సంక్షిప్త వార్తలు (9)

రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. రాబోయే రోజుల్లో మన రాజదాని కాబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానంటూ జనవరి 31న దిల్లీలో పెట్టుబడిదారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొనడం న్యాయస్థాన ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్‌ 2(సి)ను ఉల్లంఘించినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 04 Feb 2023 05:40 IST

ముఖ్యమంత్రి జగన్‌పై సుప్రీంకు లేఖ
విశాఖ రాజధాని అనడం ‘ధిక్కారమే’
సుమోటోగా స్వీకరించాలని సీజేఐను కోరిన హైకోర్టు న్యాయవాది

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. రాబోయే రోజుల్లో మన రాజదాని కాబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానంటూ జనవరి 31న దిల్లీలో పెట్టుబడిదారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొనడం న్యాయస్థాన ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్‌ 2(సి)ను ఉల్లంఘించినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మాటల ద్వారా సుప్రీం కోర్టు అధికారాన్ని ఆయన ధిక్కరించారని స్పష్టమైందన్నారు. ఈ దృష్ట్యా ఆయనపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాసినట్లు తెలిపారు.


ఉపాధి కూలీలుగా వాలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వాలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను ఉపాధి హామీ కూలీలుగా నమోదు చేశారు. వారికీ వేతనాలు చెల్లించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీ బృందం శుక్రవారం నిర్వహించిన ప్రజా వేదికలో వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొమరోలు మండలంలోని అల్లినగరం, చింతపల్లె, రెడ్డిచెర్ల, కొమరోలు గ్రామాల్లో జరిగిన పనులపై ఇటీవల సామాజిక తనిఖీ చేశారు. ఇందులో గ్రామ వాలంటీర్లు, అంగన్‌వాడీ సిబ్బందిని కూలీలుగా చూపి, వేతనాలనూ మంజూరు చేశారు. వాస్తవానికి వాలంటీర్లుకు వారానికి 3 రోజులు ఉపాధి పని చేసుకోవచ్చు. కానీ, అంతకంటే ఎక్కువ దినాలు వారికి పని కల్పించినట్లు గుర్తించామని తనిఖీ బృందం అధికారి నీలకంఠ తెలిపారు. పూర్తి స్థాయి దస్త్రాలను పరిశీలించి శనివారం స్థానిక అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు.


దరఖాస్తు చేసుకున్నఅందరికీ విదేశీ విద్యా దీవెన

ఈనాడు, అమరావతి: ‘విదేశాల్లోని ప్రతిష్ఠాత్మకమైన 200 విశ్వవిద్యాలయాల్లో సీటు తెచ్చుకుని, జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ సాయం అందిస్తాం.. లబ్ధిదారుల సంఖ్యలో సీలింగ్‌ ఉండదు’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ‘గతంలో తెదేపా ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ పథకం నీరుగారిపోయింది, విజిలెన్స్‌ విచారణలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటన్నింటినీ సరిచేసి ఇప్పుడు విద్యార్థులకు పూర్తిస్థాయిలో సాయమందించేలా పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


స్థానిక సంస్థల ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 62 సర్పంచులు, 107 ఎంపీటీసీ, 62 జడ్పీటీసీ, 915 గ్రామ వార్డు సభ్యుల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు నిర్వహించనుంది. వీటిలో ఎన్నికల నిర్వహణ కోసం తాజా ఓటర్ల జాబితాలు పబ్లిష్‌ చేయాలని కలెక్టర్లను శుక్రవారం ఆదేశించింది. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈనెల 27న, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మార్చి 2న ఓటర్ల జాబితాలు పబ్లిష్‌ చేయాలని  ఎన్నికల సంఘం కోరింది. అనంతరం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాల విషయంలో జరుగుతున్న జాప్యంపై ‘పరోక్ష ఎన్నికలపై ఉత్సాహం...ప్రత్యక్ష ఎన్నికలపై తాత్సారం’ శీర్షికతో ‘ఈనాడు’లో శుక్రవారం కథనం వెలువడింది. దీనిపై ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని అధికారులతో సమావేశమై కలెక్టర్లకు ఈ ఆదేశాలు పంపారు.


రాయితీ 60 శాతానికి పెంచాలి: డిక్కీ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే 2023-2028 నూతన పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రస్తుతం ఇచ్చే రాయితీ 45 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని ప్రభుత్వానికి సూచించినట్లు దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ (డిక్కీ) జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయ సేకరణకు శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి హాజరైనట్లు తెలిపారు.


క్రీడలు, యువజన సర్వీసులశాఖలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ

ఈనాడు, అమరావతి: క్రీడలు, యువజన సర్వీసులశాఖలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు, ఫిర్యాదులపై విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. యువజన సర్వీసులశాఖ కమిషనర్‌ కె.శారదాదేవి కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. తూర్పు గోదావరి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) సహాయ సంచాలకులు వెంకటరమణమ్మ సభ్య కన్వీనర్‌గా, గుంటూరు ఎన్‌సీసీ సహాయకులు కె.కిజియా, న్యాయవాది ఎ.పూజిత, గుంటూరు జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఉజ్వల్‌ హోం ప్రాజెక్టు డైరెక్టర్‌ రొసలోనా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. శాప్‌లో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారుల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా క్రీడలు, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.


మిగులు విద్యుత్‌ అనేది కల్పిత భావన
గ్రిడ్‌ డిమాండ్‌కు మించి ఉత్పత్తి చేయం: ఇంధన శాఖ

ఈనాడు, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ వల్ల డిస్కంల దగ్గర మిగులు విద్యుత్‌ ఉందని భావించే పరిస్థితి లేదని ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పీపీఏల ద్వారా 2,225 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ వస్తుందని పేర్కొంది. ‘ఉత్పత్తి సన్నద్ధత ఆధారంగా వాటికి స్థిర ఛార్జీలను చెల్లిస్తాం. అవి ఉత్పత్తి చేసినా, లేకున్నా చెల్లించాలి. వాటి వాస్తవ ఉత్పత్తి యూనిట్లకు సంబంధించి రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా చెల్లిస్తాం. అదనంగా చెల్లించం’ అని వెల్లడించింది. ‘వివిధ విద్యుత్‌ వనరుల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం 89,243 ఎంయూల విద్యుత్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవధిలో విద్యుత్‌ వినియోగం 76,774 ఎంయూలు ఉండే అవకాశం ఉందని.. ఈ లెక్కల ప్రకారం 12,470 ఎంయూలు మిగులు విద్యుత్‌ ఉంటుందని భావిస్తున్నాం. మిగులు విద్యుత్‌ అనేది కల్పిత భావన మాత్రమే. గ్రిడ్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి ఉండాలి. అలా కాకుంటే గ్రిడ్‌ భద్రతకు ఇబ్బంది కలుగుతుంది’ అని పేర్కొంది. మస్ట్‌రన్‌ నిబంధనకు లోబడి పునరుత్పాదక విద్యుత్‌ సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌ పూర్తిగా తీసుకోవాలని.. ఈ సమయంలో గ్రిడ్‌ భద్రత దృష్ట్యా డిమాండ్‌ సర్దుబాటుకు థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి వస్తుందని తెలిపింది.


రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి
మాజీ మంత్రి అయ్యన్నకు సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: ఇంటి నిర్మాణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయ్యన్న ఇంటి నిర్మాణం విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, జల వనరుల శాఖ ఈఈ మల్లికార్జున్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు శుక్రవారం పిటిషన్‌ విచారణకు వచ్చింది. గత విచారణ సమయంలో జారీ చేసిన నోటీసులు తమకు రెండు రోజుల క్రితమే అందాయని అయ్యనపాత్రుడి తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. స్పందించిన ధర్మాసనం వాటికి రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.


ఏపీలో 1,82,375 డూప్లికేట్‌ రేషన్‌కార్డులు, తెలంగాణలో 77,874

ఈనాడు, దిల్లీ:  దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 55 లక్షల డూప్లికేట్‌ రేషన్‌కార్డులు ఉన్నాయని, వీటిలో ఏపీలో 1,82,375, తెలంగాణలో 77,874 ఉన్నట్లు తేలిందని కేంద్ర సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో శుక్రవారం తెలిపారు. రాష్ట్రాలు నిరంతరం సమీక్షించి, డూప్లికేట్‌ కార్డులను రద్దుచేసి, అర్హులకు కొత్తగా మంజూరు చేస్తాయన్నారు. ఏపీలో 2.68 కోట్లు, తెలంగాణలో 1.91 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులు ఉన్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని