ప్రజలకు మూడు బిలియన్ల టీకాలు అందించాం

దేశ ప్రజలకు మూడు బిలియన్ల టీకాలు అందించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల తెలిపారు.

Updated : 08 Dec 2022 04:47 IST

భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల

వెంకటగిరి, న్యూస్‌టుడే: దేశ ప్రజలకు మూడు బిలియన్ల టీకాలు అందించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల తెలిపారు. భారత్‌ బయోటెక్‌ స్థాపించినప్పటి నుంచి 18 రకాల టీకాలు కనిపెట్టినట్లు చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో బుధవారం ‘మన డాక్టర్‌ మస్తాన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ను ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్‌లో కొవాగ్జిన్‌ తయారుచేసి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న సూక్తితో తమ సంస్థ సమష్టి కృషితో ఈ వ్యాక్సిన్‌ తయారు చేసిందన్నారు. ప్రజలకు రెండు డోసులకు సరిపడా టీకాలే కాకుండా అదనంగా మరో డోసుకు సరిపడా ఉత్పత్తి చేసిన ఘనత మన దేశానికే దక్కిందన్నారు. ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యం, సామాజికాభివృద్ధి కోణంలో సేవలు అందించాలని, ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని డాక్టర్‌ మస్తాన్‌కు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో దేశఖ్యాతిని భారత్‌ బయోటెక్‌ సంస్థ చాటిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జన్మభూమికి సేవలు అందించేందుకు డా.మస్తాన్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కరోనా సమయంలో మరణాల శాతం తగ్గడంలో భారత్‌ బయోటెక్‌ పాత్ర కీలకమైందన్నారు. అతిథుల చేతులమీదుగా ట్రస్ట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ మస్తాన్‌యాదవ్‌, తెదేపా జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని