AP Police: విజయసాయిరెడ్డి, కేకే రాజు పేర్లకు షార్ట్‌‘కట్‌’.. పోలీసుల స్వామిభక్తి

కోర్టు ఆదేశాల అమలులోనూ పోలీసులు అధికారపార్టీకి స్వామిభక్తి చాటారు.

Updated : 01 May 2023 08:26 IST

ఈనాడు, విశాఖపట్నం: కోర్టు ఆదేశాల అమలులోనూ పోలీసులు అధికారపార్టీకి స్వామిభక్తి చాటారు. వైకాపా నేతలపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం చెప్పగా, నెలల తరబడి తాత్సారం చేయడమే కాకుండా, కేసు కట్టినట్లే కట్టి నిందితులను తప్పించేలా పేర్లు నమోదుచేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖకు చెందిన జనసేన నాయకురాలు ఎ.దుర్గ ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం.. బాధ్యులపై కేసు నమోదుకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు వైకాపా ఎంపీ వై.విజయసాయిరెడ్డి పేరును ‘వీఎస్‌ రెడ్డి’గా, రాష్ట్ర నెడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కమ్మిల కన్నప్పరాజు (కేకే రాజు) పేరును ‘కేకేఆర్‌’గా ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేయడం గమనార్హం. మిగిలిన ఇద్దరు నిందితుల పేర్లు యథావిథిగా నమోదుచేశారు. ఇలా పెట్టడం నిందితులను తప్పించడానికే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానం నుంచి నిందితుల ఇంటి పేరుతో సహా ఆదేశాలు వచ్చినా, ఇలా షార్ట్‌కట్‌లో చేర్చడం అనుమానాలకు తావిస్తోంది.

జరిగింది ఇదీ...

2021 నవంబరు 15న విశాఖ నగరపాలక సంస్థ 31వ వార్డుకు ఉప ఎన్నిక జరుగుతుండగా, 16వ బూత్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్నారన్న సమాచారంతో జనసేన నాయకులు అక్కడికి వెళ్లారు. జనసేన నాయకురాలు ఎ.దుర్గ, కొందరు మహిళా నేతలను అడ్డుకునేందుకు వైకాపా నేతలు యత్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కె.కె.రాజు, ముత్తు సునీల్‌కుమార్‌, బాయిన సునీల్‌కుమార్‌ తదితరులు తమను దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని మహిళా నేతలు ఆరోపించారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. జనసేన నాయకురాలు దుర్గ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలు విశాఖ న్యాయస్థానంలో ప్రైవేటుగా క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. వాదనలు విన్న ఒకటో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం న్యాయాధికారి సీహెచ్‌ యుగంధర్‌ బాధ్యులపై కేసులు నమోదుచేయాలని ఆదేశించారు.

ఆరు నెలలు తాత్సారం చేసి...

కోర్టు ఆదేశించినా రెండో పట్టణ పోలీసులు జాప్యం చేశారు. ఆరు నెలలు పోలీసులు కేసు పెట్టలేదని ఫిర్యాది తరఫు న్యాయవాది యర్రా రేవతి ఆరోపించారు. బందోబస్తులు, ఇతర కారణాలు సాకుగా చూపించారన్నారు. ఏప్రిల్‌ 21న ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి నిందితులకు నోటీసు జారీచేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి, కేకే రాజు పేర్లను మాత్రం షార్ట్‌కట్‌లో రాశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐ తిరుమలరావు వివరణ కోరేందుకు సెల్‌ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో ఉన్న బాయిన సునీల్‌కుమార్‌పై ఇటీవల తాజాగా దొంగతనం పేరుతో ఓ బాలుడిని చావబాదిన ఘటనపై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని