రవాణా ఖర్చులు తగ్గించాలి

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో రవాణా (లాజిస్టిక్స్‌) ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి కేంద్రం సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని విస్తృతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

Published : 28 May 2023 05:09 IST

జీడీపీలో తయారీ, సేవల రంగం వాటాను ప్రపంచస్థాయి సగటుకు తీసుకెళ్లాలి
నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్‌ నోట్‌ సమర్పణ

ఈనాడు, దిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో రవాణా (లాజిస్టిక్స్‌) ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి కేంద్రం సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని విస్తృతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. శనివారం ఇక్కడి ప్రగతి మైదాన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలో పాల్గొని వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించే నోట్‌ను సీఎం సమర్పించారు. వివరాలివి.
- ఆర్థిక వ్యవస్థ పురోగతికి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. దేశంలో లాజిస్టిక్స్‌ ఖర్చు జీడీపీలో 14శాతం ఉంది. మన దేశ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకమవుతోంది. అమెరికాలో ఈ ఖర్చు 7.5 శాతమే. మనం ఆశించిన ఫలితాలను సాధించాలంటే ఈ ఖర్చులు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశాం. విశాఖలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. 

* జీడీపీలో తయారీ, సేవలరంగం వాటా 85% దాటినప్పుడే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం నెరవేరుతుంది. ప్రపంచంలో ఈ రెండు రంగాల సగటు వాటా 91.5% ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ రంగాల వాటా పెంచాలంటే పెట్టుబడులు  అవసరం. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి.

* విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2023కు విశేష స్పందన లభించించింది. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకొచ్చాయి. దీనివల్ల దాదాపు 6లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

* ప్రజారోగ్యం, పోషకాహారం చాలా ముఖ్యం. జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే వ్యాధులను నిరోధించాలి.

* నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం మరొక కీలకాంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా ఆ దేశాలు శ్రామికశక్తి కొరతను ఎదుర్కొనబోతున్నాయి. అదృష్టవశాత్తూ మన దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయసున్నవారే ఉన్నారు. ఇది దేశానికి ప్రయోజనకరం. అర్థవంతమైన, క్రియాశీల నైపుణ్యాలను నేర్చుకునేలా మనం పాఠ్యాంశాల్లో కొత్తవి ప్రవేశపెట్టాలి. 

* చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నాలుగేళ్లుగా స్థిరంగా ఆర్థికసాయం చేస్తున్నాం.

* మహిళా స్వయంసహాయక సంఘాలపై ఉన్న అధిక అప్పుల భారం వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే సంఘాలకు సున్నా వడ్డీ కార్యక్రమం కింద ప్రభుత్వం గణనీయంగా వడ్డీ రాయితీనిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని