కోనసీమ అల్లర్ల కేసుల ఉపసంహరణ

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నమోదైన కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published : 29 Mar 2023 05:38 IST

ఆ జిల్లాకు చెందిన నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం భేటీ
కేసులన్నీ ఉపసంహరించుకుంటామన్న మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-అమలాపురం పట్టణం: కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నమోదైన కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ జిల్లాకు చెందిన వైకాపా నాయకులు, ప్రధాన సామాజికవర్గాల నేతలతో సీఎం జగన్‌ మంగళవారం సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, సామాజికవర్గాల నేతలు పాల్గొన్నారు. సమావేశం వివరాలను సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు సమావేశానికి వచ్చిన నేతలతో సీఎం మాట్లాడారు.

ఇప్పుడు అక్కడే ఉన్నారు.. రేపు అక్కడే పుట్టాలి

‘తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు. రేపైనా అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినపుడు వాటిని మరిచిపోయి మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది. కాదని లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది మనమే. అందువల్ల అందరం కలిసి ఉండాలి. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం. తప్పులు భూతద్దంలో చూసుకోకుండా కలిసిపోదాం.. అందరం ఒక్కటవుదాం. మిమ్మల్ని ఒక్కటి చేయడానికి, వివిధ సామాజికవర్గాల మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచేందుకు ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం. మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు రావడం మంచి పరిణామం. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి అన్నారు.

మేం వ్యక్తిగతంగా తీసుకోలేదు

మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ మాట్లాడుతూ.. ‘జరిగిన ఘటన దురదృష్టకరం, మేం ఊహించని ఘటన జరిగింది, భావోద్వేగాలతో జరిగింది. దీన్ని మేం వ్యక్తిగతంగా తీసుకోలేదు, కోనసీమలో మళ్లీ గొడవలు రాకుండా సీఎం తీసుకున్న చొరవకు మా ధన్యవాదాలు, మేం మనస్ఫూర్తిగా కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నాం’ అని తెలిపారు. ‘కేసులను ఉపసంహరించుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఈ కేసుల నుంచి అనేకమంది కళాశాలల విద్యార్థులను విముక్తుల్ని చేస్తున్నారు. మేమంతా సహకరిస్తాం’ అని కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల నేతలు సీఎంకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని