Andhra News: వైకాపా నేత బంధువుల లేఅవుట్‌లోకి భారీగా మట్టి తరలింపు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో విజయనగరం-బౌడారా జాతీయ రహదారి-516కు సమీపంలో డి-ఫారం భూమిలో 20 రోజులుగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.

Updated : 04 Dec 2022 09:13 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో విజయనగరం-బౌడారా జాతీయ రహదారి-516కు సమీపంలో డి-ఫారం భూమిలో 20 రోజులుగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎర్రచెరువును ఆనుకుని ఉన్న ఓ గిరిజనుడికి చెందిన భూమిలో సాగుతున్న ఈ దందా ట్రాక్టరు యజమానుల మధ్య వివాదంతో శనివారం వెలుగులోకి వచ్చింది. అది పోలీసుస్టేషనుకు చేరి, లోపలికి వెళ్లక ముందే స్థానిక నాయకులు రంగంలోకి దిగి రాజీ కుదిర్చారు. ఈ మట్టిని జిల్లాకు చెందిన ఉన్నత పదవిలో ఉన్న ఓ వైకాపా నేత బంధువులు ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 80 ఎకరాల్లో వేసిన లే-అవుట్కు తరలిస్తున్నట్లు సమాచారం. మట్టి కోసం గిరిజనుడికి చెందిన డి-ఫారం భూమిని కొన్నారు. ఈ తవ్వకాలకు అనుమతులు లేవని మండల అధికారి చెప్పడం విశేషం. ఇతరులైతే వాహనాలు సీజ్‌ చేసే అధికారులు భారీ స్థాయిలో జేసీబీలు, ట్రాక్టర్లతో తవ్వకాలు సాగిస్తుంటే చర్యలు తీసుకోకుండా చూస్తున్నారంటే వారిపై ఒత్తిళ్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఎస్‌ కోట తహసీల్దార్‌ శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మట్టి తవ్వకాల గురించి తెలియగానే వీఆర్వోను పంపానని, అక్కడ వాహనాలేవీ లేవని చెప్పారని, ఆదివారం రెవెన్యూ ఇన్‌స్పెక్టరును పంపి విచారణ చేయిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని