‘నేరస్థుల గుండెల్లో..’ గూగుల్‌ టేక్‌అవుట్‌

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు కొన్ని గంటల ముందు (2019 మార్చి 14న సాయంత్రం 6.14 గంటల నుంచి 6.33 వరకూ) నిందితుడు సునీల్‌యాదవ్‌ కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిల ఇంట్లోనే ఉన్నాడు.

Updated : 22 Mar 2023 09:25 IST

సెకన్లతో సహా నిందితుల చరిత్రను అందిస్తున్న సాంకేతికత
వివేకా హత్య కేసు విచారణలో కీలకంగా ఈ ఆధారాలు
ఈనాడు, అమరావతి

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు కొన్ని గంటల ముందు (2019 మార్చి 14న సాయంత్రం 6.14 గంటల నుంచి 6.33 వరకూ) నిందితుడు సునీల్‌యాదవ్‌ కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిల ఇంట్లోనే ఉన్నాడు. వివేకాను చంపేందుకు గొడ్డలి కొనటానికి కదిరి వెళ్లిన షేక్‌ దస్తగిరి రాక కోసం అవినాష్‌రెడ్డి ఇంట్లో నిరీక్షించాడు. అతను అక్కడ ఉన్నప్పుడే సాయంత్రం 6.22 గంటల సమయంలో మరో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సునీల్‌యాదవ్‌కు రెండు సార్లు కాల్‌ చేసి  మాట్లాడారు.’

‘2019 మార్చి 14న రాత్రి 11.45 గంటలకు సునీల్‌యాదవ్‌, షేక్‌ దస్తగిరి వివేకా ఇంటి సమీపంలోనే ఉన్నారు. అర్ధరాత్రి  1.30 వరకూ అక్కడే మాటు వేశారు.’

‘వివేకా హత్య అనంతరం 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి సన్నిహితుడైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎంపీ ఇంటి వద్ద ఉన్నాడు. ఆ తర్వాత కేవలం 2 నిమిషాల వ్యవధిలో అంటే 6.27 గంటలకు వివేకానందరెడ్డి ఇంటి బయట ఉన్నాడు. 6.29 నుంచి 6.31 గంటల మధ్య వివేకా ఇంటి లోపల గడిపాడు.’

వివేకా హత్య కేసులోని నిందితులు ఘటన జరిగిన రోజు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో తెలిపే ఈ వివరాలను సీబీఐ ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది. నిమిషాలు, సెకన్లతో సహా వివరాలను సీబీఐ ఎలా సేకరించింది. సాంకేతిక ఆధారాలు, వాటి శాస్త్రీయతను ఎలా నిర్ధారించింది? అనే ప్రశ్నలకు వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం ‘‘గూగుల్‌ టేక్‌ అవుట్‌’’. అసలేంటీ సాంకేతికత? దర్యాప్తు సంస్థలు దీన్ని వినియోగించుకుంటున్నాయి? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఫోన్‌లో గూగుల్‌ ఖాతా ఉంటే చాలు

ఫోన్‌లోని గూగుల్‌ ఖాతాలో నిక్షిప్తమైన మొత్తం డేటాను జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ క్యాలెండర్‌ సహా మొత్తం 48 రకాల గూగుల్‌ సేవలతో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు, బదలాయించుకునేందుకు వీలు కల్పించే డేటా ఎక్స్‌పోర్ట్‌ సర్వీస్‌ టూలే.. గూగుల్‌ టేక్‌అవుట్‌. నేరాల ఛేదనలో దర్యాప్తు సంస్థలకు ఈ టూల్‌ కీలకంగా ఉపయోగపడుతోంది. అనుమానితులు, నిందితులు గూగుల్‌ ఖాతాకు సంబంధించిన డేటాను పొందటానికి, సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని గుర్తించటానికి, వారి ప్రమేయాన్ని తేల్చటానికి ఇది గొప్ప సాధనంగా మారింది. న్యాయస్థానంలోనూ దీన్ని ఒక ఆధారంగా సమర్పించొచ్చు.

నేరాల గుట్టు రట్టు చేయొచ్చు

సామాజిక మాధ్యమాల ద్వారా వేధిస్తున్న వారి ఫోన్‌ నుంచి సందేశాలు, గూగుల్‌ యాక్టివిటీ వంటివన్నీ గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా దర్యాప్తు అధికారులు తీసుకుని నేర నిరూపణకు ఆధారాలుగా ఉపయోగించొచ్చు.

ఆర్థిక నేరాల దర్యాప్తులోనూ గూగుల్‌ టేక్‌అవుట్‌ ఎంతో కీలకం. నిందితులు, అనుమానితులకు సంబంధించిన స్ప్రెడ్‌ షీట్లు, డాక్యుమెంట్లు, జీమెయిల్‌ ద్వారా పంపించిన మెయిళ్లు వంటి వాటిని తీసుకుని వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లొచ్చు.


వివేకా హత్య కేసులో ఇలా ఉపయోగించారు

వివేకా హత్య కేసులోనూ సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌రెడ్డిలకు సంబంధించిన కదలికలను గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారానే సీబీఐ అధికారులు తీసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించి నిర్ధారించుకున్నారు. దర్యాప్తులో అధికారులు గుర్తించిన అంశాలు, శాస్త్రీయ ఆధారాలతో పోల్చుకొని నిందితులను ప్రశ్నిస్తున్నారు.


ఎలా కీలకం అంటే?

గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా దర్యాప్తు సంస్థలు చట్టపరమైన అనుమతులు తీసుకుని నిందితుల జీమెయిల్‌ ఖాతా నుంచి పంపిన, వారికి వచ్చిన సందేశాలు, డ్రాఫ్ట్‌లు, తొలగించిన సందేశాలూ పొందొచ్చు.


‘గూగుల్‌ డ్రైవ్‌’లో సేవ్‌ చేసిన అన్ని రకాల ఫైల్స్‌ తీసుకోవచ్చు.


‘గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీ’ ద్వారా అనుమానితులు ఏయే అంశాల కోసం, ఏయే సమయాల్లో గూగుల్‌లో వెతికారో తెలుసుకోవచ్చు.


‘గూగుల్‌ క్యాలెండర్‌ ఈవెంట్స్‌’ ఆధారంగా వారు అంతకు ముందు హాజరైన కార్యక్రమాలు, వాటి లొకేషన్స్‌ వివరాలు, భవిష్యత్తులో హాజరుకావాలని నిర్ణయించుకున్న ఈవెంట్స్‌, లొకేషన్స్‌ వివరాలు పొందొచ్చు.


‘గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్‌ హిస్టరీ’ ద్వారా నిందితులు ఏ సమయంలో ఎక్కడున్నారు. అక్కడ ఎంత సమయం గడిపారో పొందొచ్చు. ఇతర గూగుల్‌ సర్వీసెస్‌తో ఆ వివరాల్నీ సరిపోల్చుకోవచ్చు.


ఇలా సేకరించిన బ్యాకప్‌ డేటాను విశ్లేషిస్తే నిందితుల ప్రతి కదలిక, చర్యలకు సంబంధించిన సమాచారం పక్కాగా లభిస్తుంది. అప్పటికే దర్యాప్తులో గుర్తించిన విషయాలను ఈ సమాచారంతో పోల్చుకొని నిందితుల్ని ప్రశ్నించేందుకు ఉపకరిస్తుంది. సెల్‌ఫోన్‌లో లొకేషన్‌ ఆఫ్‌ చేస్తే డేటా నిక్షిప్తం అవ్వదనుకోవడం భ్రమే.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు