మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. జీ20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన మారథాన్‌ను ఆదివారం మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు.

Published : 27 Mar 2023 04:52 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. జీ20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన మారథాన్‌ను ఆదివారం మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు. అక్కడే ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో పారాగ్లైడింగ్‌ ఏర్పాటు చేశారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి సురేష్‌ పారాగ్లైడింగ్‌ చేయడానికి ప్రయత్నించారు. ఎగిరే సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఓ పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన నిర్వాహకులు మోటార్‌ను నిలిపివేశారు. నేలపై ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులపై కలెక్టర్‌ మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా ప్రైవేటు సంస్థకు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై జిల్లా పర్యాటకశాఖ అధికారి శ్రీదేవిని సంప్రదించగా ముందుగానే పారాగ్లైడింగ్‌ ట్రయల్‌ రన్‌ చేశారని, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. గతంలో విశాఖ ఉత్సవ్‌ సమయంలో ఆ సంస్థ మూడు రోజులపాటు పారాగ్లైడింగ్‌ నిర్వహించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని