ఔషధ కర్మాగారం వద్దంటూ గ్రామస్థుల ఆందోళన

ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధ కర్మాగారం తమకు వద్దంటూ గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

Published : 21 May 2023 03:27 IST

గోపాలపురం, న్యూస్‌టుడే: ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధ కర్మాగారం తమకు వద్దంటూ గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సగ్గొండ పంచాయతీ పరిధి గోపవరంలో శనివారం జరిగింది. గోపవరం శివారులో కొత్తగా ఔషధ కర్మాగారం నిర్మించేందుకు అనుమతుల కోసం యాజమాన్యం పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతోందని గ్రామస్థులు అన్నారు. అలా ఏర్పాటుచేస్తే.. జల, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఇటీవల దీనిపై సర్పంచిని అడిగితే అనుమతి ఇవ్వలేదని చెప్పారన్నారు. రెండురోజుల కిందట తక్కువ మంది పాలకవర్గ సభ్యులతో తీర్మానం చేసి ఇచ్చేశారని ఆరోపించారు. ప్రజల అనుమతి లేకుండా అనుమతులు ఎలా ఇస్తారని సర్పంచిని, కార్యదర్శిని నిలదీశారు. ఎస్సై రామకృష్ణ వచ్చి.. సర్పంచి, కార్యదర్శితో మాట్లాడి గ్రామసభ ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 25న గ్రామసభ నిర్వహిస్తామని కార్యదర్శి అనురాధ తెలిపారు. సర్పంచి మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా బదిలీ చేయడానికే పంచాయతీ తీర్మానం ఇచ్చామన్నారు. దీనిపై తహసీల్దారు రవీంద్రనాథ్‌ను వివరణ కోరగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పంచాయతీ తీర్మానం కోరుతూ సగ్గొండ కార్యదర్శికి పత్రాలు పంపామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు