Andhra News: రూ.48,303 కోట్ల అప్పు తీసేసుకున్నాం

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలు మిగిలి ఉండగానే బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.48,303 కోట్ల రుణాలను సమీకరించేసింది.

Updated : 25 Jan 2023 09:46 IST

తాజాగా రూ.వెయ్యి కోట్ల రుణం
ఇక రెండు నెలల్లో రూ.1,557 కోట్లకే అవకాశం
సొంత పన్నుల రాబడికి  చేరువలో అప్పులు
ఇంకా రూ.2,200 కోట్ల  ఓవర్‌ డ్రాఫ్ట్‌లోనే..

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలు మిగిలి ఉండగానే బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.48,303 కోట్ల రుణాలను సమీకరించేసింది. ఈ ఏడాది కేంద్రం మొత్తం రూ.49,860 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకు అవకాశమిచ్చింది. దీంతో ఇక మిగిలిన రెండు నెలలకు రూ.1,557 కోట్లే తీసుకునే అవకాశముంది. తాజాగా మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని రూ.వెయ్యి కోట్ల రుణాన్ని 12 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.69 శాతం వడ్డీకి తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బేవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.8,300 కోట్ల రుణం తీసుకుంది. అలాగే వివిధ కార్పొరేషన్ల నుంచి రూ.20వేల కోట్ల రుణాలను సమీకరించినట్లు అనధికారిక సమాచారం పేర్కొంటోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రుణాలు దాదాపు రూ.76వేల కోట్లకు మించిపోయినట్లు అనధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయినా ఇంకా రూ.2,200 కోట్ల ఓవర్‌ డ్రాఫ్ట్‌లో రాష్ట్రం ఉండటం విశేషం. కార్పొరేషన్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తానికి గ్యారంటీలు ఇచ్చింది? ఎంత మొత్తం రుణాలు సమీకరించిందనే విషయాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం లేదు.

రాబడికి చేరువవుతున్న రుణాలు

రాష్ట్రంలో సొంత పన్నులు ఏ స్థాయిలో ఉన్నాయో.. దానికి చేరువగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులను సమీకరిస్తోంది. కాగ్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం 2022 నవంబరు వరకు అంటే... 8 నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడి రూ.71,227.06 కోట్లుగా ఉంది. సగటున నెలకు రాష్ట్ర ప్రభుత్వ రాబడి రూ.8,903 కోట్లుగా ఉంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఆ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ రాబడి సుమారు రూ.89,033 కోట్లు ఉండొచ్చని సరాసరి లెక్కల ఆధారంగా అంచనా వేయవచ్చు. మరో పక్క తొలి 10 నెలల్లో రాష్ట్ర రుణ భారం దాదాపు రూ.76వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. నాబార్డు, కేంద్రం నుంచి అందేవి, ఇతర మరికొన్ని రుణాలు ఇందులో కలిపి లేవు.

ఈ వారంలో ఏకంగా రూ.5,000 కోట్ల కార్పొరేషన్ల రుణం

సంక్రాంతి పండగ వెళ్లిన తర్వాత కొన్ని ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి గ్యారంటీ ఇచ్చి దాదాపు రూ.5,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిసింది. జనవరిలో బహిరంగ మార్కెట్‌లో సమీకరించిన రూ.3000 కోట్ల రుణం కలిపితే.. ఇప్పటివరకూ రూ.8,000 కోట్లు తీసుకున్నట్లయింది. కేంద్రం నుంచి రూ.2,800 కోట్ల మొత్తం పన్నుల్లో వాటాగా వచ్చింది. అవి కాకుండా రోజుకు దాదాపు రూ.400 కోట్ల వరకు రాష్ట్ర రాబడి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే గడిచిన వారంలో దాదాపు రూ.10వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని