అవధానం తెలుగు వారి సొత్తు

భాష పరిణామక్రమంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినప్పటికీ అవధానం తెలుగు భాషకు ప్రత్యేకమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

Updated : 28 Jan 2023 06:41 IST

పంచసహస్రావధాని మేడసాని మోహన్‌కు కనకాభిషేకం
వంశీ సంస్థకు రూ.లక్ష విరాళం ప్రకటించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: భాష పరిణామక్రమంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినప్పటికీ అవధానం తెలుగు భాషకు ప్రత్యేకమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అవధాన ప్రక్రియ అసాధారణ మేధస్సు, వ్యాకరణంపై పట్టు, జ్ఞాపకశక్తి..అన్నింటికీ మించి సమయస్ఫూర్తి మేళవింపుగా ఉంటుందన్నారు. శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్‌, శుభోదయం గ్రూప్‌ ఆధ్వర్యంలో పంచసహస్రావధాని డా.మేడసాని మోహన్‌కు కనకాభిషేకం చేశారు. సాహితీవేత్త డా.ఓలేటి పార్వతీశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, 15 ఏళ్ల వయసులోనే అవధానాలు ప్రారంభించి ప్రపంచ ఖ్యాతిని గడించిన మేడసాని మోహన్‌కు కనకాభిషేకం జరగడం తెలుగువారి అదృష్టమన్నారు. తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు.కంప్యూటింగ్‌ ఎంత కఠినమైందో.. అవధానం చేయడమూ అంతే కష్టమన్నారు. అవధానంలోని మాధుర్యాన్ని ప్రజలంతా ఆస్వాదించాలంటే అందుకు తగిన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో ఆంగ్లం తప్పదని..ఇంట్లో అయినా పిల్లలతో తెలుగులో మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు. వంశీ సంస్థ చేస్తున్న కృషికి తనవంతుగా రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వంశీ రామరాజు స్వాగతోపన్యాసం చేయగా రసమయి సంస్థల అధినేత డా.ఎం.కె.రాము అవధానం గురించి తెలియజేశారు. అనంతరం జరిగిన అవధానానికి డా.తిరుమల శ్రీనివాసాచార్యులు అధ్యక్షులుగా వ్యవహరించారు. డా.సుమతీనరేంద్ర, డా.ఓలేటి పార్వతీశం, డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, టి.గౌరీశంకర్‌, ఫణీంద్ర, డా.కావూరి శ్రీనివాస్‌, చిక్కా రామదాసు, రాధిక మంగిపూడి పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నాస్త్రాలకు మేడసాని మోహన్‌ సమాధానాలు ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు