటల బీమా నోటిఫికేషన్‌ విడుదల

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా (వాతావరణ ఆధారిత పథకం) నోటిఫికేషన్‌ను ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన పంటలు సాగు చేసిన,  ఈ-పంటలో నమోదు చేసిన వివరాల ఆధారంగా ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులు ఈ పథకానికి అర్హులు. దీనిని అమలు చేసేందుకు వ్యవసాయశాఖ నోడల్‌ ప్రభుత్వ విభాగంగా వ్యవహరించనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళికా శాఖ సిద్ధం చేసిన వాతావరణ డేటా ఆధారంగా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల స్థాయి వర్షపాతం నమోదు కేంద్రాల సమాచారం ఆధారంగా మాత్రమే ఈ బీమా నిర్ణయిస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2022 ఖరీఫ్‌, 2022-23 రబీ కాలానికి ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలకు ఎంత మేర బీమా వర్తించేదీ వెల్లడించింది.


‘పోలవరం’ వద్ద కొండను పరిశీలించిన జీఎస్‌ఐ డైరెక్టర్‌

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని గ్యాప్‌-1, 2లతో పాటు సమీపంలోని కొండను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) డైరెక్టర్‌ బి.అజయ్‌కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాయిని నిర్మాణానికి ఎంత వరకు వినియోగించుకోవచ్చనే విషయంపై జలవనరులశాఖ, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. గ్యాప్‌-1, 2ల మధ్య జియో టెక్నికల్‌ మ్యాపింగ్‌ చేశారు. ఆయన వెంట సీనియర్‌ జియాలజిస్ట్‌ వేణుగోపాలకృష్ణ, ఈఈ పాండురంగయ్య, డీఈలు శ్రీనివాసరావు, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.


జనవరి నుంచి ఒక డీఏ మంజూరు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది జనవరి నుంచి ఒక డీఏ మంజూరు చేసేందుకు సీఎం జగన్‌ అంగీకారం తెలిపారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్‌-3 సర్వేయర్లను గ్రేడ్‌-2గా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున సర్వేయర్లతో కలిసి శుక్రవారం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల పూర్తి బాధ్యతలు కేటాయించాలని సీఎంను కోరగా.. దీనిపై  సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఏప్రిల్‌లో నిర్వహిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కిషోర్‌ ఉన్నారు.


27న ‘సెవో’ తొలి మహాజన సభ

ఏపీ ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు  

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సచివాలయాల ఉద్యోగుల సంక్షేమ సంస్థ (సెవో) ప్రథమ మహాజన సభ 27న ఉదయం 10.30 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత లెనిన్‌ సెంటర్‌ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ప్రదర్శనగా వెళ్తామన్నారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్‌, పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అనంతరం మహాజన సభ ప్రచార పత్రాలను బొప్పరాజు ఆవిష్కరించారు. రాష్ట్ర అడ్‌హక్‌ కమిటీ సభ్యుడు వి.అర్లయ్య, ఐకాస నాయకులు వైవీ రావు, మురళీకృష్ణనాయుడు, కె.సంగీతరావు, సచివాలయాల ఉద్యోగుల నాయకులు గోవింద్‌, జ్యోతి, జి.దుర్గారావు, టి.వెంకట మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


నాడు-నేడు పనుల్లో ప్రగతి లేదని.. 32 మంది హెచ్‌ఎంలకు తాఖీదులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: మన బడి, నాడు-నేడు పనుల్లో పురోగతి చూపనందుకు అనంతపురం జిల్లాలో 32 మంది ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులిచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారి వెంకటకృష్ణారెడ్డి, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త తిలక్‌విద్యాసాగర్‌ ఈ మేరకు తాఖీదులు ఇచ్చారు. బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో జాప్యం చేసినందున క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ముందస్తుగా నోటీసులిచ్చామని తిలక్‌విద్యాసాగర్‌ తెలిపారు. విడుదలైన నిధులు సక్రమంగా వినియోగించడం లేదని జిల్లాలోని గుత్తి, డి.హీరేహాళ్‌, గుమ్మఘట్ట, ఉరవకొండ, గుంతకల్లు, గార్లదిన్నె, బొమ్మనహాళ్‌, తాడిపత్రి, పామిడి, రాప్తాడు, అనంతపురం మండలాల్లోని మొత్తం 32 మంది ప్రధానోపాధ్యాయులకు తాఖీదులిచ్చామని పేర్కొన్నారు.


జగన్‌ ఫొటోల ముద్రణపై కోర్టును ఆశ్రయిస్తాం

తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ మూడున్నరేళ్లలో వైకాపా వాళ్లు దోచుకున్న భూములను చట్టబద్ధం చేసి వారికి కట్టపెట్టేందుకే ‘భూరక్ష, భూసర్వే’ పథకాన్ని తెచ్చారని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై జగన్‌ బొమ్మలు ఎలా ముద్రిస్తారని, ఈ వ్యవహారంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. హక్కుదారులు, హద్దుదారులు లేకుండా చేసే సర్వేతో ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


జోనల్‌ పోస్టుగా ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2

ఈనాడు-అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున పనిచేసే ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టును జిల్లా క్యాడర్‌ నుంచి జోనల్‌ క్యాడర్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ ఫార్మసిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇకపై జిల్లా అధికారుల ద్వారా కాకుండా ప్రాంతీయ సంచాలకుల ద్వారా ఫార్మసిస్ట్స్‌ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఏపీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిందని వెల్లడించారు. 2001 నుంచి ఫార్మసిస్టులను ఒప్పంద విధానంలో నియమిస్తున్నారు. అంతకుముందు పర్మినెంట్‌గా విధుల్లో జిల్లా కేడర్‌లో చేరిన వారికి పదోన్నతులు, అదనంగా ఆర్థిక ప్రయోజనాలు లభించడం లేదు. 1960లో స్టేట్‌ కేడర్‌ పోస్టుగా ఉంది. దీనిపై అసోసియేషన్‌ పోరాటం చేసినందున ప్రస్తుతం జోనల్‌ కేడర్‌గా మార్చారు. దీని వల్ల పీఆర్సీ, ఇతర అంశాల్లో అదనంగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు మెరుగుపడ్డాయి.


బీటెక్‌ విద్యార్థినులకు క్లౌడ్‌ టెక్నాలజీ శిక్షణపై ఒప్పందం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బీటెక్‌ చదివే ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థినులకు ఉచితంగా క్లౌడ్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ వంటి కోర్సులపై శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉన్నత విద్యామండలి, ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌లు శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో  శిక్షణ ఇస్తారు. ఒక్కో కోర్సు 160 గంటల పాటు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు త్వరలో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకటించింది.


‘వక్ఫ్‌బోర్డుకు పూర్తి స్థాయి సీఈవో నియామకానికి ఇద్దరి పేర్లను సూచించండి’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వక్ఫ్‌బోర్డు సీఈవోకు పూర్తి స్థాయి అధికారిని నియమించేందుకు అర్హత కలిగిన ఇద్దరు అధికారుల పేర్లు సూచించాలని ఆ సంస్థ ఇన్‌ఛార్జీ సీఈవో అబ్దుల్‌ ఖాదర్‌ను మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మెమో జారీ చేశారు. గతంలోనూ ఆయన ఇదే తరహా ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు నియమించకపోవడం గమనార్హం. తాజాగా రెండోసారి ఆయన ఆదేశాలిచ్చారు.

మైనార్టీ కమిషన్‌కు వైస్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకం

రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు వైస్‌ ఛైర్మన్‌గా డేనియల్‌ను, సభ్యులుగా హిదయతుల్లా, జితేందర్‌ సింగ్‌, సైఫుల్లాను ప్రభుత్వం నియమించింది.


తేలికపాటి వర్షాలకు అవకాశం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి లేదా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది.  శుక్రవారం ఉదయం వాల్తేరులో 018.3 మిల్లీమీటర్లు, విశాఖ విమానాశ్రమంలో 007.1మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించింది.


శ్రీవారి సేవలో సీఎస్‌ సమీర్‌శర్మ

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్‌శర్మ దంపతులు శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సీఎస్‌ దంపతులకు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఈవో తీర్థప్రసాదాలు, క్యాలెండర్‌ అందజేశారు.


ఉత్కంఠ రేకెత్తించిన ఆయుర్వేద వైద్యుల ఎన్నికలు

ఈనాడు, అమరావతి: ఉత్కంఠ రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్‌ ఆయుర్వేదిక్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ రాత్రి తొమ్మిది గంటల వరకు సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్‌ తరఫున పని చేస్తున్న 246 మంది వైద్యుల్లో 230 మంది వైద్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు నిబంధనల ప్రకారం జరగడం లేదని ప్రభుత్వానికి ఓ వైద్యుడి నుంచి ఫిర్యాదు అందింది. మరోవైపు రిటర్నింగ్‌ అధికారిగా నియమించిన వైద్యుడు శ్రీనివాసరావు తాను ఎన్నికలు జరపలేనని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఓ దశలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి రిటర్నింగ్‌ అధికారిగా  వ్యవహరించే విషయమై చర్చకు వచ్చింది. అయితే పోటీలో ఉన్నవారు, మెజార్టీ వైద్యులు ఏకాభిప్రాయంతో వైద్యుల్లోనే నలుగురు సీనియర్లను ఎన్నికల నిర్వాహకులుగా నియమించుకున్నారు. ప్రధాన పోటీ డాక్టర్‌ టి.బుల్లయ్య, డాక్టర్‌ పి.మహతి నేతృత్వంలోని ప్యానళ్ల మధ్య నెలకొంది. ఈ ఎన్నిక కోసం ఆయుర్వేద వైద్యులందరూ రెండు రోజుల నుంచే విజయవాడలోనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని