Srisaila Devasthanam: నొప్పించకుండా.. తప్పించుకున్నారు!

రాష్ట్రంలో ఆధ్యాత్మిక, దైవ సంబంధ కార్యక్రమం ఏదైనా.. తన నిర్ణయానుసారం జరగాలని కోరుకునే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే పీఠాధిపతి ఒకవైపు.. వందల ఏళ్లుగా విశిష్ఠత కలిగిన ప్రముఖ పీఠం మరోవైపు.. వీరిలో ఎవరిని తక్కువ చేసినా ఇబ్బందే.

Updated : 22 May 2023 07:40 IST

చర్చనీయాంశంగా శ్రీశైలం మహా కుంభాభిషేకం వాయిదా
ప్రభుత్వ పెద్దల స్వామీజీ ఆధ్వర్యంలో జరిగేలా ఏర్పాట్లు
దీనిపై కంచి పీఠం అభ్యంతరం?

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక, దైవ సంబంధ కార్యక్రమం ఏదైనా.. తన నిర్ణయానుసారం జరగాలని కోరుకునే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే పీఠాధిపతి ఒకవైపు.. వందల ఏళ్లుగా విశిష్ఠత కలిగిన ప్రముఖ పీఠం మరోవైపు.. వీరిలో ఎవరిని తక్కువ చేసినా ఇబ్బందే. ప్రభుత్వానికి సన్నిహితమైన పీఠాధిపతి ఇటీవలే మహాయజ్ఞం సందర్భంగా కొంత అలక వహిస్తే, ఎలాగోలా ఆయన్ను రప్పించారు. ఈ తరుణంలో శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం ఎందుకని.. ఏకంగా ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి 31 వరకు శ్రీశైలంలో మహారుద్ర శతచండీ సహిత వేదస్వాహాకార పూర్వక మహా కుంభాభిషేకం నిర్వహించాలని ముందే నిర్ణయించారు. గతంలోనే సీఎం జగన్‌ను కలిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అనూహ్యంగా దీన్ని వాయిదా వేస్తున్నామని, కార్తీకమాసంలో నిర్వహిస్తామంటూ దేవాదాయ కమిషనర్‌ జారీ చేసిన ప్రకటన అందరినీ విస్తుగొలిపింది. దీనివెనుక ఏం జరిగిందనేది దేవాదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

విజయవాడలో ఇటీవల జరిగిన మహాయజ్ఞానికి ఇతర పీఠాధిపతులను పిలవడంపై ప్రభుత్వ పెద్దల కీలకస్వామి కొంత అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చివరి రోజు పూర్ణాహుతికి రావడంపై సందిగ్ధత ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. చివరకు ఎలాగోలా ఆయన్ను రప్పించారు. మహాయజ్ఞానికి కంచి పీఠాధిపతి, తిరుమల పెద్దజీయ్యంగార్‌, చినజీయర్‌స్వామి వంటివారు హాజరుకాలేదు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కంచి వెళ్లి, అక్కడి పీఠాధిపతిని కలిసినట్లు సమాచారం. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే స్వామి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం అంటే, తాము రాలేమని వారు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొనడంతో.. చివరకు వాయిదా వేసినట్లు చర్చ జరుగుతోంది. దీనికి వేసవి, వడగాడ్పులు కారణాన్ని సాకులా చూపారని చెబుతున్నారు.

ఆలయ సొమ్ము వృథా

ఇప్పటికే శ్రీశైలంలో యాగం, మహా కుంభాభిషేకం కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ నాలుగు రాజగోపురాలు, స్వామి అమ్మవార్లకు చెందిన రెండు గర్భాలయ విమాన గోపురాలు, ఆలయం లోపల, వెలుపల ఉన్న ఉపాలయాలకు కుంభాభిషేకం కోసం పరంజ ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక యాగ గుండాలు ఏర్పాటుతో పాటు పెద్దఎత్తున ఆహ్వానాలు ముద్రించి అందజేశారు. ఇప్పుడు అర్ధాంతరంగా వాయిదా వేయడంతో ఇవన్నీ వృథాయేనని చెబుతున్నారు. మరోవైపు మహాకుంభాభిషేకం వంటివి ఉత్తరాయణంలో నిర్వహిస్తుంటారని, జూన్‌ మొదటి వారం తర్వాత ఉత్తరాయణం ముగిసి, దక్షిణాయనం వస్తుందని అటువంటప్పుడు కార్తీకమాసంలో ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


అర్చక శిక్షణ అకాడమీ డైరెక్టర్‌ రాజీనామా

విజయవాడలో జరిగిన మహాయజ్ఞంలో చోటు చేసుకున్న పరిణామాలతో అర్చక శిక్షణ అకాడమీ డైరెక్టర్‌ వేందాంతం రాజగోపాలచక్రవర్తి తన పదవులకు రాజీనామా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 12న మహాయజ్ఞం ప్రారంభం రోజు సీఎం జగన్‌ హాజరయ్యారు. అప్పట్లో ఆ పరిసరాల్లోకి రాజగోపాలచక్రవర్తిని రానివ్వలేదు. దీంతో అదే రోజు తాను రాజీనామా చేస్తున్నట్లు వాట్సప్‌ ద్వారా ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ)కు సందేశం పంపినట్లు సమాచారం. మంత్రి ఆయనకు నచ్చజెప్పి మహాయజ్ఞం ఆయన పర్యవేక్షణలో జరిగేలా చూశారు. మళ్లీ 17న చివరిరోజు పూర్ణాహుతికి సీఎం వచ్చినపుడు కూడా మరోసారి రాజగోపాలచక్రవర్తిని సమీపంలో ఉండనివ్వలేదు. దీంతో 18న ఆయన తన రాజీనామాను లిఖతపూర్వకంగా ఉప ముఖ్యమంత్రికి, దేవాదాయ కమిషనర్‌కు పంపినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు