సీఐడీ విచారణకు విజయ్‌

‘భారతీ పే’ పోస్టుల వ్యవహారంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ సోమవారం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Published : 31 Jan 2023 03:13 IST

‘భారతీ పే’ పోస్టుల కేసులో 8 గంటలపాటు ప్రశ్నలు
బీసీ నేతలను ప్రభుత్వం భయపెట్టడమేనని తెదేపా ఆగ్రహం
లోకేశ్‌ యాత్రపై ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలో భాగమని ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘భారతీ పే’ పోస్టుల వ్యవహారంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ సోమవారం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు 8గంటలపాటు ఆయన్ని విచారించారు. ఉదయం 10.45కు సీఐడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన్ని రాత్రి ఏడింటి తర్వాత విడిచిపెట్టారు. ఫిబ్రవరి 16న మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు చెప్పారని విజయ్‌ తెలిపారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ, మరోవైపు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర నుంచి జనం దృష్టి మరల్చేందుకే తనను సీఐడీ విచారణ పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే తమ కుటుంబంపై, బీసీలపైన సీఎం, ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ‘చట్టంపై గౌరవంతో విచారణకు హాజరయ్యా. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా’ అని వివరించారు. ‘భారతీ పే’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ గతేడాది సెప్టెంబరులో సీఐడీ కేసు నమోదైంది. ఐటీడీపీ వ్యవహారాలు చూస్తున్న విజయ్‌ దీనికి బాధ్యులంటూ సీఐడీ 41ఎ నోటీసులిచ్చింది.

పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం

విచారణను పురస్కరించుకుని సీఐడీ పరిసరాలకు పెద్దఎత్తున తెదేపా నాయకులు, ఐటీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వారిని ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ నినాదాలు చేస్తున్న నాయకుడు నసీర్‌ను స్టేషన్‌కు తరలించారు.

విజయ్‌కు తోడుగా తండ్రి అయ్యన్నపాత్రుడు

విజయ్‌ తన తండ్రి.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో కలిసి తొలుత గుంటూరులోని తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. సీఐడీ కార్యాలయ పరిసరాలకు రాకుండా తెదేపా నేతలను అడ్డుకుంటున్నారని తెలుసుకుని పార్టీ కార్యాలయంలోనే అయ్యన్న ఉండిపోయారు. రాత్రి విచారణ ముగిసే సమయంలో సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం బీసీ వర్గాలపై కక్ష కట్టి వేధిస్తోందని, చట్టంపై గౌరవం ఉన్న వ్యక్తులుగా తాము విచారణకు హాజరయ్యామని వివరించారు. ఉత్తరాంధ్రలో వైకాపా అరాచకాలకు ఎదురొడ్డి బీసీలకు అండగా తమ కుటుంబం ఉంటోందని, అందుకే దెబ్బతీయాలని చూస్తున్నారని చింతకాయల విజయ్‌ పేర్కొన్నారు. రాజకీయంగా మచ్చలేని అయ్యన్న కుటుంబాన్ని అణగదొక్కేందుకు వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 92 సీఐడీ కేసులు పెట్టింది. ఏ ఒక్క కేసులోనూ ఛార్జిషీటు దాఖలు చేయలేదు. దాఖలుకు ఆయా కేసుల్లో ఏమీ లేదు’ అని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వివరించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌, పార్టీ నేతలు పట్టాభిరామ్‌, బుద్ధా వెంకన్న విజయ్‌కు సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని