భూమాతకు తూట్లు... అక్రమార్కులకు రూ.కోట్లు!
నిబంధనలను తుంగలో తొక్కి... మట్టి తవ్వకాలతో అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు... ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించడం.. అడ్డుకుంటే దాడికి దిగడం.. ఎదురు కేసులు పెడతామని హెచ్చరించడం ఇదీ తీరు. అధికార పార్టీ నేత అండదండలతో మరింతగా చెలరేగిపోతున్నారు.
మట్టి మాటున విధ్వంసం
గుంటూరు జిల్లాలో పేట్రేగుతున్న మాఫియా
ఈనాడు, అమరావతి: నిబంధనలను తుంగలో తొక్కి... మట్టి తవ్వకాలతో అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు... ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించడం.. అడ్డుకుంటే దాడికి దిగడం.. ఎదురు కేసులు పెడతామని హెచ్చరించడం ఇదీ తీరు. అధికార పార్టీ నేత అండదండలతో మరింతగా చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో శేకూరు, శలపాడు, వీఎన్‌పాలెంలో లభిస్తున్న నాణ్యమైన ఎర్రమట్టికి విపరీతమైన డిమాండుంది. తవ్వకాలను వృత్తిగా మార్చుకున్న కొందరు మాఫియాగా ఎదిగారు. ప్రైవేటు భూములను ఎకరం రూ.40 లక్షలకు కొంటారు. అనుమతులు, రవాణా, అధికారులు రాకుండా లాబీయింగ్ కోసం ప్రజాప్రతినిధికి ముడుపులతోపాటు ఆదాయంలో వాటా ఇస్తారు. భూగర్భ గనులశాఖ నుంచి 6 మీటర్ల లోతు వరకు మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకుంటారు. భారీ యంత్రాల సాయంతో 100 అడుగులకుపైగా తవ్వేస్తున్నారు. అక్రమార్కుల అడ్డగోలు పనులకు భారీ గోతులు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ తవ్వకాల తీరుపై ‘ఈనాడు-ఈటీవీ’ పరిశీలనాత్మక కథనం ఇదీ..
చేబ్రోలు మండలంలో నాణ్యమైన ఎర్రమట్టి లభించడం స్థానికులకు శాపమైంది. తవ్వకాలవల్ల ఏర్పడిన భారీ గోతుల్లో వర్షపు నీరు నిలిచి వాటిలో పడి పశువులు చనిపోతున్నాయి. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. పొలాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. మట్టి తరలించే క్రమంలో సపోటా, మామిడి తోటలపై దుమ్ము పరచుకుని, పూత దెబ్బతిని ఆశించిన స్థాయిలో కాయలు కాయడం లేదంటూ రైతులు వాపోతున్నారు. మట్టిని తరలించే వాహనాల రాకపోకలవల్ల రహదారి పాడైంది. తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు ధర్నాకు దిగితే అధికార పార్టీ నేత పోలీసుల చేత దౌర్జన్యాలు చేయిస్తున్నారు. మట్టి లారీలను అడ్డుకోవాలని చూస్తే ఎదురుకేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు..
మట్టి తరలించే లారీలు నిబంధనల ప్రకారం 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకే రవాణా చేయాలి. ఒక్కో లారీలో 50 టన్నులకుపైగా మట్టి నింపి తరలిస్తున్నారు. దీంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. గనులశాఖకు క్యూబిక్ మీటరు మట్టికి పన్నులు కలిపి రూ.124 చెల్లించాలి. పర్మిట్లు తీసుకోకుండా మట్టి తరలిస్తూ గనులశాఖ ఆదాయానికి రూ.కోట్లలో గండికొడుతున్నారు. భూగర్భ గనులు, రెవెన్యూ, రవాణా, పర్యావరణ, పోలీసుశాఖలకు ఇదంతా తెలిసినా అధికార పార్టీ నేత కనుసన్నల్లో సాగుతున్నందున ఇటువైపు వచ్చే సాహసం చేయడం లేదు.
అమ్మాలని బెదిరిస్తున్నారు
నాకు పూర్వీకుల నుంచి వచ్చిన 80 సెంట్ల పొలం ఉంది. సపోటా తోట వేసుకుని జీవిస్తున్నా. మట్టి తవ్వకం కోసం భూమిని అమ్మాలని కొందరు బెదిరిస్తున్నారు. అమ్మేది లేదని చెప్పా. నీ పొలానికి నీళ్లు ఎలా వస్తాయో చూస్తామని హెచ్చరిస్తున్నారు. మా గ్రామాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఏం చేయాలనుకుంటున్నారు? ఊళ్లోవాళ్లు బతకాలా... వద్దా?
గాలి నిర్మల, శేకూరు, చేబ్రోలు మండలం
పంటలు నష్టపోతున్నాం
రాత్రీపగలూ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. మురుగునీటి కాలువ కట్టపై భారీ లారీలు తిరగడంవల్ల అది దెబ్బతింది. ఆ కట్ట తెగితే మా పొలాలు మునుగుతాయి. పంటలకు పూత, కాత వచ్చినా ధూళి పడి కాయలు చేతికి రావడం లేదు. బోరుబావులు ఎండి అవస్థలు పడుతున్నాం.
మైలా వెంకటరామరాజు, శలపాడు
ఫిర్యాదు చేసినా నిరుపయోగం
అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. భారీ తవ్వకాలవల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. మట్టి తవ్వకాలతో గాలిలో దుమ్మూధూళి చేరి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వశాఖలు స్పందించకపోవడం దారుణం.
వీరంకి రంగారావు, విశ్రాంత జియాలజిస్టు, వడ్లమూడి
నివేదిక వచ్చాక చర్యలు
స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు... చేబ్రోలు మండలంలో మట్టి తవ్వకాల్లో లీజులు, నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెనాలి సబ్‌కలెక్టర్‌ను ఆదేశించాం. నివేదిక వచ్చాక అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్, గుంటూరు జిల్లా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు