Taraka Ratna: తారకరత్న గుండె స్పందిస్తోంది

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో శుక్రవారం అర్ధరాత్రి చేరిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోయినా, ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్య బృందాలు వెల్లడించాయి.

Updated : 30 Jan 2023 05:15 IST

ఇక మెదడు పనితీరు మెరుగుపడాలి
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

ఈనాడు, బెంగళూరు: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో శుక్రవారం అర్ధరాత్రి చేరిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోయినా, ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్య బృందాలు వెల్లడించాయి. కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. నిమ్హాన్స్‌ న్యూరోసర్జన్‌ ప్రొఫెసర్‌ గిరీష్‌ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదకరస్థితి నుంచి కోలుకోకపోయినా శనివారంతో పోలిస్తే తారకరత్న ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. మెదడు పని తీరులో మార్పులు ఇతర అవయవాలపై ప్రభావం చూపినట్లు సుధాకర్‌ వెల్లడించారు. ఈ కారణంగా అంతర్గత రక్తస్రావానికి అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్‌ల నుంచి 10 మంది వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

రెండు సార్లు స్పందించారు: బాలకృష్ణ

తారకరత్న ఆరోగ్యంలో మార్పులు తమలో విశ్వాసాన్ని పెంచాయని సినీ నటుడు బాలకృష్ణ వెల్లడించారు. రెండు సార్లు తారకరత్న శరీరంపై గిచ్చినప్పుడు ఓసారి స్పందించారని, కళ్లలోనూ కదలికలు చూశానని తెలిపారు. అంతర్గత రక్తస్రావం, అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు చెప్పారని వివరించారు. ఆదివారం నారాయణ హృదయాలకు సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆయన సతీమణి ప్రణతి, సోదరుడు కల్యాణ్‌ రామ్‌, లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణి, కన్నడ సినీనటుడు శివరాజ్‌కుమార్‌ తదితరులు వచ్చారు. ప్రజలు, తాతగారి ఆశీస్సులతో తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు. కానీ ప్రమాదకర స్థితి నుంచి బయట పడలేదని వైద్యులు చెబుతున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని